ఊపిరి నిలిపేరా? | TDP focus on strengthening party in Medak district | Sakshi
Sakshi News home page

ఊపిరి నిలిపేరా?

Published Wed, Dec 4 2013 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM

TDP focus on strengthening party in Medak district

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీకి ‘ఇన్‌చార్జీ’ల నియామకంతో జవసత్వాలను నింపాలని ఆ పార్టీ అధినేత ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల టీడీపీకి లీడర్, కేడర్‌లేని పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జీల నియామకం పేరిట జనం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. గత నెల 28న హైదరాబాద్‌లో జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో త్వరలో ఇన్‌చార్జీలను నియమిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రేపో మాపో నియోజకవర్గ ఇన్‌చార్జీల నియామక ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇన్‌చార్జి పదవి దక్కించుకునేందుకు నేతలెవరూ పెద్దగా ఆసక్తి చూపుతున్న దాఖలా కనిపించడం లేదు.
 
 ప్రస్తుతం మెదక్, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్ మినహా మిగతా నియోజకవర్గాలకు చాలా కాలంగా ఇన్‌చార్జీలను ఖరారు చేయలేక పోయారు. ద్వి, త్రిసభ్య కమిటీల పేరు తో సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్, పటాన్‌చెరు, సంగారెడ్డిలో నామమాత్రంగా పార్టీ కొనసాగుతూ వస్తోంది. మెదక్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు వచ్చే ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మల్కాజిగి రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఆయన మెదక్ నియోజకవర్గంలో అడపా దడపా పర్యటించి వెళ్తున్నారు. అందోలుకు మాజీ మంత్రి బాబూమోహన్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నా స్థానిక కేడర్‌తో పెద్దగా సంబంధాలు కొనసాగించడం లేదు. గజ్వేల్, నారాయణఖేడ్, జహీరాబాద్‌లో పార్టీ ఇన్‌చార్జీలు  వ్యక్తిగత సంబంధాలతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే యోచనలో వున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు బంధువు మదన్‌మోహన్‌రావు ఇటీవల జిల్లాలో నిర్వహించిన సైకిల్ యాత్ర కూడా మొక్కుబడిగా సాగింది.
 
 ఆ ఐదుగురు ఎవరో?
 సిద్దిపేటలో కొమాండ్ల రామచంద్రారెడ్డి, భూపేశ్, దుబ్బాకలో బక్కి వెంకటయ్య, రమేశ్, నర్సాపూర్‌లో రఘువీర్‌రెడ్డి, అశోక్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే దేవర వాసుదేవరావు, సంగారెడ్డిలో శివరాజ్‌పాటిల్, పట్నం మాణిక్యం నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్నారు. పటాన్‌చెరులో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఉన్నప్పటికీ పటాన్‌చెరు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ సపాన్‌దేవ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. దుబ్బాక జనరల్ స్థానంలో రిజర్వుడు కేటగిరీకి చెందిన బక్కి వెంకటయ్యకు ఇన్‌చార్జి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. మెదక్ నుంచి వ చ్చే ఎన్నికల్లో మైనంపల్లి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, ఏకే గంగాధర్‌రావు పేర్లు తెరమీదకు వచ్చే అవకాశమూ లేకపోలేదు. స్థానిక నేతలతో సఖ్యత లేకున్నా అందోలులో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇన్‌చార్జిగా బాబూమోహన్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్‌చార్జీలుగా నియమితులయ్యేవారే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తారని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయినా వరుస పరాజయాలు, వలసతో నిర్వీర్యమైన పార్టీకి నియోజకవర్గ ఇన్‌చార్జీలను నియమించినా కొత్తగా ఒనగూరేదేమీ కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement