'ఎన్నికల హామీల్లో టీడీపీ దారుణ విఫలం'
తిరుపతి: ఎన్నికల హామీలు నెరవేర్చడంలో బీజేపీ, టీడీపీలు రెండూ పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. పిల్లల్ని కనడం అంటే మతాల మధ్య చిచ్చుపెట్టడమేనని ఆయన అన్నారు. ఒక పథకం ప్రకారమే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో భూసంస్కరణ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం దారుణమైన అంశమని నారాయణ దుయ్యబట్టారు.
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలోనూ అవకతవకలు జరిగాయని ఆయన విమర్శించారు. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం అమ్మేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.