నామినేషన్‌దే డామినేషన్
ఇదీ నిబంధన..
కరువు.. తుపాను.. సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించాలి. అదీ రూ.ఐదు లక్షల్లోపు విలువైన పనులను మాత్రమే.
ఉల్లంఘన ఇలా..
ఈ నిబంధనను రాష్ట్రప్రభుత్వం ఉల్లంఘించింది. ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేకుండా నామినేషన్‌పై పనులు కట్టబెట్టడానికి మరోసారి సిద్ధమైంది. ఇప్పటికే రూ.ఐదు లక్షల్లోపు విలువైన పనులను నామినేషన్‌పై కాంట్రాక్టర్లకు అప్పగించాలని నీటిపారుదల, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులను 15 రోజులక్రితం ఆదేశించిన ప్రభుత్వం తాజాగా రహదారులు, భవనాల శాఖలోనూ అదేవిధానాన్ని వర్తింపజేయాలని మంగళవారం ఉత్తర్వులిచ్చింది. నామినేషన్ పనుల పరిధిని రూ.పది లక్షల వరకూ పెంచింది.
దోచిపెట్టడానికే..
తెలుగుతమ్ముళ్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికే నామినేషన్ దందాకు ప్రభుత్వం తెరతీసినట్టు అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి. నీటిపారుదల శాఖలో రూ.300 కోట్లు, పురపాలకశాఖలో రూ.75 కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ.120 కోట్ల పనులను కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు రహదారులు, భవనాలశాఖలో మరో రూ.95 కోట్ల పనులను టీడీపీ నేతలకు సంతర్పణ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చింది.
సాక్షి, హైదరాబాద్: తెలుగుతమ్ముళ్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం నామినేషన్ దందాకు తెరతీసింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించాల్సి ఉండగా.. వాటితో నిమిత్తం లేకుండా నిబంధనలను తుంగలో తొక్కి భారీ ఎత్తున పనులను టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ పాలనలో యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన రూ.లక్ష లోపు విలువైన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశాక రూ.5 లక్షల్లోపు విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేలా వెసులుబాటు కల్పించారు. రోడ్లు,భవనాల శాఖసహా పలు శాఖల్లో గతేడాది ఈ విధానం అమలైంది.
తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అదేబాటన నడుస్తూ.. నీటిపారుదలశాఖ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో రూ.5 లక్షల్లోపు విలువైన పనులను నామినేషన్‌పై అప్పగించడానికి ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. తాజాగా రహదారులు, భవనాల శాఖలోనూ అదే విధానాన్ని వర్తింపజేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాదు.. నామినేషన్‌పై కట్టబెట్టే పనుల విలువను రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచుకునే వెసులుబాటును కల్పించింది.
ఈ ఉత్తర్వులు రెండు నెలలపాటూ అంటే జూలై 26 వరకూ అమల్లో ఉంటాయని పేర్కొంది. నీటిపారుదలశాఖలో కాలువలు, గట్లు, తూములు, స్లూయిజ్‌ల వంటి మరమ్మతు పనులు, పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో సిమెంటు రోడ్లు, గ్రామీణ రహదారులు, మురుగునీటి కాలువలు వంటి పనులు, రహదారులు, భవనాలశాఖలో రోడ్లు, భవనాల మరమ్మతు పనులను నామినేషన్‌పై కట్టబెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టీకరించింది.
ప్రజాధనం దుర్వినియోగం..
ఏదైనా పనికి టెండర్ నిర్వహిస్తే.. కాంట్రాక్టర్లు పోటీపడి తక్కువ ధరకు కోట్ చేసే వీలుంటుంది. అప్పుడు ప్రభుత్వానికి భారీ ఎత్తున నిధులు ఆదా అయ్యే అవకాశముంటుంది. కానీ నామినేషన్‌పై పనులు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వానికి ఒనగూడేదేమీ ఉండదు. ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలిస్తే.. నామినేషన్‌పై కట్టబెట్టే పనులన్నీ టీడీపీ నేతలకే దక్కనున్నాయి. కాంట్రాక్టర్లకైతే అనుభవం ఉండటం వల్ల పనుల్లో నాణ్యతుండే వీలుంటుంది. టెండర్ ద్వారా పనులప్పగిస్తే.. పనులు నాసిరకంగా ఉంటే సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకునేందుకు ఆస్కారముంటుంది. చేసిన పనులు తొందరగా మరమ్మతులకు గురైతే.. టెండర్ దశలో కాంట్రాక్టర్ చెల్లించిన ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ని మినహాయించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. కానీ నామినేషన్‌పై పనులను టీడీపీ నేతలకు కట్టబెడితే.. వారికి అనుభవం లేనందున ఇష్టారాజ్యంగా చేస్తారు.
సాక్ష్యమిదిగో..
గతేడాది ఒక్క రహదారులు, భవనాలశాఖ పరిధిలోనే రూ.80 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో టీడీపీ నేతలకు కట్టబెట్టి పూర్తి చేయించారు. అప్పట్లో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల్లోపు పనులను నామినేషన్‌పై కట్టబెట్టింది. పనులు దక్కించుకున్న టీడీపీ నేతలు నాసిరకంగా చేశారు. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో చేపట్టిన పనుల్లో భారీఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదికివ్వడమే ఇందుకు నిదర్శనం. అయినా పట్టించుకోని ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ నామినేషన్ పద్ధతిలోనే కట్టబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో గతేడాది పరిణామాలే ఈ ఏడాది పునరావృతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని రహదారులు, భవనాలశాఖ అధికారవర్గాలు అంటున్నాయి.