మనవడు వైఎస్సార్‌సీపీలో ఉన్నాడని పింఛను తీసేశారు.. | tdp government corruption to pensions | Sakshi
Sakshi News home page

మనవడు వైఎస్సార్‌సీపీలో ఉన్నాడని పింఛను తీసేశారు..

Published Wed, Feb 10 2016 12:16 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

మనవడు వైఎస్సార్‌సీపీలో ఉన్నాడని పింఛను తీసేశారు.. - Sakshi

మనవడు వైఎస్సార్‌సీపీలో ఉన్నాడని పింఛను తీసేశారు..

నోటికాడ కూడు లాగేశారు
ఐదు వేల పింఛన్లకు ఎసరు అర్హులను తప్పించారు.. అనర్హులకు ఇప్పించారు జన్మభూమి కమిటీల ఆగడాలు లబోదిబోమంటున్న వృద్ధులు

 
 జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేద  పండు టాకుల నోటి దగ్గర కూడు లాగేస్తున్నారు. పింఛన్లు పొందుతున్న అర్హులను జాబితా నుంచి తొలగించి అర్హత లేని తమ వారికి సిఫార్సులు చేస్తున్నారు. అధికారులూ వారి ఒత్తిళ్లకు తలొగ్గి పింఛన్లు మంజూరు చేసేస్తున్నారు. ఇలా జిల్లాలో అనేక చోట్ల అవకతవకలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. జన్మభూమి కమిటీల పుణ్యమాని జిల్లాలో దాదాపు ఐదు వేల మందికి పైగానే ఎసరు పెట్టారు. దీంతో ప్రతి మండ లంలోనూ వందలాది మంది వృద్ధులు పింఛన్ల కోసం అల్లాడిపోతున్నారు.   
 
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీల పేరిట ఆ పార్టీ నాయకులకు పెత్తనమిచ్చింది. దీంతో వారు పింఛన్లు, ఇళ్ల మంజూరు వంటి అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తలదూరుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వృద్ధుల పింఛన్ల విషయానికే వస్తే ఇతరుల పింఛన్లు తొలగించేసి పిన్న వయసులో ఉన్న తమ వారికి మంజూరు చేయిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలానికి చెందిన ఇద్దరు వృద్ధురాళ్లు జన్మభూమి కమిటీ సభ్యులు తాము చనిపోయినట్టు రికార్డుల్లో చూపి టీడీపీకి అనుకూలురకు పింఛను ఇస్తున్నార ని, తాము బతికే ఉన్నామంటూ సాక్షాత్తూ హైకోర్టుకే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమాలు జిల్లాలో కోకొల్లలుగా చోటు చేసుకున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఉదాహరణకు పాయకరావుపేట మండలాన్నే తీసుకుంటే పీఎల్‌పురంలో జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సులతో ఎన్నాళ్ల నుంచో తీసుకుంటున్న పలువురి పింఛన్లు నిలిచిపోయాయి. వారి స్థానంలో అర్హత లేనివారికి మంజూరైపోయాయి. నిబంధనల ప్రకారం వృద్ధాప్యపు పింఛను పొందాలంటే 65 ఏళ్లు నిండాలి.

కానీ ఆ గ్రామంలో 50-60 ఏళ్ల లోపున్న వారి రేషన్‌కార్డుల్లో వయసు 65కు పైగా ఉన్నట్టు మార్పుచేసి పింఛన్లకు మార్గం సుగమం చేసేశారు. ఇలా ఆ ఊళ్లో నాగం చినరామన్నదొర, పిల్లి కన్నబ్బాయి మేడిశెట్టి వెంకన్నదొరలకు జన్మభూమి కమిటీ సిఫార్సులతో కొత్తగా పింఛన్లు మంజూరై పోయాయి. చనిపోయిన ఎస్.సూర్యనారాయణ రేషన్‌కార్డులో (జెరాక్స్ కాపీలో) కార్డులేని చీలి మన్నియ్య పేరు చేర్చి అతనికి పింఛను ఇస్తున్నారు. మార్పు చేశాక ఆయా కార్డుల్లో భార్య, భర్తల మధ్య వయసు 20 నుంచి 27 ఏళ్ల వరకు తేడా ఉండడం గమనార్హం.

 కళ్లు మూసుకుంటున్న అధికారులు
 రేషన్‌కార్డుల్లో వయసు, పేర్లు మార్చేసినా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) వెబ్‌సైట్‌లో మార్పు కుదరదు. పింఛన్లు మంజూరుకు ముందు పీడీఎస్‌లో వివరాలను కానీ ఉన్న వారి పేర్లు, వయసు సరి చూసుకుని ఓకే చేయాలి. కానీ జిల్లాలో అలా జరగడం లేదు. పీడీఎస్ వెబ్‌సైట్‌లో తక్కువ వయసున్నా సరే జన్మభూమి కమిటీలు సిఫార్సులు చేసిన వారికే కళ్లు మూసుకుని పింఛన్లు మంజూరు చేసేస్తున్నారు. మరో విశేషమేమిటంటే.. గత అక్టోబర్ నుంచి ప్రభుత్వం కొత్త పింఛన్ల జారీని నిలిపేసినా కొత్తవారికి డిసెంబర్, జనవరి నెలల్లో పింఛన్లు ఇచ్చేశారు. ఇలా ఎలా ఇచ్చారని అడిగితే తమకు తెలియదంటే తమకు తెలియదని అధికారులు తప్పించుకుంటున్నారు.

 ఐదు వేల మందికి మంగళం..
 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి జిల్లాలో వివిధ రకాల పింఛన్లు 3.23 లక్షల మందికి అందేవి. జన్మభూమి కమిటీలు రంగప్రవేశం చేశాక ఇప్పుడు వాటిని 3.16 లక్షలకు తగ్గించేశారు. ఇందులో రద్దు చేసిన వృద్ధాప్య పింఛన్లు ఐదు వేలకు పైగానే ఉంటాయని అంచనా. ప్రస్తుతం జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు లక్షా 49 వేల 718 మందికి అందుతున్నాయి. ప్రతిపక్షమైతే చాలు.. పింఛనుదారు ప్రతిపక్ష పార్టీకి చెందినవాడైతే చాలు.. ఏకంగా పింఛను నిలిపేస్తున్నారు. ఉదాహరణకు తండ్రి వైఎస్సార్‌సీపీ, కొడుకు టీడీపీ అయితే.. తండ్రి పింఛనును రద్దు చేసేస్తున్నారు. అలాంటి వాటిలో మచ్చుకు కొన్ని..
 
వీళ్లు అర్హులేనట..
పోర్టు పెన్షనర్ దంపతులకు ఎన్టీఆర్ భరోసా..
విశాఖపట్నం అల్లిపురం బంగారుమెట్ట కాలనీలో ప్రధాన కూడలిలో ఉన్న ఈ ఇల్లు విశాఖ పోర్టులో 30 ఏళ్లు పనిచేసిన నందవరపు తాతారావుది. పోర్టు నుంచి ప్రభుత్వ పెన్షన్ పొందుతున్నారు. ఈయనకు తెల్లకార్డు ఉంది. ఈయన భార్య నాగరాజమ్మకు వృద్ధాప్య పెన్షన్ కూడా వస్తోంది. ఒకే ఇంట్లో ఒకరికి మించి సామాజిక పింఛన్లు ఇవ్వకూడదు. కానీ జన్మభూమి కమిటీ లు తాతారావుకు పెన్షన్‌కు సిఫార్సు చేశారు. అధికారులు కూడా గుడ్డిగా పెన్షన్ మంజూరు చేసేశారు. 5 నెలలుగా దంపతులిద్దరూ పింఛన్ తీసుకుంటున్నారు. తమ వారైతే  అర్హత లేకపోయినా... రిటైర్ ఉద్యోగైనా సరే పింఛన్లు ఇస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి?
 
గ్రామ పెద్దకు పింఛన్

ఈయన పేరు బండారు దేముడు నాయుడు, ఈయన చీడికాడ మండలం ఎల్‌బీ పట్నం మాజీ సర్పంచ్. మాజీ పాల సొసైటీ అధ్యక్షుడు కూడా. ఈయనకు ఐదెకరాలకు పైగా పంట భూమి, గ్రామంలో రెండు పెంకుటిళ్లు ఉన్నాయి. ఈయనకు రేషన్‌కార్డు మంజూరైంది. ఎన్టీఆర్ భరోసా కింద రూ.1000ల వృద్ధాప్య పింఛన్ కూడా పొందుతున్నారు.
 
