తప్పుడు వాగ్దానాలతోనే టీడీపీకి అధికారం
తోటపల్లిగూడూరు : టీడీపీ తప్పుడు వాగ్దానాలతోనే అధికారంలోకి వచ్చిందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని వెంకన్నపాళెం, కొత్తపాళెం గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. కాకాణి మాట్లాడుతూ నెరవేర్చలేని తప్పుడు హామీలను ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకున్నారన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోకుండా కొన్ని ప్రాంతాల ప్రజలు టీడీపీకీ పట్టం కట్టడంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్ అంధకారబంధరమైందన్నారు.
చంద్రబాబు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీతోనే అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ రుణమాఫీపై రోజుకొక ప్రకటన చేస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నాడన్నారు. ఎన్నికల ముందు రైతు రుణాలతో పాటు డ్వాక్రా రుణాలన్నింటిని పూర్తిగా మాపీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కొంత మేరకే మాఫీ చేస్తామంటూ దగా చేస్తున్నాడని దుయ్యబట్టారు. రుణమాఫీ చేయడానికంటూ బాబు ప్రభుత్వ ఆస్తులను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేయడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబుకు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే రుణ మాఫీ విషయంలో మీనమేషాలు లెక్కించ కుండా రైతులందరికీ అన్నిరకాల రుణాలను వెంటనే మాఫీ చేయాలన్నారు.
లేకుంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన పోరాటాలకు దిగుతుందన్నారు. ఎమ్మెల్యే కోటాలో మంజూరయ్యే రూ.50 లక్షలను నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రూ.25 వేల చొప్పున అభివృద్ధి పనులకు వెచ్చించడం జరుగుతుందన్నారు. ఈ నిధులతో పాటు ఎంపీ నిధులను వెచ్చించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇంకా అవసరమైతే ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులను తీసుకువచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను సమకూర్చుతానన్నారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఏ సమయమైనా ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తానని కాకాణి ఉద్ఘాటించారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, మాజీ ఎంపీపీ టంగుటూరు శ్రీనివాసులరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవులగౌడ్ నాయకులు ముత్యాల మల్లికార్జున్, దుంపల ఏసోబు, చేవూరు శ్రీనివాసులు, ప్రసన్నకుమార్‌రెడ్డి, ఇసనాక రమేష్‌రెడ్డి,నాయుడు హేమంత్‌రెడ్డి, కోడూరు దిలీప్‌రెడ్డి, మాచిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, గండవరపు శ్యామలమ్మ, నెల్లిపూడి సునీల్‌కుమార్‌రెడ్డి, వేగూరుశ్రీనివాసులు, చెరుకూరు శీనయ్య, ఈదూరు వెంకటరమణయ్య, నెల్లిపూడి రాజగోపాలరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ కార్యర్తలు పాల్గొన్నారు.