బ్యాంకులో ఖాతాలను చూసుకునేందుకు వచ్చిన రైతులు
సాక్షి, కడప అగ్రికల్చర్ : రైతులను మభ్య పెట్టడం, మోసగించడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. రైతుకు టోకరా వేయడం మరింత సులువన్నది ఆయన భావన. ఐదు సంవత్సరాలుగా ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ ఇవ్వకపోగా, అన్నదాత.. సుఖీభవ పేరిట రూ.1000 ఖాతాలో వేస్తున్నట్లు నమ్మబలుకుతున్నారు. ఈ పథకంలో కొంతమంది రైతుల ఖాతాలకే నిధులు జమ చేశారు. 50 వేల మంది ఖాతాలకు డబ్బులు పడలేదని తెలిసింది.
ఎన్నికల వేళ లేని ఆశలు కల్పిస్తూ వంచిస్తున్న ప్రభుత్వ తీరుపై రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి, ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు అందుతున్నాయని.. అందుకే నిన్ను నమ్మం బాబూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. ఏదో చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతుకు ఒరిగిందేమీలేదు. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ గొప్ప పథకాన్ని తీసుకువచ్చినట్లు టీడీపీ ప్రభుత్వం బిల్డప్ ఇస్తోంది.
ఈ పథకం కిందేమైనా రైతులకు పెద్ద ప్రయోజనం ఏమైనా చేకూరుతుందా? అంటే అదీలేదు. జిల్లాలో దాదాపు ఐదు సంవత్సరాలుగా వరుస కరువులతో వ్యవసాయం అతలాకుతలం అయింది. అనావృష్టి, అతివృష్టి, మరో పక్క ప్రకృతి విపత్తులు, అంతు చిక్కని చీడపీడలతో పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. నేల తల్లిని నమ్ముకున్న జిల్లా రైతులు ఆర్ధికంగా చితికిపోయారు. బ్యాంకుల నుంచి, బయట ప్రయివేటు వారి వద్ద తీసుకున్న అప్పులు తీర్చే దారిలేక కొంతమంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆసరా కల్పించాల్సిన సర్కారు మాటలతో కాలహరణం చేస్తోంది.
14.35 లక్షల ఎకరాల్లో భూమి...దీనిపై ఆధారపడిన కుటుంబాలు 4.89 లక్షలు
జిల్లా వ్యవసాయ, ప్రణాళిక శాఖ లెక్కల ప్రకారం 14.35 లక్షల ఎకరాల భూములున్నాయి. వీటిపై ఆధారపడి 4,89,757 రైతు కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం కింద 3,59,205 కుటుంబాలు అర్హత కలిగినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. అంటే 1,30,552 కుటుంబాలకు మొండిచేయి చూపినట్టేనని అర్ధమవుతోంది.
జిల్లాలో 12 వ్యవసాయ డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా వర్షాధారంపై ఆధారపడిన భూములే అధికం.
జిల్లా వ్యవసాయ, ప్రణాళికశాఖ సంయుక్తంగా సర్వేచేసి 3,24,965 అకౌంట్లు రైతు కుటుంబాలు కలిగిన ఉన్నాయని లెక్కలు కట్టారు. ఫిబ్రవరి 18 నుంచి రైతుల ఖాతాలకు రూ.1000 రియల్ టైం గవర్నెన్స్ సిస్టం (ఆర్టీజీఎస్) ద్వారా బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లి పరిశీలించుకుంటుండగా నగదు జమకానట్లు చూపుతోందని చాలామంది ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకు 2,88,077 అకౌంట్లకు ఆన్‌లైన్ చేయగా, ఇందులో 2,58,416 అకౌంట్లకు నగదు జమ అయిందని, 30,012 అకౌంట్లకు జమ కావాల్సి ఉందని తెలిపారు.
మొత్తం 3,24,965 అకౌంట్లలో 48,946 అకౌంట్లకు బ్యాంకుల్లో ఆధార్ అనుసంధానం కాలేదని, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ లేనందున ఆన్‌లైన్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, కెవైసీ ఫారత పూర్తి చేసి ఇచ్చినా కూడా మొండిచేయి చూపారని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. రైతు సాధికార సర్వే సమయంలో కూడా అన్ని పత్రాలు ఇచ్చామని, అయినా నగదు పడిందెక్కడని ప్రశ్నిస్తున్నారు.
ఓట్ల కోసమే ఇదంతా..
వ్యతిరేకతను తగ్గించుకోవడానికే సుఖీభవ పథకాన్ని పెట్టి నమ్మబలుకుతోందని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వాస్తవానికి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పధకం కింద ఏటా రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6వేలు అందించాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9వేలు, కేంద్రం ఇచ్చే రూ.6వేలు కలిపి రూ.15వేలు ఇస్తామని ప్రకటించింది. దీంట్లో మొదటి విడతగా కేంద్రం రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1000లు ఇప్పుడే జమ చేస్తామని, మిగిలిన మొత్తం ఈ నెలలో ఇస్తామని ప్రకటించింది. దాదాపు 50 వేల మంది రైతుల ఖాతాలకు నగదు పడలేదని తేలిపోయింది.
ఇన్‌ఫుట్ సబ్సిడీ, బీమా, రుణాల వడ్డీ రాయితీలకు ఎగ్గొట్టిన ప్రభుత్వం..
నాలుగున్నరేళ్లుగా ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటల బీమా, రూ.లక్షలోపు సాగు రుణాలు సకాలానికంటే ముందే చెల్లించగా వచ్చే రుణ రాయితీ ఇప్పటికి రాలేదని రైతులు మండిపడుతున్నారు. న్యాయంగా రావాల్సిన సొమ్ములు ఇవ్వకుంటే కొసరు దేనికని రైతులు, రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 2012 నుంచి ఇప్పటి వరకు పంటపెట్టుబడి రాయితీ రూ.130 కోట్లు, పంటల బీమా రూ.117 కోట్లు, రుణాల వడ్డీ రాయితీ రూ.400 కోట్లు కలిపి రూ.647కోట్లు రైతులకు అందజేయాల్సి ఉంది. ఈ మొత్తమంతా ప్రభుత్వం ఎగ్గొట్టిందని రైతులు, రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.
ఇది ఎన్నికల ఎత్తుగడే
తెలుగు దేశం ప్రభుత్వం రైతులను ఏనాడో వదిలేసింది. పంటలు నష్టపోయినప్పుడు పట్టించుకోవడం మరచి పోయింది. ఇప్పుడు రైతుల ఓట్లు రాబట్టుకోవడానికి సుఖీభవ పథకం తీసుకువచ్చారు. ఇది ఎన్నికల జిమ్మిక్కే తప్ప రైతులకు మేలు చేయడానికి కాదు.
–డేరంగుల రామాంజనేయులు, వేంపల్లె, వేంపల్లె మండలం
రైతులను మభ్యపెట్టెందుకే..
ఎన్నికల సమయం దగ్గర పడడంతో రైతుల ఓట్లు బుట్టలో వేసుకోవడానికే తాయిలం. ఐదు సంవత్సరాలుగా రైతుల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు రైతుల అవసరం వచ్చింది కాబట్టి నగదు ఇస్తామంటున్నారు. రైతులను మభ్యపెట్టడానికే ఈ రైతు సుఖీభవ పధకం.
–సంబటూరు ప్రసాదరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం
ఈ ప్రభుత్వానిది అంతా బూటకమే..
తెలుగు దేశం ప్రభుత్వం అధికారం కోసం ప్రతిసారీ రైతులను ఏదో ఒక విధంగా బోల్తాకొట్టించాలని చూస్తుంది. పది రూపాయలు విధిలించి రైతులను బిక్షగాళ్ల మాదిరిగా చూస్తోంది. ఈ ప్రభుత్వం చేసేవన్నీ బూటకపు పనులే తప్ప రైతులకు మేలు చేసేది ఉండదు. ఇన్‌పుట్ సబ్సిడీ, వడ్డీ రాయితీ, బీమాను ఎగ్గొట్టింది.
–చంద్ర,జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం(సీపీఐ)
Comments
Please login to add a commentAdd a comment