అడుగంటిన భూగర్భజలం, సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు ( పాతచిత్రం )
సాక్షి, వెంకటగిరి: రుతుపవనాలు గతి తప్పి ఇబ్బంది పెడుతున్నా.. రైతులు కాడి పడేయడం లేదు. అనుకూలంకాని పరిస్థితులకు ఎదురొడ్డి బాధ్యతగా పంట పండిస్తూనే ఉన్నారు. తీరా పంట చేతికొచ్చి అమ్ముదామనే సమయానికి ధర అమాంతం పడిపోతుంది. ఈ పరిస్థితే అన్నదాతల్ని రగిలిపోయేలా చేస్తోంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న గిట్టుబాటు ధరకు, ఉత్పత్తి వ్యయానికి ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. కనీసం ఆ ధర అయినా అన్ని పంటలకు దక్కుతుంగా అంటే లేదు.
ఫలితంగా ఆర్థికంగా కుదేలవుతున్నారు. అప్పులు తీర్చలేక కుటుంబ భారం మోయలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న నియోజకవర్గంలోని కుటుంబాల్లో అధికశాతం మంది రైతు కుటుంబాలే. నియోజకవర్గంలో కండలేరు జలాశయం నుంచి తమ ప్రాంతాల గుండా చెన్నై, తిరుపతి పట్టణాలకు తాగునీరు నెపంతో పదుల సంఖ్య టీఎంసీల నీరును చిత్తూరు జిల్లా రైతులు ప్రతిఏటా చెరువులకు పెట్టుకుని పంటలు సాగుచేసుకుంటున్నారు, జిల్లాలోని డెల్టా ప్రాంత రైతులు రెండు పంటలకూ నీరు సంమృద్ధిగా లేకుంటే సోమశిల నుంచి కండలేరును చుక్కనీరు వదలరు.
నాలుగేళ్లుగా ఒక్క పంటకూడా పెట్టుకోలేని మెట్టప్రాంత వెంకటగిరి నియోజకవర్గ రైతులకు ఏళ్లుగా మారని ఈ పరిస్థితులే వారిని సాగుజలాల కోసం రోడ్డెక్కిస్తున్నాయి. వెంకటగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగే ఎస్‌ఎస్ కెనాల్‌ను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నా.. అన్ని బాధలని పంటి బిగువన భరిస్తున్నారు ఈ ప్రాంత రైతులు. జిల్లాకే చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి అయినప్పటికీ ఈ ప్రాంతంలో సాగునీటి రంగం మెరుగు పరచడం, మద్దతు ధర అందించడంలో ఏ మార్పు లేకపోవడంతో గత ఐదేళ్లుగా నష్టాల పాలవుతున్నారు.
రైతులకు అమలు చేయాల్సినవి
- ఎంఎస్ స్వామినాథన్ కమిచేసిన సిఫార్సులను అమలు చేస్తామని, పంట ఉత్పత్తి వ్యవయానికి 50 శాతం జోడించి మద్దతు ధర నిర్ణయిస్తామని రైతులకు పాలకులు ఇచ్చిన హమీని అమలు చేయాలి.
- గత నాలుగేళ్లుగా నామమాత్రంగా ప్రభుత్వం ఆహార ధాన్యాల మద్దతు ధర పెంచింది. మరికొంత సహకారం అందజేయాలి.
- రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి.
- రైతుకు జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడానికి ప్రత్యేక హెల్త్‌కార్డు సదుపాయం కల్పించాలి.
- వ్యవసాయ ధరల కమిషనర్ (సీఏసీపీ) పంట ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసే విధానం సరిగా లేదని రైతులకు నష్టం చేసేలా ఉందని, స్వామినాథన్, రమేష్ చంద్ కమిటీలు చెప్పిన దాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి.
- ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి , అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీగా ఎకరాకు రూ.10 వేలు ఆర్థికసాయం అందించాలన్న భూపేంద్రసింగ్ హుడా కమిటీ చేసిన సిఫార్సులను అమలుచేయాలి.
ఇదీ సంక్షోభం
భూమినే నమ్ముకున్న రైతులు బజారున పడడానికి బాధ్యులు ఎవరు? ఇది రాష్ట్రానికి క్షేమదాయకం కాదు. ఎన్నాళ్లనీ.. ఎన్నేళ్లనీ రైతులు తమ బాధలు దిగమింగుతూ బతకాలి? నాలుగేళ్లుగా రైతులకు పాలకులు ప్రకటించే రైతు రథం, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు వంటి పథకాలు తెలుగు తమ్ముళ్లకే పరమితమయ్యాయి. పంట వేసేందుకు సరైన విత్తనాలు అందించడం లేదు. ప్రకృతి ప్రకోపానికి గురైతే సాయం అందదు.
బ్యాంకుల నుంచి రుణాలు అందక సాగు కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి ఆరుగాలం కష్టించి బోరుబావుల కింద కొద్దో గొప్పో సాగుచేసిన పంటకు గిట్టుబాటు ధరలు అందవు. కోతల సమయంలో 30 శాతం వరకూ తగ్గిపోతున్నాయి. సాగు ఖర్చులు, పురుగుమందులు, ఎరువుల ధరలు మాత్రం ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. 2016 నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో నాలుగేళ్లుగా కరువు తాండవిస్తుంది. వాతావరణ అననుకూలతతో పంటలు సాగుచేయడం తలకు మించిన భారంగా పరణమించింది. నియోజకవర్గంలో అప్పుల ఊబిలో ఉన్న కుటుంబాల్లో 60 శాతం మందికి వ్యవసాయమే అధారం. టిడిపి అధినేత గత ఎన్నికల్లో రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని హమీ ఇచ్చి గద్దెనెక్కారు.
తొలి సంతకం రైతురుణమాఫీపై చేసి ఆపై కొర్రీలు పెట్టి ఎకరా భూమికి రూ.15000 వరకూ మాఫీ అంటూ కోతపెట్టడమే కాకుండా ఐదు విడతల్లో ఐదేళ్లపాటు ఇస్తానని చెప్పి ప్రతి ఏటా ఎకరాకు రూ 3000 వంతున మూడు దఫాలు చెల్లించారు. అయితే 4,5 విడతల రుణమాఫీ సొమ్ము ఇప్పటికీ రైతుల చేతికందలేదు. చాన్నాళ్ల తర్వాత రైతుల్లో ఆగ్రహాన్ని గమనించిన టిడిపి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఎన్నికల ముందు తీసుకొచ్చింది. అంతకు ముందే తెలంగాణలో ఈ పధకం ద్వారా అక్కడి తెరాస ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో రైతులే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపబోతున్నారని గ్రహించి 3,4 విడతల రుణమాఫీ సోమ్మును ఎన్నికలకు ముందుగానే జమ చేస్తానని వెంకటగిరి సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యం
చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారు. వ్యవసాయంపై ఆయన ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. ఎస్‌ఎస్‌కెనాల్ పూర్తిచేస్తామని ఎన్నికల సంధర్భంగా ఇచ్చిన హమీలు విస్మరించారు. దీనివల్ల వేలాది ఎకరాలు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
– మామిడి ప్రభాకర్, మార్లగుంట, డక్కిలి మండలం
నీరందక సాగు ప్రశ్నార్థకం అయింది
తెలుగుగంగ ద్వారా సాగునీరందక ఈ ఏడాది పంటలు వేయలేదు. మా గ్రామంలోనే సుమారు 250 ఎకరాలు బీడు భూములుగా మారాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే సాగునీటి ప్రాజెక్టర్‌లను అభివృద్ది చేస్తానని ప్రకటించడం ఆనందగా ఉంది.
– కె రామిరెడ్డి, కుప్పంపల్లి, వెంకటగిరి మండలం
జగన్‌తో మంచి రోజులు
జలయజ్ఞం పేరిట సాగునీటి ప్రాజెక్ట్‌లు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆయన హయాంలోనే ఎస్‌ఎస్ కెనాల్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినా టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. జగన్‌తో మళ్లీ మంచిరోజులు వస్తాయని ఎదురు చూస్తున్నాం.
– ఆవుల గిరియాదవ్, సిద్ధవరం, వెంకటగిరి మండలం
వైఎస్సార్ హయాంలో సాగుకు స్వర్ణయుగం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ద్వారా తెలుగుగంగ బ్రాంచి కాలువలు పూర్తి, మెట్టప్రాంతాలకు సాగునీరందించే సుమారు 350 కోట్లుతో నియోజకవర్గంలోని రాపూరు వద్ద ఎస్‌ఎస్‌కెనాల్ నిర్మాణ పనులకు శంకుస్దాపన చేశారు. ఆయన మరణం తరువాత వచ్చిన పాలకులు ఆ ప్రాజెక్ట్‌లను విస్మరించారు.
– మేకల శ్రీనివాసులు, వెంకటగిరి
రాజన్న ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు
వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే జలయజ్ఞం ద్వారా ఎస్‌ఎస్ కెనాల్ పూర్తి చేసేవారు. తెలుగుగంగ బ్రాంచి కాలువలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేవారు. రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా.
– ఆర్ వీరరాఘవులు, వెంకటగిరి
Comments
Please login to add a commentAdd a comment