incharge appointment
-
6 మండలాలు, 2 మున్సిపాలిటీలకు ఇన్చార్జిల నియామకం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా కార్యాచరణకు బీజేపీ స్టీరింగ్ కమిటీ నడుం బిగించింది. దసరా తర్వాత అక్కడ గడపగడపకూ బీజేపీ పేరిట కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ నియోజకవర్గం పరిధిలో కేంద్రమంత్రులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రమంత్రులు, ముఖ్యనేతలతో ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తే మంచిదనే దానిపై చర్చించింది. మునుగోడులోని ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇన్చార్జి, ఇద్దరు సహ ఇన్చార్జిల చొప్పున 24 మందిని నియమించింది. ఎమ్మెల్యే, మాజీ ఎంపీలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. సంస్థాన్ నారాయణపూర్‌కు ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, మునుగోడుకు చాడ సురేశ్‌రెడ్డి, మర్రిగుడెంకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చౌటుప్పల్‌కు కూన శ్రీశైలంగౌడ్, నాంపల్లికి ఏనుగు రవీందర్‌రెడ్డి, చండూర్‌కు నందీశ్వర్‌గౌడ్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, చండూర్ మున్సిపాలిటీకి ఎం.ధర్మారావులను నియమించింది. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఈ భేటీ అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల్లో సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత గురించి పార్టీపరంగా చార్జ్‌షీట్ సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 27న చౌటుప్పల్ మండలంలో మండల ఇన్చార్జీల సమావేశం ఉంటుందన్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డి, స్టీరింగ్ కమిటీ సమన్వయకర్త డా.గంగిడి మనోహర్‌రెడ్డి, సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, కె.స్వామిగౌడ్, యెండెల లక్ష్మీనారాయణ, గరికపాటి మోహన్‌రావు, డా.దాసోజు శ్రవణ్ హాజరయ్యారు. హెచ్‌సీఏలో గందరగోళం ఇలా.. కల్వకుంట్ల కుటుంబం కారణంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో గందరగోళ పరిస్థితి నెలకొందని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ ఆరోపించారు. కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారన్నారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీ చేయొద్దని తనకు కేసీఆర్ సూచించారన్నారు. -
ఆగ్రహ జ్వాలలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల ఎంపిక వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది. ఇన్చార్జిల నియామకాలకు శ్రీకారం చుట్టి ఒక్కరోజు కూడా గడవక ముందే ఆ పార్టీలో ముసలం పుట్టింది. కోవూరు తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జి ఎంపిక కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సన్నిహితుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఇంటింటికి టీడీపీ పేరుతో జరుపుతున్న పాదయాత్రకు అధిష్టానం బ్రేక్ వేసింది. పాదయాత్రను వెంటనే నిలిపివేసి హైదరాబాద్ రావాల్సిందిగా ఎన్టీయార్ ట్రస్ట్భవన్ నుంచి సోమవారం ఉదయం ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన పాదయాత్రకు పుల్‌స్టాప్ పెట్టి హుటాహుటిన రాజధానికి పయనమయ్యారు. అదే సమయంలో సోమవారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి భేటీ అయ్యారు. ఈ పరిణామాలు నియోజకవర్గపార్టీలో అంతర్గత కలహాలకు దారితీస్తున్నాయి. ఒక వర్గం నాయకులు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని, మరో వర్గం పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని ప్రతిపాదిస్తోంది. ఈ ఇద్దరు కాకుండా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కూడా ఇన్చార్జి పదవిని ఆశిస్తున్నారు. మూడు రోజుల కిందట ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాలపై అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. అనూహ్యంగా ఆత్మకూరు ఇన్చార్జి పదవిని కన్నబాబుకు ఇస్తూ అదివారం ప్రకటించారు. కోవూరుకు వచ్చే సరికి పీటముడి పడింది. నలుగురు రేసులో ఉన్నప్పటికీ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పారిశ్రామికవేత్త పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పోలంరెడ్డికి అవకాశాలు మెండుగా ఉండటం, పాదయాత్రను నిలిపివేయాలని పెళ్లకూరుకు ఆదేశాలు రావడంతో ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. కాంగ్రెస్‌లో ఉంటూ పదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన పోలంరెడ్డికి ఇన్చార్జి పదవి ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో పది సంవత్సరాలు అధికారం అనుభవించి అక్కడ మనుగడ లేదని తెలిసిన తరువాత టీడీపీ ఆదరించడం అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుందని వారు అధిష్టానానికి స్పష్టం చేసినట్టు సమాచారం. వెంటనే పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఇన్చార్జి పదవిని ప్రకటించకపోతే రాజీనామాలు చేస్తామని ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు మండలాలకు చెందిన పార్టీ ముఖ్యులు అధిష్టానానికి హెచ్చరికలు పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కోవూరు ఉప ఎన్నికల తరువాత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పార్టీకి దిక్కయ్యారని అంటున్నారు. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు లక్షల రూపాయలు ఖర్చు చేసిన నేతను వదిలేసి సొంత లాభం కోసం గోడ దూకుతున్న వారికి ప్రాధాన్యం ఎలా ఇస్తారని వాపోతున్నారు. సోమవారం నాటి పరిణామాలతో ఆ పార్టీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. నేడు నిర్ణయం కోవూరు ఇన్చార్జి ఎంపిక వ్యవహారానికి మంగళవారం ముగింపు పలకాలని అధిష్టానం భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదవిని ఆశిస్తున్న పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డితో ఎన్టీయార్ ట్రస్ట్‌భవన్‌లో చర్చలు జరపేందుకు నిర్ణయం తీసుకున్నారు. వ్యవహారం ఒక కొలిక్కి తెచ్చిన తరువాత ఇద్దరిని చంద్రబాబుతో మాట్లాడించి అదే రోజు ఇన్చార్జి ఎంపికను అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. అయితే పోలంరెడ్డి మాత్రం సంక్రాంతి పండగ తరువాత పార్టీలో చేరుతానని బాబుతో చెప్పినట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 10వ తేదీ నుంచి నియోజకవర్గంలో పర్యటించేందుకు పోలంరెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి. పెళ్లకూరు ఇంటి వద్ద సందడి పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేసిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని నియోజకవర్గంలోని పలు మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు సోమవారం నెల్లూరులోని ఆయన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము వెంటనే పార్టీకి రాజీనామాలు చేస్తామని చెప్పగా పెళ్లకూరు సర్ది చెప్పినట్లు తెలిసింది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలను ఆదరించిన వారిని విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని కొందరు అక్కడే శాపనార్థాలు పెట్టినట్టు సమాచారం. -
ఊపిరి నిలిపేరా?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీకి ‘ఇన్చార్జీ’ల నియామకంతో జవసత్వాలను నింపాలని ఆ పార్టీ అధినేత ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల టీడీపీకి లీడర్, కేడర్‌లేని పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్చార్జీల నియామకం పేరిట జనం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. గత నెల 28న హైదరాబాద్‌లో జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో త్వరలో ఇన్చార్జీలను నియమిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రేపో మాపో నియోజకవర్గ ఇన్చార్జీల నియామక ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇన్చార్జి పదవి దక్కించుకునేందుకు నేతలెవరూ పెద్దగా ఆసక్తి చూపుతున్న దాఖలా కనిపించడం లేదు. ప్రస్తుతం మెదక్, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్ మినహా మిగతా నియోజకవర్గాలకు చాలా కాలంగా ఇన్చార్జీలను ఖరారు చేయలేక పోయారు. ద్వి, త్రిసభ్య కమిటీల పేరు తో సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డిలో నామమాత్రంగా పార్టీ కొనసాగుతూ వస్తోంది. మెదక్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు వచ్చే ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మల్కాజిగి రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఆయన మెదక్ నియోజకవర్గంలో అడపా దడపా పర్యటించి వెళ్తున్నారు. అందోలుకు మాజీ మంత్రి బాబూమోహన్ ఇన్చార్జిగా పనిచేస్తున్నా స్థానిక కేడర్‌తో పెద్దగా సంబంధాలు కొనసాగించడం లేదు. గజ్వేల్, నారాయణఖేడ్, జహీరాబాద్‌లో పార్టీ ఇన్చార్జీలు వ్యక్తిగత సంబంధాలతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే యోచనలో వున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు బంధువు మదన్మోహన్రావు ఇటీవల జిల్లాలో నిర్వహించిన సైకిల్ యాత్ర కూడా మొక్కుబడిగా సాగింది. ఆ ఐదుగురు ఎవరో? సిద్దిపేటలో కొమాండ్ల రామచంద్రారెడ్డి, భూపేశ్, దుబ్బాకలో బక్కి వెంకటయ్య, రమేశ్, నర్సాపూర్‌లో రఘువీర్‌రెడ్డి, అశోక్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే దేవర వాసుదేవరావు, సంగారెడ్డిలో శివరాజ్‌పాటిల్, పట్నం మాణిక్యం నియోజకవర్గ ఇన్చార్జి పదవిని ఆశిస్తున్నారు. పటాన్చెరులో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఉన్నప్పటికీ పటాన్చెరు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ సపాన్‌దేవ్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. దుబ్బాక జనరల్ స్థానంలో రిజర్వుడు కేటగిరీకి చెందిన బక్కి వెంకటయ్యకు ఇన్చార్జి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. మెదక్ నుంచి వ చ్చే ఎన్నికల్లో మైనంపల్లి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, ఏకే గంగాధర్‌రావు పేర్లు తెరమీదకు వచ్చే అవకాశమూ లేకపోలేదు. స్థానిక నేతలతో సఖ్యత లేకున్నా అందోలులో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇన్చార్జిగా బాబూమోహన్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్‌చార్జీలుగా నియమితులయ్యేవారే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తారని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయినా వరుస పరాజయాలు, వలసతో నిర్వీర్యమైన పార్టీకి నియోజకవర్గ ఇన్చార్జీలను నియమించినా కొత్తగా ఒనగూరేదేమీ కనిపించడం లేదు.