సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల ఎంపిక వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది. ఇన్‌చార్జిల నియామకాలకు శ్రీకారం చుట్టి ఒక్కరోజు కూడా గడవక ముందే ఆ పార్టీలో ముసలం పుట్టింది. కోవూరు తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇన్‌చార్జి ఎంపిక కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సన్నిహితుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఇంటింటికి టీడీపీ పేరుతో జరుపుతున్న పాదయాత్రకు అధిష్టానం బ్రేక్ వేసింది.
పాదయాత్రను వెంటనే నిలిపివేసి హైదరాబాద్ రావాల్సిందిగా ఎన్టీయార్ ట్రస్ట్‌భవన్ నుంచి సోమవారం ఉదయం ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన పాదయాత్రకు పుల్‌స్టాప్ పెట్టి హుటాహుటిన రాజధానికి పయనమయ్యారు. అదే సమయంలో సోమవారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి భేటీ అయ్యారు. ఈ పరిణామాలు నియోజకవర్గపార్టీలో అంతర్గత కలహాలకు దారితీస్తున్నాయి. ఒక వర్గం నాయకులు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని, మరో వర్గం పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని ప్రతిపాదిస్తోంది. ఈ ఇద్దరు కాకుండా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కూడా ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్నారు. మూడు రోజుల కిందట ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాలపై అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. అనూహ్యంగా ఆత్మకూరు ఇన్‌చార్జి పదవిని కన్నబాబుకు ఇస్తూ అదివారం ప్రకటించారు. కోవూరుకు వచ్చే సరికి పీటముడి పడింది. నలుగురు రేసులో ఉన్నప్పటికీ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పారిశ్రామికవేత్త పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పోలంరెడ్డికి అవకాశాలు మెండుగా ఉండటం, పాదయాత్రను నిలిపివేయాలని పెళ్లకూరుకు ఆదేశాలు రావడంతో ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి.
కాంగ్రెస్‌లో ఉంటూ పదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన పోలంరెడ్డికి ఇన్‌చార్జి పదవి ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో పది సంవత్సరాలు అధికారం అనుభవించి అక్కడ మనుగడ లేదని తెలిసిన తరువాత టీడీపీ ఆదరించడం అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుందని వారు అధిష్టానానికి స్పష్టం చేసినట్టు సమాచారం. వెంటనే పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఇన్‌చార్జి పదవిని ప్రకటించకపోతే రాజీనామాలు చేస్తామని ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు మండలాలకు చెందిన పార్టీ ముఖ్యులు అధిష్టానానికి హెచ్చరికలు పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కోవూరు ఉప ఎన్నికల తరువాత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పార్టీకి దిక్కయ్యారని అంటున్నారు. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు లక్షల రూపాయలు ఖర్చు చేసిన నేతను వదిలేసి సొంత లాభం కోసం గోడ దూకుతున్న వారికి ప్రాధాన్యం ఎలా ఇస్తారని వాపోతున్నారు. సోమవారం నాటి పరిణామాలతో ఆ పార్టీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
నేడు నిర్ణయం
కోవూరు ఇన్‌చార్జి ఎంపిక వ్యవహారానికి మంగళవారం ముగింపు పలకాలని అధిష్టానం భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదవిని ఆశిస్తున్న పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డితో ఎన్టీయార్ ట్రస్ట్‌భవన్‌లో చర్చలు జరపేందుకు నిర్ణయం తీసుకున్నారు. వ్యవహారం ఒక కొలిక్కి తెచ్చిన తరువాత ఇద్దరిని చంద్రబాబుతో మాట్లాడించి అదే రోజు ఇన్‌చార్జి ఎంపికను అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. అయితే పోలంరెడ్డి మాత్రం సంక్రాంతి పండగ తరువాత పార్టీలో చేరుతానని బాబుతో చెప్పినట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 10వ తేదీ నుంచి నియోజకవర్గంలో పర్యటించేందుకు పోలంరెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి.
పెళ్లకూరు ఇంటి వద్ద సందడి
పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేసిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని నియోజకవర్గంలోని పలు మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు సోమవారం నెల్లూరులోని ఆయన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము వెంటనే పార్టీకి రాజీనామాలు చేస్తామని చెప్పగా పెళ్లకూరు సర్ది చెప్పినట్లు తెలిసింది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలను ఆదరించిన వారిని విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని కొందరు అక్కడే శాపనార్థాలు పెట్టినట్టు సమాచారం.
ఆగ్రహ జ్వాలలు
Published Tue, Jan 7 2014 4:53 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement