ఊరి మీద ఉరితాడు
ఏవో మాటలు ఇనబడుతున్నై.. సమజయిత లేవు..నల్లంగ కమ్ముకున్న మబ్బులు.. వాటిలోంచి మెరుపు లెక్క జారుతున్నది.. ఊరి మీదికి.. ఏందది..! సరిగ్గ కనిపిస్తలేదేంది.. తాడా.. మెలిక తిరిగి ఉందేంది.. బంగారు రంగులమెరుస్తున్నదేంది..? ఊరిమీదికి జారుతూ మెరుస్తున్నది..! కండ్ల్ల మీద జిగేల్ మంటుండేసరికి కండ్లు తెరిషిన.. ‘‘కళమ్మ ఉరి బెట్టుకున్నదంట!’’ ఊరంత పాకింది ఆ మాట! ‘‘గదేందే, గా పిల్లెందుకు ఉరి బెట్టుకుంటదే..!’’ ‘‘గదే, నమ్మబుద్దయితలేదవ్వా..!’’ ‘‘యాడ్నంట..?’’ ‘‘ఎవరు సూషిన్రంట?’’ ‘‘అయ్యో! ఇద్దరు శిన్న పిల్లలు గదనె!’’ నిండుగ దుప్పటి కప్పుకొని పండుకున్న నాకు మా ఇంటి సుట్టుపక్కలిండ్ల్లల్ల నుంచి ఇన్పిస్తున్నయా మాటలు. దబదబ లుంగి సుట్టుకొని బైటికొచ్చిన. ‘‘అమ్మీ! కోన్కతె? ఘర్‌కే బాజువాలీ కళమ్మా?’’ బయట మా అమ్మను అడుగుతుండు మా తమ్ముడు. అమ్మ గిన్నెలన్ని ముందలేసుకొని తోముకుంట కూసున్నది. ‘‘హౌ కతె! తెల్లారగట్ల నాలుగింటికె గోంగూర పీకి మూట కట్టుకొని సైకిల్ మీద యేస్కొని నల్గొండ పొయిందంట.. పెద్ద గుడియారం కాడ యేసి వచ్చి పిల్లల్ని తయారు చేసి స్కూల్‌కు పంపిందంట.. ఎన్నడు లేంది స్కూల్‌కు పొయ్యే ముందు పిల్లలిద్దర్కి ముద్దులు పెట్టిందంట.. వాళ్లు పోతుంటె నిలబడి సూస్కుంట కండ్లనిండ నీళ్లు తెచ్చుకున్నదంట.. తర్వాత బాయి కాడికి పోయి కొట్టంల ఉరేసుకుందంట! ...’’ మా అమ్మ చెప్పుకుపోతున్నది.
‘‘అయ్యొయ్యో!’’ నా మనసు గులిబిలైంది. ‘‘ఇప్పుడు యాడున్నదంట అమ్మీ?’’ అడిగిన ఆత్రంగ. ‘‘దవాఖానకు ఏస్కపొయిన్రంట.. సచ్చిపొయిందని జెప్పి పోస్టుమాటమ్ రూం కాడ ఏసిన్రంట!’’ మా పక్కిల్లే కళమ్మది. మస్తు షాకింగా ఉంది నాకు. కళమ్మ ఉరేసుకోడమేందో సమజైతలె..మా అమ్మను, మరదల్ను, మా ఆమెను గోడ మీంచే పల్కరిస్తుండె. దబదబ గేటు దిక్కు నడిషి గేటు తీస్కొని గల్లీల కొచ్చి సూషిన. కళమ్మ ఇంటి ముంగల షానామంది గుమిగూడి ఉన్నరు. పొయి, ‘‘కళమ్మ ఉరేసుకోవడం ఏంద్రా!? ఎందుకటా? ఏమన్న తెలిసిందా?’’ అనడిగిన గుంపులోకి, పోరగాల్ల దిక్కు సూస్కుంట.‘‘మొగడు బాగ తాగుతుండె గదా.. రాత్రి గడ్బడైందంట. కొట్టిండంట. మరింకేం జరిగిందొ ఏమో..’’ ‘‘ఇద్దరు చిన్న పిల్లలున్నరు గదరా.. అట్లెట్ల ఉరి బెట్టుకుంటది! ఆళ్లనెవరు సూస్తరు?!’’‘‘అదే సమజైతలేదన్నా.. షానా ధెర్యముండేదా పిల్లకు. గట్లెట్ల సావాలన్పించిందొ.. పానమెట్ల దరిచ్చిందొ.. గా శిన్న పిల్లల్ని తల్లి లేని పిల్లల్ని జేసి పాయె..’’ కళమ్మ ఇంటి గేటు దగ్గరికేసి ఉంది. ఆళ్లోళ్లంత దవాఖాన కాడనె ఉన్నరంట. గేటు తోసుకొని ఇంట్లకు బొయినం. బైటికి తలుపులున్న రెండే అర్రలు. సాయమాను. అర్రకు తాళమేసి ఉంది. గిన్నెలు గవాషి కాడ ఏషి ఉన్నై. అంటె చీకటి మొకాన గుడ సావాలని అనుకున్నట్లు లేదు.పనులన్ని జేసుకుంది. వంట జేసింది. పిల్లల్ని తయారు చేసింది. బడికి పంపింది. ఆ యెంబడె బాయి కాడికి పోయి గీ పని ఎట్ల చేసింది? సమజ్ కాలె మాలో ఎవరికి.
‘‘మొన్నటిదాంక అత్త మామలు ఒక అర్రల, మొగడు పెళ్లాలు పిల్లలు ఇంకొక అర్రల ఉండేది.. గీ మద్యల్నె ఫుల్లు గడ్బడైంది. అత్తమామలు పక్క గల్లీల యేరే ఇల్లు కిరాయ్కి తీస్కొని పొయిరి.’’‘‘ఎన్నేండ్లుంటై రా కళమ్మకు?’’‘‘25 గుడ ఉండవురా!’’ ‘‘అంత వుషారు పిల్ల అట్లెట్ల ఆత్మహత్య చేసుకున్నదిరా?’’ఎవ్వరికి మింగుడుబడ్త లేదా సంగతి. గల్లీల కొచ్చినం. వస్తోల్లు పోతోల్లందరి నోళ్ల్లల్ల ఇదే ముచ్చెట. కొందరు ఊర్లె తాగుడు గురించి ఎవర్నొ తిడుతున్నరు..తాగుడుకు మూలమెక్కడుందో తెల్వక ఎవర్ని తిట్టాల్నొ సమజ్గాక ఎవర్నొ ఒకర్ని తిడుతున్నట్లు అనిపించింది నాకు.‘‘ఏందల్లుడా గీ అన్యాలం’’ అనుకుంట వచ్చి నిలబడ్డది బద్రమ్మత్త.‘‘కళమ్మ ఎందుకు ఉరేసుకుందంట, జర చెప్పవత్తా?’’ అనడిగిన, ఆమెకైతె అమ్మలక్కల ముచ్చెట్లల్ల నుంచి అసలు విషయం తెలుస్తదని!‘‘గదే అర్తమైతలేదయ్యా.. గా పిల్ల ఎంత గట్టిదొ నీకు తెల్సుగా.. ఎవలన్న కొట్లాటకొస్తే ఎట్ల గయ్యిమనేది.. నల్గుర్నైన ఒక్కతె మాటల్తోనె అర్సుకునే మాసరు. మొగడు సరిగ పట్టించుకోకున్న ఎవుసాయం పనులు తనే చూసుకుంటుండె.. గసొంటిది, ఉరి బెట్టుకున్నదంటె నమ్మబుద్దే అయితలేదయ్యా..’’ అని గొంతు తగ్గించి అన్నది – ‘‘ఏ.. మొగడు బాగాదాగి అప్పులు జేస్తున్నడంట అల్లుడా! గా మజ్జెల్నె ఈ పిల్ల అన్ని తీర్షిందంట. మల్ల అప్పు జేసిండని నిన్న తెల్సిందట. దాంతోటి రాత్రి గడ్బడైంది. ఆడు తాగి ఉన్నాలె.. బాగ కొట్టిండంట.. దాంతోటి ఇగ మనసుకు ఏమనుకున్నదొ బిడ్డ.. గియ్యాల గీ పని జేసింది..’’‘‘ఔనా..! నీతోని ఎన్నడన్న ఏమన్న జెప్పుకున్నదా అత్తా..’’ అన్న.
‘‘రెండుమూడుసార్లు అన్నదయ్య.. ‘ఏ.. యాష్టకొస్తున్నది పెద్దమ్మా.. ఒక్కదాన్ని ఎంతకని అన్ని మలుపుకు రావాలె శెప్పు.. ఒక్కోపాలి నాతోని అయితలేదే’ అని ఒకపాలి గుడ్లనీల్లు పెట్టుకున్నదయ్యా! అయన్నీ ఇప్పుడు ఓలకన్న జెప్తె ఏం బాగుంటది.. పోనీ, ఎవల పాపాన ఆల్లు పోతరు.. బిడ్డెను మాత్రం మింగి కూసున్నరు..’’‘‘అయ్యయ్యో! అయితె అత్తమామలెందుకు వేరే ఇల్లు మారిన్రత్తమ్మా?’’