ఏడు నెలలైనా అందని పింఛన్..

ఇదే గ్రామానికి చెందిన బొడ్డు నాగరాజు, పోతుల కన్నమనాయుడు.. పింఛన్‌కు అన్నివిధాలా అర్హుడ ని అధికారులే నిర్ధారించారు. పింఛన్ కోసం జన్మభూమి కమిటీకి  సిఫార్సు చేశారు. కానీ  నాగరాజుకు ఐదెకరాల పంటభూమి ఉందని కమిటీ తిరస్కరించింది. నాకు 4 సెంట్ల భూమి మాత్రమే ఉంటే.. ఐదెకరాలుందంటారేమిటని స్పష్టం చేసినా వినిపించుకోలేదు. ఇదే గ్రామానికి చెందిన మరో పదిమందికి గతేడాది జూలైలోనే పింఛన్ మంజూరైనా జన్మభూమి కమిటి అడ్డుపుల్ల వేయడంతో నిలిపివేశారు.
 
మనవడు వైఎస్సార్‌సీపీలో ఉన్నాడని పింఛను తీసేశారు..
 అచ్యుతాపురం మండలం గండివానిపాలేనికి చెందిన పైలా సన్యాసమ్మ (70) భర్త 2006లో చనిపోయాడు. పూరిగుడిసెలో ఉంటోంది. రేషన్‌కార్డు (డబ్ల్యుఏపీ 034304600191, ఆధార్ 9661 4474 2781) ఆమెకి గత ప్రభుత్వంలో పింఛను (ఖాతా నం.18150278 2014) మంజూరు చేసింది. గత సెప్టెంబర్ వరకూ పెన్షన్ పొందింది. ఈమె మనవళ్లలో ఒకరు వైఎస్సార్‌సీపీ తరఫున వార్డు మెంబరుగా పోటీ చేశారు. ఆమె గ్రామంలో ఉండడం లేదని తప్పుడు సమాచార ంతో జన్మభూమి కమిటీ సిఫార్సు చేసి పింఛను రద్దు చేయించేసింది.
 
 వీళ్లు అనర్హులట.. ఆ పెన్షన్లు ఆపేశాం..
 పాయకరావుపేట మండలంలో 18 మంది అనర్హులు పెన్షన్ పొందుతున్నట్టు జెడ్పీ ఫ్లోర్‌లీడర్ చిక్కాల రామారావు జనవరి 30న ఫిర్యాదు చేశారు. ఆ జాబితాను డీఆర్‌డీఏకు పంపాం. యూఐడీ వెబ్‌సైట్‌లో వారి వివరాలను తనిఖీ చేయాలని ఎమ్మార్వోకు లేఖ రాశాం. అందులో తేడా ఉన్నట్టు తేలితే వారందరికి పూర్తిగా పెన్షన్లు నిలిపేస్తాం. ఈ 18 మంది పేర్లను పంచాయతీ, మండల జన్మభూమి కమిటీల అప్రూవ్ అయి వచ్చాయి. వారికి డీఆర్‌డీఏ, సెర్ప్ ద్వారా పెన్షన్లు మంజూరయ్యాయి.
 -సాంబశివరావు, ఎంపీడీవో, పాయకరావుపేట.
 
 బాధ్యులపై చీటింగ్ కేసు పెట్టాలి..
అర్హులను తొలగించి, అనర్హులకు పెన్షన్లు మంజూరుకు కారకులైన వారిపై చీటింగ్ కేసులు పెట్టాలి. జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అర్హులైన పేదల పొట్టుకొడుతున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని వృద్ధాప్య పెన్షన్లు తొలగిస్తున్నారు. టీడీపీ వారైతే 65 ఏళ్ల లోపున్నా పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. జిల్లాలో పూర్తిస్థాయి విచారణ జరిపించి అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి.
 -చిక్కాల రామారావు, జెడ్పీ ఫ్లోర్‌లీడర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement