కోటి ఆశలతో కోరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన ప్రజలకే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులకూ అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ‘ఆ హామీల’ గురించి అడగబోమని ఓ హామీ ఇస్తేనే ఏ కార్యక్రమానికైనా వస్తామంటున్నారు మంత్రులు. ఇటీవల కొన్ని ఉగ్యోగ సంఘాలకూ ఇదే అనుభవం ఎదురైంది. మంత్రులకు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాయి. సన్మానం చేస్తాం.. అతిథులుగా రండి అంటూ మంత్రులను కోరాయి. అయితే.. ‘ఆ హామీలు, ఇతర అంశాలు’ అడగబోమని హామీ ఇస్తేనే అతిథులుగా వస్తామంటూ వారికి సమాధానాలొచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ‘నంబర్ 2’గా ఉన్న ఓ మంత్రిని కొన్ని రోజుల క్రితం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిశారు. మా శాఖ బాగోగులు చూసే మంత్రిగా మిమ్మల్ని సన్మానిస్తామని చెప్పారు. ఆయన వెంటనే ఒప్పుకోలేదు. తర్వాత చెప్తానని అన్నారు.
ఆయన్ని సన్మానించి పీఆర్సీ అమలు తదితర హామీలు పొందాలని సంఘం నేతలు ఆశించారు. అయితే, మంత్రి పేషీ నుంచి వచ్చిన సమాధానంతో వారు కంగుతిన్నారు. పీఆర్సీ, టీఏ, డీఏ సహా ఇతర ఏ అంశాలనూ ప్రస్తావించబోమని హామీ ఇస్తేనే మంత్రిగారు కార్యక్రమానికి వస్తారన్నది దాని సారాంశం. మీరు అడగాలనుకున్న విషయాలేవీ మంత్రికి తెలియవని, దేనిపైనా నిర్ణయం తీసుకునే, హామీ ఇచ్చే అవకాశం ఆయనకు లేని కారణంగానే ఈ షరతు పెడుతున్నామని అధికారులు ఫోనులో చెప్పారు. కీలకాంశాలు కేవలం సీఎంతోనో, లేదా కీలకంగా వ్యవహరిస్తున్న ‘ఆ నలుగురి’ తో మాత్రమే చర్చించాల్సి ఉంటుందని అన్నారు. దీంతో అవాక్కయిన ఉద్యోగ సంఘం నేతలు సన్మానంపై డైలమాలో పడ్డారు.