‘‘మొగన్ని ఏమననిస్తలేరని ఆల్లతోని గొడవ పెట్టుకుంది. ఆల్లు గుడ మస్తు తాగుతరు అల్లుడా..’’అట్ల ఆమె చెప్తుంటె ఇనుకుంట నిలబడ్డ.. అంతల్నె యాదికొచ్చి ‘‘చేను కాడికి పోవాలయ్య’’ అనుకుంట ఎల్లిపొయింది బద్రమ్మత్త.అంతల కళమ్మ అత్తామామలు, మొగడు, పిల్లలు, ఆడిబిడ్డ, ఆమె మొగడు అందరు ఆటోల వచ్చి దిగిన్రు. అందరు ఆళ్ల సుట్టు మూగిన్రు. మొగడు అక్కడ ఆగకుంట గేటు తోసుకొని ఇంట్లకు పొయిండు. అత్తామామల్ని ఎట్ల ఉరి బెట్టుకున్నదని, పోస్టుమార్టమ్ ఎప్పుడు జేస్తరంట అని తలా ఒక మాట అడుగుతున్నరు. ఆళ్లల్ల బయం జొరబడ్డట్టున్నరు. మాట పెగుల్తలేదు. అత్త ఏడుపందుకుంది.
నేను సోంచాయించుకుంట ఇంట్లకొచ్చిన. కొద్దిసేపు అట్లనె కుర్సీల కూలబడ్డ. కళమ్మ మొఖమే మెదులుతున్నది కండ్లల్ల. అసలు ఉరిబెట్టుకోవాలంటె ఎంత దైర్యం గావాలె! అంత పని చేసిందంటె మొగనితోటి ఎంతగనం ఇసిగిపోయి ఉంటదో!‘‘అద్దరాతిరి సన్నగ ఏడ్పు ఇనిపిస్తుండె రా.. ఆల్లు గొడవ పెట్టుకొనుడు ఆడు కొట్టుడు మామూలె గదా.. దెబ్బలేమన్న ఊటగ తాకినయేమొ అనుకున్న గని మనసుకి అంతగనం కష్టమనిపించి ఏడ్సిందనుకోలేదు రా..’’ అని మా అమ్మ అంటుంటె మరింత శితికిపొయిన.లేషి మొఖం కడుక్కుంటున్న. అంతల గల్లీల ఏందో కలకలం లేషింది. అందరు అటుదిక్కు ఉర్కుతుండడం మా గేట్ల నుంచి కనబడుతున్నది. నేను గుడ జగ్గు ఆడ పడేసి పొయిన.పోలీస్ జీప్ వచ్చి నిలబడి ఉంది. పోలీసోల్లు కళమ్మ ఇంట్లకు పొయిన్రు. కళమ్మ అత్తమామల్ని, ఆడిబిడ్డను, ఆమె మొగన్ని గుడ బెటికి తోలుకొచ్చి జీపుల కూసొబెట్టిన్రు. అంతల్నె ఆడికి ఊరి పెద్దమనిషి ఒకాయన మోటర్ సైకిల్ మీద వచ్చిండు. పోలీసోల్లతోటి ఏందో మాట్లాడబొయిండు. ఆల్లు ఇనకుంట ‘‘స్టేషన్‌కు రండి’’ అనుకుంట జీపెక్కిన్రు. జీప్ రయ్‌న ఎల్లిపొయింది. బండి మలుపుకొని ఎల్ల్లబోతున్న ఆ పెద్దమనిషి దగ్గరికి నడిషి ‘‘ఏం జరిగిందే..?’’ అనడిగిన.‘‘కళమ్మ అన్న ఈళ్లందరి మీద కేసు పెట్టిండంట. కేసు బెడితె అయితదా.. జరగాల్సింది సూడాలె గని’’ అనుకుంట ఎల్లిపొయిండాయన. ఎలమంచమ్మ ఒచ్చి మా అమ్మతోటి మాట్లాడుకుంట నిలబడ్డది– ‘‘ఊర్లె తాగుడు బందయితలేదాయే! తాగి తాగి సస్తుండె మగపోరగాల్లు.. ఎవలూ పట్టించుకుంటనె లేరాయే.. ఆ తాగుడుతోటె ఇయాల గీ పిల్ల గిట్ల జేసుకునె’’ అంటున్నది. మా అమ్మ, ఆమె మాట్లాడుకుంటున్నరు. తాగి సావడాలు, ఆత్మహత్యల ముచ్చెట్లు బెట్టుకుంట ఒచ్చి సాయమాన్ల అరుగు మీద కూసున్నరు ఇద్దరు. నేను ఎదురుంగ కుర్సీల కూసున్న.‘‘ఊర్లె తాగి సచ్చినోల్లు ఎంతమందుంటరు?’’ అన్న ఇద్దరి దిక్కు సూస్కుంట.. పొద్దున్లేస్తె నల్గొండల పడి మల్ల రాత్రికి ఇల్లు చేరుడైపొయ్యింది నా నౌకరీ వల్ల. అందుకనె ఈ మజ్జె ఊర్లె సంగతులు తెలుస్తలెవ్ నాకు.‘‘ఓ సగం ఊరయ్య..! బజారుకో నలుగురెల్తరు. ఒక్కోన్ది ఒక్కో కతేనాయె. ఆల్లు బాగనె సచ్చిన్రు. ఆళ్ల పెళ్లాలదే గోస. పిల్లల్ని సాదుకుంటానికి నానా శర పడ్తున్నరుగ. తాగుడు మీద మన్నుబొయ్య. ఆ తాగుడు షానామందిని మింగె..!
అంతెందుకు.. మీ బజారె సూడ్రాదూ.. ఆణ్నించి ఈడిదాంక అంత తాగి సచ్చినోల్లేనాయె! బజారు మొదట్ల ఉండేటోడు గదా, గా పిల్లగాడు సురేందర్, ఎంత అందంగుండెటోడు కొడ్కా.. అప్పట్లనె పన్నెండు దాంక సదివె. సదువుకున్నోన్ని గదాని తాళ్లు ఎక్కననె. అదొ ఇదొ పనిచేసుకునేటోడు గదా. సేపు పండ్లసొంటి ఇద్దరు బిడ్డలు. సైకిల్ మీద ముందొకలను, ఎనకొకలను కూసొబెట్టుకొని బడికి తీస్కపొయి ఒదిలొచ్చేటోడా.. ఎట్ల అలవాటయ్యిందొ కొడ్కా, మందుకు మరిగె. కొన్నాల్లకు లీవర్ పాడయ్యిందన్రి. దవాఖానల సుట్టు తిరిగి సుతరాయించుకుండు. కొన్నాళ్లకు మల్ల షురూ జేసిండు.. మల్ల తిరగబెట్టె. ఈసారి లేవకుంట పడె. పానం నెరీ బాలేకుంటాయెనా.. పెళ్లాం దవాఖానకు తీస్కపొయిందంట. నోట్ల నుంచి రక్తం కక్కుకుని దవాఖానల్నె సచ్చిపొయిండట. ఆ పొల్ల చేతిల చిల్లిగువ్వ లేదంట. ఎంట ఎవ్వలూ లేరు. ఆళ్లనీళ్లను బతిలాడిందంటయ్య. ఎవ్వలు పట్టించుకోలె. ఆఖరికి ఏం జెయ్యాల్నొ తోయక, తీస్కపొయిన చద్దరు కప్పి, రెండు కాళ్లు రెండు చేతుల్తోని పట్టుకొని ఆ పెద్ద దవాఖాన లోపట్నుంచి బయటిదాంక ఆగుకుంట ఆగుకుంట గుంజుకొచ్చిందంటయ్యా, చెంపల మీదంగ కన్నీల్లు కారిపోతుండంగ...’’ ఆగింది ఎలమంచమ్మ. మనసులో ఏందో దేవినట్లనిపించింది నాకు.. గుర్తొచ్చి అన్న –‘‘అవునవ్వా! నాకు బాగ యాదికుంది, రెండోరోజు ఎవరొ పసిపిల్ల అడిగిందంట– ‘రోజు వాళ్ల నాయన సైకిల్ మీద బడికి తీస్కొచ్చి దింపి ముద్దులు పెట్టి పొయ్యేటోడు గదా.. మరి ఇప్పుడెవలు తీస్కొస్తరాల్లను?’ అని!’’
అట్లట్ల పొద్దుగూకింది. నేను గల్లీల నిలబడి ఉన్న. నర్సింహ్మారావు భార్య జ్యోతి వచ్చింది. మా చెల్లెకు ఆమెకు మంచి దోస్తానా. చెల్లె ఒచ్చిందని తెలిసి ఒచ్చిందామె.‘‘బాగున్నరా..?’’ అడిగిన. ‘ఆ!.. మీరు బాగున్నరా?’’ అన్నదామె. ‘‘మేం నిమ్మలమే.. మీ పిల్లలు ఎట్లున్నరు?’’ అన్న. ‘‘మంచిగునె ఉన్నరయ్య’’ అనుకుంట ఇంట్లకు పొయింది. మనసు నిండ నర్సింహ్మారావు కమ్ముకుండు నన్ను.నర్సింహ్మారావు ఊర్లె కమ్యూనిస్టు రాజకీయం మొదలుపెట్టినోడు. మా తెలివైన నాయకుడుండె. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటె ఉండె ఊర్లె. నర్సింహ్మారావు నలుగుర్ని పోగేసుకున్నడు. ఎన్నో గొడవలు, కొట్లాటలైన గుడ ఎదురు నిలబడ్డడు. రెండుసార్లు సర్పంచ్‌కు పోటీచేసిండు. ఒకపాలి 5 ఓట్లుతోని, ఇంకోపాలి 11 ఓట్ల్లతోనె ఓడిపొయిండు. కని షానా దైర్నంతోటి ఉండేటోడు. ఉన్న ఒక్క ఆదారం ఎవసాయం నడవకుంటైంది. ఎటు తోచక ఊర్లె హోటల్ కాడ వచ్చి ముచ్చట బెట్టుకుంట కూసునేటోడు.. ఆ హోటల్ల మందు అమ్మేది. ఈన ఒక పార్టీ పెద్దమనిషాయె. తాగుతానికి వొచ్చినోల్లు రారమ్మంటె ఒకటి, రెండు పెగ్గులేసుకునుడు çషురూ జేసిండు. పంచాయితీలు జేసేకాడ గుడ మందు పోయించుడు మామూలె. మొత్తానికి చూస్తుండంగనె మందుకలవాటైండు. రోజు పొద్దున్లేషిన సందే తాగెటోడు. లివర్ పాడైపొయింది. దవాఖానాల చేరిండు. మందు తాగొద్దన్నరు డాక్టర్లు.ఇంట్ల మంచంలో పండుకొని ఇంటిని తేరిపార జూసుకుంట బార్యతోని అన్నడంట– ‘‘ఇల్లంత ఎంతగనం బూజుపట్టిందొ.. ఇంటిని బాగు చేసుకోవాలె.. పిల్లలు, నువ్వు బక్కగైనరు. ఇప్పట్సంది అన్నీ పట్టించుకుంట నిర్మలా.. మల్ల మనం మునుపటి లెక్క కావాలె..!’’ అనుకుంట గుడ్ల్లల్ల నీల్లు కుక్కుకున్నడంట. ఆమె మొగున్ని పట్టుకొని గోడుగోడున ఏడ్షిందంట. ఈళ్లు ఏడుస్తుంటె ముగ్గురు ఆడపిల్లలు గుడ ఈళ్లను సుట్టుకొని లెస్స ఏడ్షిన్రంట.కనీ, తాగుడు అలవాటు మహమ్మారి లాంటిదాయె.. పట్టుకుంటె ఊకుంటదా.. మంచం మీంచి లేషి నడవడం షురూ జెయ్యంగనె చీప్‌లిక్కర్ రారమ్మని పిలిషె.. వదలని దయ్యమాయె.. నర్సింహ్మారావు అట్లా తాగుడు సాలెగూట్లె పడ్డ ఈగలెక్క కొట్టుకొని కొట్టుకొని సచ్చిపొయిండు.. ఆ తల్లీ పిల్లలు దిక్కు లేని పక్షులయ్యిన్రు..
నల్లగా కమ్ముకున్న మబ్బులు.. మబ్బుల మజ్జెల్నుంచి మెరుపు లెక్క ఊరి మీదకు జారుతున్నది తాడు.. జారి ఊరి మీద ఏలాడుతున్నది. ఉట్టి తాడు కాదు, బంగారు రంగు తాడు. ఉరితాడు! చిత్రంగా ఆ ఉరి, మందు సీసా లెక్క మారుతున్నది. బంగారు ఉరితాడు, మందుసీసా రంగు ఒకదాన్ని పోలి ఒకటి పోటీ పడుతున్నై. మందు సీసా ఊరి మీద ఉరితాడు లెక్క ఏలాడుతున్నది!ఊరి మొగోళ్లంతా ఆ సీసాను అందుకుంటానికి ఎగబడుతున్నరు. వాళ్ల బార్యలు ఆళ్లను ఎనక్కు లాగుతున్నరు. బర్తలు బార్యల్ని తోసేస్తున్నరు. తంతున్నరు. సీసా దిక్కు ఉరుకుతున్నరు. ఉరిసీసారాయుడు ఉండి ఉండి వికటాట్టహాసం చేస్తున్నడు. సీసా అందుకున్నవాళ్లు తాగుతూ తూలుతూ కింద పడుతున్నరు.. కింద పడి కొట్టుకుంటున్నరు.. కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతున్నరు. వాళ్ల బార్యలు వాళ్ల మీద పడి ఏడుస్తున్నరు. ఉరిసీసా దిక్కు చేతులు యిసురుకుంట సాపెన్లు పెడుతున్నరు. బూతులు తిడుతున్నరు. ఉన్నట్టుండి వాళ్లల్లోంచి నలుగురు యిసురుగా ముందుకొచ్చి ఉరిసీసారాయుడిని గుంజి కొట్టడం మొదలుపెట్టిన్రు.. ఉరి సీసా మరింత పెద్దగా వికటాట్టహాసం చెయ్యబట్టింది.. ఆ వికృతమైన నవ్వు తెరలు తెరలుగా ఊరంతా కమ్ముకుంటున్నది..ఆ వికృతానికి కళ్లు చెదిరి మెల్లగా మెలకువొచ్చింది నాకు.
ఊరంతా నిద్రపోతున్నది!
రాత్రి విన్న సంగతి యాదికొచ్చింది– కళమ్మ శవం టౌన్ల పోస్టుమార్టం రూంలనే ఉంది. పోస్టుమార్టం ఇంకా కాలేదు! షానాసేపు నిద్దర పట్టలేదు నాకు. ఊర్లె తాగుడు గురించిన ఆలోచనల్తో మనసంత ఎట్లెట్లనొ అయితున్నది.. ఒశ్శి పోరగాల్లు సుత తాగుడుకు బానిసలైతున్రు. నేను చిన్నగున్నప్పుడు ఊర్లె రోడ్డు మీద కలిసినమంటె ముచ్చెట్లు పెట్టుకొనేది. ఆటలాడేది. డ్రామా లేసేది. ఇప్పుడు పోరగాల్లు కల్సిన్రంటె సిట్టింగేసుడే!పద్మాకర్ యాదికొచ్చిండు. ఒష్షోడు. నాకన్న చిన్నోడు. అన్నా అన్నా అనేటోడు. ఎంత బలంగ ఉండేటోడొ. వాళ్లమ్మ మణెమ్మ కిరాణం ఊర్లె మషూర్ ఉండె. మణెమ్మ యాక్సిడెంట్ల సచ్చిపాయె. వాళ్లాయన ఇంకో పెండ్లి జేసుకొని కిరాణం నడిపించిండు. కొడుకులిద్దరు పెద్దగై ఏరుబడి పక్కనె రెండు కిరాణం దుకాన్లె పెట్టుకునిరి. పద్మాకర్ ఊకుండక కిరాణం షాపుల చీప్‌లిక్కర్, బీర్లు అమ్మేటోడు. షాపు తర్వాతి రూం తాగేటోల్లకోసం పెట్టిండు. ఆ ఎనక రూంలల్ల ఇల్లు. ఆ షాపుకు వచ్చి తాగేటోల్లల్ల పద్మాకర్ దోస్తులే ఎక్కువ. వాల్లు తాగేటప్పుడల్లా దోస్తు గదా అని గుంజి మరీ కూసొబెట్టి పద్మాకర్‌కు గుడ ఒకటో, రెండో పెగ్గులు పోషేది. ఆ వచ్చి పొయ్యేటోల్లు ఆ రోజుకి తాగేది ఒక్కసారే గాని పద్మాకర్‌కు మాత్రం అట్ల రోజుకు నాలుగు పార్టీలు! అది గుడ ఒక్క రకం మందు కాదాయె. ఒకడు జర మంచి విస్కీ తాగితె ఒకడు చీప్‌లిక్కర్. ఒకడు బీర్ తాగితె ఇంకొకడు ఇంకోటి. ఎప్పుడు తాగుడులనే ఉండి.. సరిగ తినీ తినక కామెర్లు అయినయ్ పద్మాకర్‌కు. వాళ్లావిడ లబోదిబోమని కామెర్ల మందు పోయించి ఇగ ఈ మందు ముట్టనే ముటొద్దని ఒట్టేయించుకుంది. నాలుగు రోజులు ఓపిక పట్టిండు. ఉండబట్టలేక బార్య లేనప్పుడు సాటుంగ తాగుడం షురూ జేసిండు. చెట్టంత మనిషి. బక్క పీన్గె లెక్కయ్యిండు. సూస్తుండంగనె సచ్చిపొయిండు.. మనిషి పొయిండు. అప్పులు మిగిలినయ్. రాత అనుకొని ఆ దుక్నమే నడుపుకుంట, ఇద్దరు కొడుకుల్ని సదివించుకుంట బతుకు ఎల్లదీస్తున్నది పద్మాకర్ బార్య.ఆళ్ల బార్య కనబడ్డప్పుడల్లా పద్మాకర్ యాదికొచ్చి మనసు చివుక్కుమంటది.
తెల్లారింది. లేషి చూస్తె బయట శంకరమ్మ బట్టలుతుకుతున్నది. ‘‘బట్టలుతకడానికి ఈ రోజుల్ల బాగనే దొరికింది గదా!’’ అంటున్నది మా చెల్లె నాకై సూస్కుంట. చెల్లె హైద్రాబాదుల ఉంటది. అంతకు ముందు రోజె ఒచ్చి ఉండె.‘‘ఆ.. ఆళ్లాయన తాగి తాగి సచ్చిండు.. ఇద్దరు పిల్లలు! ఎట్ల సాదుకోవాలె.. ఏం దినాలె..? నాలుగిండ్ల్లల్ల బట్టలుతుక్కుంట బతుకుతున్నది’’ అన్నది అమ్మ. ‘‘ఓరి నాయనో!’’ అనుకున్న.‘‘కళమ్మ సంగతేందంట?’’ అన్న మల్ల అమ్మతోటి.‘‘అటు ఆళ్లుండి, ఇటు ఈళ్లుండి గుడ దిక్కులేని శవం లెక్క పడి ఉన్నదంట! ఇసొంటి ఇచ్చిత్రం నా జిందగీల సూడలేదు, ఇనలేదు రా’’ అన్నది అమ్మ.ఇగ ఉండలేక జల్ది జల్ది మొఖం కడుక్కొని రోడ్డు దిక్కు పోయిన.హోటల్ కాడ కొందరు దోస్తులు, ఒకరిద్దరు పెద్ద మనుషులు, సర్పంచు గుమిగూడి మాట్లాడుకుంటున్నరు–‘‘ఇంట్ల ఉన్న అందరి మీద కేసు బెడితె మరి శవాన్ని ఎవడు తేవాలె? ఎవడు సావు జెయ్యాలె?’’ రోషంగా అంటున్నడు సైదులు.‘‘మరి అన్న తీస్కపోతడేమో వాళ్ల ఊరికి’’ వెంకటేశం.‘‘అట్లెట్ల?! ఈ ఊరికిచ్చినంక సావు ఈడ్నె జేస్తరు. వాళ్ల ఊర్లె చెయ్యరు’’ లింగయ్య.‘‘మరెట్ల ఐతది.. అసలు పోస్టుమార్టం ఐతానికి సంతకమే చెయ్యలేదంట ఆ పిల్ల అన్న!’’ గోపాల్.‘‘సూస్కుంట ఊకుంటె ఎట్ల.. ఏదొ ఒకటి జెయ్యాలె గదా..’’ –తలా ఒక మాట అంటున్నరు.అంతల యాదయ్య, ‘‘అది సరెగనీ, సర్పంచ్ సాబ్! ఊర్లె ఇంతగనం తాగి సస్తుంటిరి.. ఒక కట్టడి లేదు.. ఒక పట్టింపు లేదు.. వైన్స్ షాపులు, బెల్టు షాపులు ఇంకా పెంచుతుంటిరి. ఊర్లె షాపుల్ల గుడ మందు ఫుల్లుగ దొర్కుతుండె.. పనులు లెవ్వంటె సాలు, తాగుడే.. ఒశ్శి పోరగాల్లు సుత పదిమంది దాక తాగుడుతోని పెండ్లిల్లు గుడ కాకుంటయితిరి. ఆల్లల్ల ఒకడు మొన్న పురుగుల మందు తాగి సచ్చె. ఇగ గింతేనా మన ఊరి గతి?!’’‘‘ఎహె, ఎవరింటరల్లా.. సర్పంచ్ సాబే పొద్దుగూకితె వైన్స్ షాపు ఎనకాల జేరుతుండె..’’ అన్నరెవరో..గొల్లుమన్నరంతా.‘‘అరె ఊకోరా, అది కాదు గనీ.. జర మీ సర్కారుకు జెప్పాలె సర్పంచ్ సాబ్.. ఊర్లు గింట్ల తాగి సచ్చినోల్లతోని పడావు పడుతున్నయని..’’‘ఆ!.. పిల్లి మెడకు గంటెవడు కడ్తడె..!’’
పొద్దు గూకుతున్నది. కళమ్మ ఇంటి ముందల గోల అయితున్నది. అక్కడికి పోయి ఒక పక్కన నిలబడ్డ. మొత్తానికి పోస్టుమార్టం జరిగిందట. శవం అక్కడే పడి ఉంది. కేసు వెనక్కి తీసుకుంటానికి కళమ్మ వాళ్ల అన్న హర్గిస్ ఒప్పుకోలేదంట.ఊరి పెద్ద మనుషులు, కళమ్మ కులపోల్లు కూడిన్రు.‘‘కళమ్మ అన్నను పిలవాల్సుండె..’’ ఎవలో అన్నరు.‘‘ఆడేడున్నడె.. తలా ఒక మాట అనేసరికి ఏడ్సుకుంట, ‘పానం పోయినా ఆళ్ల మీద కేసు ఎనక్కు తీస్కోను. నా చెల్లెను అరిగోస పెట్టి సంపిన్రు. లేకుంటె నా చెల్లె ఉరి పెట్టుకునే మాసరుదా?! నా చెల్లెనే సచ్చిపాయె. ఇగ మీ సావు మీరు సావురి’ అనుకుంట ఎల్లిపొయిండు. ఆన్తోని ఆళ్లమ్మ గుడ సాపెన్లు పెట్టుకుంట ఎల్లిపొయ్యింది’’ అన్నడొక పెద్ద మనిషి.‘‘అరే.. గిదేం ముచ్చటల్లా.. ఆల్ల ఊరికి పొయ్యి పిల్సుకు రారి ఎవలన్నా..’’ అన్నదొక ముసలవ్వ.‘‘ఎవడు పోతడవ్వా.. ఆ ఊరికి ఎవడన్న కళమ్మ ముచ్చెట్ల పోతె తన్నేటట్లున్నరంట. అంత రోషం మీదున్నరంట అందరు..’’‘‘మరి పిల్లల్నెవలు సూడాలె!’’ ‘‘ఆళ్ల సంగతి ఐటెంక.. ముందుగాల సావు కానియ్యాలె గదనె!’’
షానాసేపు తలా ఒక మాట మాట్లాడిన్రు. తలా ఒక సలహా ఇచ్చిన్రు. ఎవరికీ ఎటూ సమజైతలేదు.
అంతల్నె లచ్చయ్య బార్య వచ్చి నిలబడ్డది నా పక్కన. కళ తప్పిన మొఖం. లచ్చయ్య యాదికొచ్చిండు– ఊర్లె ప్రైవేటు హెల్పర్‌గా పనిచేసేది లచ్చయ్య. ఎవరింట్ల, ఎవల బాయికాడ ఏ కరెంటు పొయినా బాగు చేసేటోడు. ఆల్లు కోటర్ చీప్‌లిక్కర్ బాటిల్ చేతికన్న ఇచ్చేది, లేదంటె రోడ్డు మీదున్న దుక్నం ఎనక కూసొబెట్టన్న పోయించేది. కరెంటు పని చెయ్యడం మొదలు పెట్టినప్పట్సందె తాగుడు షురువైందిలచ్చయ్యకు. కొన్నేండ్ల్లల్లనే బానిసైపాయె. పొద్దున్లేషినప్పట్సంది తాగుడే.. మెల్ల మెల్లంగ కరెంటు పోల్లు ఎక్కడం చాతగాకుంటయ్యింది. ఆఖరికి మంచంల పడి నవిశి నవిశి సచ్చిపాయె... ‘‘ఏమంటవే నాగయ్య కక్కయ్యా!’’ అని సర్పంచ్ జర గట్టిగ అంటుండెసరికి నేను తేరుకున్న. నాగయ్య కళమ్మ కుల పెద్దమనిషి.‘‘ఆళ్ల పాలోళ్లందర్ని అర్సుకున్న.. ఎవరు ముందుకొస్తలేరు. సావుకు ఎటు లేదన్నా పది వేలు దాటుతయ్. ఎవల కాడ పైస లేదంటున్నరు. సూడు సూడుమని నా శేతిల గుడ పైస లేదు. ఏం జేద్దమో మీరే చెప్పురి..’’ ‘‘ఏం జేద్దామే పుల్లయ్య తాతా?’’ అన్నడు సర్పంచు, ఊర్లె వయసుల అనుభవంల పెద్దమనిషైన పుల్లయ్య తాత దిక్కు సూస్కుంట.తాగుతున్న సుట్టను నోట్లె నుంచి తీసి అన్నడు పుల్లయ్య తాత – ‘‘ఆడేమో గట్ల కేసు పెట్టి పాయె.. కులపోల్లేమో ఎవలు ముందుకొస్తలేరైతిరి.. ఏందిర ఈ కత.. రెండ్రోజుల సంది ఊరి పీన్గె ఆడ పడి ఉంటె ఒక్కలికి గుడ పట్టి లేకుంటె ఎట్లరా.. ఊరు ముండమోసినాదిర..?!’’అందరి తలలు నేలకు పడ్డయి..! అంతల–‘‘ఔ.. సగం ఊరు ముండమోసే ఉండె. తాగి తాగి సచ్చినోళ్ల పెండ్లాల ఉసురు తగులదా ఊరికి.. ఊరికే గాదు. సర్కారుకు గుడ తగుల్తది. సర్కారుకు గిదొక్కటే ఆదాయమైనాది, పీన్గల మీద పైసలేర్కోడం..! ఎహె.. సావు మీరే చెయ్రల్లా..! ఒక్కో తాగుబోతోని పెల్లాం ఉరి బెట్టుకుంటుంటది.. ఆళ్లందరి సావులు గుడ మీరే చెయ్యిరశె..! అయినగనీ, అందరు తాగేటోల్లు సచ్చి పెండ్లాలు ముండమోస్తుంటె.. ఈ పొల్లేమో ఆడు బతికుండంగనె ఇది ఉరిబెట్టుకున్నది. దాని సావు సూశన్నా శరం రావాలె మనూరోల్లకు అనుకున్నదేమొ.. గని యాడొస్తది, అందరు సిగ్గు దప్పినోల్లేనైతిరి.. థూ..!’ అనుకుంట కాండ్రించి తుపుక్కున ఊంచి లేషెల్లిపొయ్యింది ఎలమంచమ్మ.షానాసేపు ఎవ్వల నోట మాట రాలె!
- స్కైబాబ