ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రం
ద్వారకాతిరుమల : రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా దేవుళ్ల సొమ్ముకే.. శఠగోపం పెడుతోంది. ప్రముఖ ఆలయాల్లో పారిశుధ్య ప్రక్షాళన పేరుతో దోపిడీకి తలుపులు తెరిచింది. టీడీపీ ప్రభుత్వం మూడేళ్లుగా ‘పద్మావతి హాస్పిటాలిటి ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్’ అనే సంస్థకు కోట్లాది రూపాయల సొమ్మును ముట్టజెప్పింది. దీనికి కారణం సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ కాంట్రాక్టరు భాస్కర్ నాయుడు బంధువు కావడమే. ఈకారణంతో ఇప్పటి వరకు ఆలయాల్లో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు అందకపోయినా, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోయినా అధికారులెవరూ పట్టించుకోలేదు. ఈ నెలాఖరుతో కాంట్రాక్టు కాల పరిమితి ముగియనుంది. అయినా ఆలయ అధికారులు ఇప్పటి వరకు పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఎటువంటి టెండర్లు పిలువక పోవడం అనుమానాలకు తావిస్తోంది.
కాంట్రాక్టు పొడిగించాలని దరఖాస్తు
ఈ నేపథ్యంలోనే మరో ఏడాది పాటు కాంట్రాక్టును పొడిగించాలంటూ భాస్కర్‌నాయుడు దేవదాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. టెండర్ ప్రక్రియ లేకుండానే కాంట్రాక్టును దక్కించుకునేందుకు బాబు ఆశీస్సులతో ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆలయ అధికారుల నుంచి పనితీరు బాగుందనే సర్టిఫికెట్‌లను సైతం పొంది, పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతంఈ సంస్థ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం, విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం ఆలయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణ, హౌస్ కీపింగ్ పనులను నిర్వహిస్తోంది.
భారీగా చెల్లింపులు
మూడేళ్ల క్రితం ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతభత్యాలకు నెలకు సుమారు రూ. 3 లక్షలు, అలాగే శానిటేషన్ సామగ్రి కొనుగోలుకు మరో రూ.4 లక్షలు వెరసి రూ. 7 లక్షలు ఖర్చు చేసేది. ఇప్పుడు అన్ని ఖర్చులు కాంట్రాక్టరు భరించేలా నెలకు దాదాపు రూ.16 లక్షలు పైగా చెల్లిస్తోంది. ప్రస్తుతం ఒక్కో కార్మికుడికి మెటీరియల్ ఖర్చుతో కలిపి దేవస్థానం రోజుకు కాంట్రాక్టరుకు రూ. 517 చెల్లిస్తోంది. గతంలో ఒక్కో కార్మికుని జీతం నెలకు రూ. 5,300 ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 5,500, నుంచి రూ. 6,200 వరకు ఇస్తున్నారు. కాంట్రాక్టరుకు చెల్లించే సొమ్ము గతంకంటే భారీగా రెట్టింపు అయినా.. కార్మికుల వేతనాలు మాత్రం పెద్దగా పెరగలేదు. అన్ని ఆలయాల్లోను అదే పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా పారిశుధ్య ఖర్చు బాగా పెరగడంతో ఆలయాల నిర్వహణ సైతం భారంగా మారింది.
ఆందోళనలో కార్మికులు
శ్రీవారి దేవస్థానం ఏజెన్సీ వారికి మొదటి ఏడాదిలో నెలకు రూ. 15.47 లక్షలు చెల్లించింది. అయితే ఒప్పందం ప్రకారం ఏటా 5 శాతం చొప్పున ఈ సొమ్మును పెంచుతూ ఇస్తోంది. ఈ సంస్థలో దాదాపు 110 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐలు మినహాయించగా ఒక్కొక్కరికి నెలకు సుమారు రూ. 5,500 లను కాంట్రాక్టరు అందిస్తున్నారు. కార్మిక చట్టం, అలాగే కాంట్రాక్టరు ఒప్పందం ప్రకారం కార్మికుడితో రోజుకు 8 గంటలు మాత్రమే పని చేయించాలి. అలాగే నెలకు నాలుగు రోజులు సెలవు ఇవ్వాలి. అదే విధంగా ఈఎస్‌ఐ ద్వారా వైద్య సేవలు అందించాలి. పని గంటలు పెరిగితే కాంట్రాక్టరు వారికి ఓటీ ఇవ్వాలి. అలాగే ప్రతి నెలా కార్మికుని పేరున చెల్లించే పీఎఫ్ సమాచారాన్ని వారికి తెలియజేయాలి. కానీ అవేవీ సక్రమంగా అమలు కావడం లేదు. సిబ్బందితో 12 గంటలు పనిచేయిస్తూ, వారికి ఇవ్వాల్సిన సెలవు దినాల్లో కూడా వారి శ్రమను దోచుకుంటున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గతేడాది అక్టోబరు 11న శేషాచలకొండపై ఆందోళనకు దిగారు. అయితే ఎప్పటికప్పుడు కాంట్రాక్టరు అనుయాయులు కార్మికులను బుజ్జగిస్తున్నారు. ఇలాంటి సంస్థకు మళ్లీ కాలపరిమితి ఎలా పొడిగిస్తారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రశ్నించిన ప్రతిపక్షనేత
తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడిలో ఈనెల 5న జరిగిన ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆలయాల్లో పారిశుధ్యం పేరుతో జరుగుతున్న దోపిడీపై ఆయన మండిపడ్డారు. బంధువుల కోసం దేవుళ్ల సొమ్మును దోచిపెడతారా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment