అజ్ఞాతంలోనే మాజీ విప్‌ కూన | TDP Former Vip Koona Ravi Kumar On Under Ground | Sakshi
Sakshi News home page

అజ్ఞాతంలోనే మాజీ విప్‌ కూన

Published Thu, Aug 29 2019 8:01 AM | Last Updated on Thu, Aug 29 2019 10:43 AM

TDP Former Vip Koona Ravi Kumar On Under Ground - Sakshi

సాక్షి, ఆమదాలవలస, (శ్రీకాకుళం) : మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. రెండు రోజులుగా పోలీసులు గాలిస్తున్నా ఆయన ఆచూకీ దొరకడం లేదు. అయితే ఆయనతో పాటు కేసులో ఉన్న పదకొండు మందిలో పది మంది పోలీసులకు లొంగిపోయారు. మరో వ్యక్తి మాత్రం కూనతోపాటే అజ్ఞాతంలో ఉన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలోకి జొరబడి ప్రభుత్వ అధికారులపై దుర్భాషలాడినందుకు కూనతో పాటు 11 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై రెండు రోజు లుగా విచారణ నిర్వహిస్తున్నారు. నిందితుల స్వగ్రామాలు కూనజమ్మన్నపేట, తెలికిపెంట, వ్యాసులపేట, పెద్దసవలాపురం, రొట్టవలస, సింధువాడ, సరుబుజ్జిలి, చిగురువలస గ్రామాల్లో సోదాలు కూడా నిర్వహించారు.

నిందితుల కుటుంబ సభ్యులను కూడా పూర్తిస్థాయిలో విచారణ చేశారు. ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం టీడీపీ నాయకులు కళా వెంకటరావు, చౌదరి బాబ్జీరావులు ఆమదాలవలస పోలీస్‌ సర్కిర్‌ కార్యాలయంలో డీఎస్పీ చక్రధరరావు ఎదుట పది మంది నిందితులను హాజరుపరిచారు. కూన అమ్మినాయుడు, కూన సంజీవరావు, నందివాడ గోవిందరావు, పల్లి సురేష్, గండెం రవి, తాడేల రమణ, యండ రామారావు,  గుర్రాల చినబాబు, ఊడవల్లి రామకృష్ణ, బాన్న గురువులు హాజరయ్యారు. ఈ కేసులో అంబళ్ల రాంబాబు, కూన రవికుమార్‌లు పరా రీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారిని ఆమదాలవలసలోగల సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.జోత్సత్న  తీర్పునిస్తూ వీరికి 14 రోజులు రిమాండ్‌కు పంపించారు. నిందితులను సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం సబ్‌జైల్‌కు తరలించారు. 

టీడీపీ కార్యకర్తల హడావుడి 
నిందితులను పోలీస్‌స్టేషన్, కోర్టుకు తరలిస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలు హడావుడి చేశారు. వీరికి బెయిల్‌ వస్తుందని ఆశించినా అలా జరక్కపోవడంతో అవాక్కయ్యారు. రిమాండ్‌కు తరలించడంతో ఇక నుంచి గొడలకు దూరంగా ఉండాలని, ఇలా సమావేశాలకు వెళ్లి తమ భవిష్యత్‌లు పాడు చేసుకోకూడదని పలువురు చర్చించుకున్నారు. తమ నాయకుడు కూన రవికుమార్‌ వారితో కోర్టుకు హాజరు కాకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కూడా నాయకుడి అండదండలు కార్యకర్తలకు లభించలేదని వారంతా చర్చించుకున్నారు. 

విశాఖలో ఉన్నారా..? 
ఎంపీడీఓపై దురుసుగా ప్రవర్తించి కేసు ఎదుర్కొంటున్న మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. బుధవారం ఆయన అనుచరులు పది మంది స్వచ్ఛందంగా లొంగి పోయారు. కానీ మాజీ విప్‌ మాత్రం జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని పరారీలోనే ఉండిపోయినట్లు సమాచారం. పోలీసులు ఆమదాలవలస, పొందూరు, శ్రీకాకుళం తదితర ప్రాంతా ల్లో నిఘా వేసి ఉంచారు. వాహనాలు కూడా తనిఖీ చేస్తున్నారు. దీనికి బెదిరిపోయిన కూన విశాఖపట్టణంలోని గాజువాక, పెందుర్తి ఏరి యాల్లో మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పల్లా సత్యనారాయణ ఇళ్లలో తలదాచుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిఘా వర్గాలు, ప్రత్యేక బలగాల సాయంతో పోలీసులు వేట ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడతోపాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. స్థానికంగా చేసిన బెయిల్‌ ప్రయత్నాలు విఫలం కావడంతో అమరావతి స్థాయిలో ఉన్న న్యాయవాదుల ద్వారా టీడీపీ సీనియర్‌ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. 

కూన ఇంటి వద్ద ఉద్రిక్తత
శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్‌ కాలనీలో ఉన్న మాజీ విప్‌ కూన రవికుమార్‌ ఇంటి వద్ద బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ చక్రవర్తి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, పది మంది పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేసేందుకు వచ్చారు. రవికుమార్‌ భార్య ప్రమీలతోపాటు ఆయన బంధువులు, అనుచరులు పోలీసులను అడ్డుకున్నా రు. సెర్చ్‌ వారెంట్‌ చూపించాలని డిమాండ్‌ చేశారు. కొద్దిసేపు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో లోపలికి వెళ్లి పరిశీలించారు. అయితే పూర్తి స్థాయిలో తనిఖీ చేయనివ్వకపోవడంతో ఒకటి రెం డు గదులను మాత్రమే తనిఖీ చేశారు.

అక్కడ రవికుమార్‌ లేకపోవడంతో వెళ్లిపోయారు. అనంతరం రవికుమార్‌ భార్య కూన ప్రమీల మాట్లాడుతూ పోలీసులు సెర్చ్‌ వారెంట్‌ లేకుండా తనిఖీలు చేయడాన్ని తప్పుబట్టా రు. ఇది సరైన విధానం కాదన్నారు. తమ ప్రత్యర్థులే కక్ష గట్టి ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు. తాము కూడా రాజకీయాల్లో ఉన్నామని, తన భర్త ఉన్నత పదవిలో కూడా పనిచేశారని, అలాంటి వ్యక్తిని వేధించాలని చూడడం సరి కాదన్నారు.  పోలీస్‌స్టేషన్‌ వద్ద నిందితులను తీసుకువస్తున్న పోలీసులు, అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలుకూన వ్యవహారంపై 

డీజీపీ ఆరా
 రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ వ్యవహారంపై ఆరా తీశారు. బుధవారం ఆయన ఎస్పీ అమ్మిరెడ్డితో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై వ్యవహరించాల్సిన తీరుతెన్నులపై ఎస్పీకి సూచనలు ఇచ్చారు. త్వరితగతిన ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా చూడాలని ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement