‘ఇంటి’గుట్టు | TDP Government Did Fraud In Urban Housing | Sakshi
Sakshi News home page

‘ఇంటి’గుట్టు

Published Mon, Apr 1 2019 12:07 PM | Last Updated on Mon, Apr 1 2019 12:09 PM

TDP Government Did Fraud In Urban Housing - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని నగరాలు, మునిసిపాలిటీలలో అర్బన్‌ హౌసింగ్‌ పేరిట పేదల కోసమంటూ నిర్మిస్తున్న ఇళ్లను పేదలకు రుణంపై ఇస్తుండడంతో సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం పేదలకు రుణంపై ఇళ్లను మంజూరు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తరహాలో ఇళ్లను విక్రయిస్తుండడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. జిల్లాలోని మునిసిపాలిటీలలో అర్బన్‌ హౌసింగ్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిని మూడు కేటగిరీలుగా విభజించి 300 చ.గ, 365 చ.గ, 430 చ.గ. విస్తీర్ణంలో నిర్మిస్తోంది.  మొదటి కేటగిరి ఇంటి విలువ రూ.5.65 లక్షలు, రెండవ కేటగిరి ఇంటికి రూ. 6.65 లక్షలు, మూడో కేటగిరి ఇంటికి రూ.7.65 లక్షలు ధరగా నిర్ణయించింది. ఇందులో ప్రతి కేటగిరికి రూ.3 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ప్రకటించింది. మిగిలిన మొత్తం రుణంగా పేర్కొంటూ బ్యాంకు నుంచి ప్రభుత్వమే లబ్ధిదారుని పేరిట రుణం తీసుకుని దానిని వాయిదాల పద్ధతిలో లబ్ధిదారు చెల్లించాలని పేర్కొంది. 300 చ.గ. ఇంటికి లబ్ధిదారు రూ.500, 365 చ.గ. ఇంటికి రూ.50వేలు, 430 చ.గ. ఇంటికి రూ.లక్ష డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ లెక్కల్లో మొదటి కేటగిరి లబ్ధిదారుకి రూ.2,64,500, రెండవ కేటగిరి లబ్ధిదారుకు రూ.3,15,000, మూడవ కేటగిరి లబ్ధిదారుకి రూ.3,65,000లు రుణంగా ఉంటుంది. మొదటి కేటగిరి లబ్ధిదారుడు ప్రతి నెలా రూ.2,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ లబ్ధిదారు ఇంటి కోసం రూ.6 లక్షలు చెల్లించినట్లవుతుంది. రెండవ కేటగిరి లబ్ధిదారు నెలకు రూ.3,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉండడంతో ఈ ఇంటి విలువ లబ్ధిదారు రుణం తీరే సరికి రూ.8,40,000లు, మూడవ కేటగిరి లబ్ధిదారు నెలకు రూ.4500 చొప్పున 20 ఏళ్లు చెల్లించడం వల్ల ఇంటి ధర రూ.10,80,000లు అవుతోంది. ఇంతటి పెద్ద మొత్తాన్ని లబ్ధిదారు నుంచి వసూలు చేస్తూ పేదల కోసం అంటుండడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటిని బేరీజు వేసుకుంటే ప్రభుత్వం టిడ్‌కో పేరిట కొందరు అధికార పార్టీ అనుయాయులతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయిస్తూ పేదలను లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

రాజాంలో..

రాజాంలో నిర్మాణంలో  బ్లాకులు

రాజాం: రాజాంలో స్మార్ట్‌ సిటీ నిర్మాణం చేస్తామని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ప్లాట్ల ధరలు ఉంటాయని, పట్టణ పరిధిలో నిర్మాణాలు ఉంటాయని 15 నెలల క్రితం సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా కంచరాం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్‌ ఇచ్చిన 34 ఎకరాలలో రాజాం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాలు ప్రారంభించారు. సాధారణంగా ఇళ్ల నిర్మాణాలు ఇటుక, సిమెంట్‌ రాళ్లతో నిర్మిస్తారు. ఇక్కడ మాత్రం పూర్తిగా సీర్‌వాల్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్మార్ట్‌సిటీలో మాత్రం ఆరు అంగుళాల వెడల్పుతో గోడలన్నీ కాంక్రీట్‌తో నిర్మాణమవుతున్నాయి.

ఈ స్మార్ట్‌సిటీ నిర్మాణాన్ని విశాఖపట్నానికి చెందిన విజయనిర్మాణ్‌ కంపెనీకి అప్పగించారు. ఇక్కడికి వచ్చిన రాతిచిప్స్‌తో  పాటు ఇసుకలో నాణ్యతా ప్రమాణాలు మందగించినట్లు తెలుస్తోంది. పునాదుల నిమిత్తం వేసిన పిల్లర్లలో అప్పుడే బీటలు కనిపిస్తున్నాయి. ఫ్లాట్ల నిర్మాణాలు పూర్తికాకముందే బీటలు వస్తుండడంతో ఫ్లాట్లు పూర్తయిన తరువాత, ఈ ఇంట్లో దిగిన వారి పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు వాపోతున్నారు. స్మార్ట్‌ సిటీ నిర్మాణాల నిమిత్తం లబ్ధిదారులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నిర్మితమవుతున్న బ్లాకులను చూసి లబ్ధిదారుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. మొత్తం 23 బ్లాకులు నిర్మించాల్సి ఉంది. ఒక్కో బ్లాక్‌లో 48 ఫ్లాట్ల నిర్మాణాలు ఉండాలి.

ఇందులో డబుల్‌ బెడ్‌రూం, సింగిల్‌ బెడ్‌రూంతో పాటు పెద్ద సైజులోని సింగిల్‌ బెడ్‌రూం నిర్మాణం జరపాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఒక్క బ్లాక్‌ కూడా నిర్మాణం జరగలేదు. గతంలో ఈ ఫ్లాట్ల నిమిత్తం మొత్తం 3,900 మంది దరఖాస్తు చేసుకోగా, 1600 మందిని మాత్రమే రాజాం నగరపంచాయతీ అధికారులు అర్హులుగా గుర్తించారు. అయితే ఇందులో 893 మంది డీడీలు తీయగా, 211 మంది డీడీలు తీయాల్సి ఉంది. ఇంతవరకూ ఈ 211 మంది డీడీలు తీయలేదు. డీడీలు చెల్లించిన వారిలో  వారం రోజుల క్రితం లాటరీ ద్వారా 90 మందిని ఎంపికచేసి ఫ్లాట్లు కేటాయించారు. వీరంతా నిర్మాణాలు వద్దకు చేరుకుని చూసి విస్తుపోయారు. బ్లాక్‌ల నిర్మాణాలు జరగకుండానే తమకు ఫ్లాట్లు కేటాయించడంపై మండిపడుతున్నారు.

పలాసలో..

పలాసలో నిర్మాణమవుతున్న ఏహెచ్‌పీ ఇళ్లు

కాశీబుగ్గ: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు రాష్ట్ర పథకాలుగా పేర్లు పెట్టుకుని అధికార పార్టీ నాయకులు, అధికారులు పలాస ఎమ్మెల్యే కలిసి ఇష్టానుసారం కేటాయింపులు జరుపుకుంటున్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు, కౌన్సిలర్‌లు, టీడీపీలో వివిధ పదవుల్లో ఉన్నవారు ఈ ఇళ్లను సొంతం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా పలాసలో నిర్మితమైన 198 హుద్‌హుద్‌ ఇళ్ల అమ్మకాలు జరుపుకున్నారు. డబ్బున్నవారు ఇళ్లను కొనుగోలు చేసుకున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 25వార్డుల్లోని 400 కుపైగా వీధులలో నివసిస్తున్న 60వేల మందికి కేవలం 1948 ఏహెచ్‌పీ ఇళ్లు మంజూరు చేసి టాటా కంపెనీకి ప్రాజెక్టు అందించారు. ఇందుకు ముందస్తు దరఖాస్తులు 7వేల వరకు వచ్చి చేరాయి. ఇందులో అనర్హులు తొలగించగా 4వేల మంది సిద్ధమయ్యారు. ఇందులో స్క్రూటినీ చేసి వారికి ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఆఖరికి డీడీలు స్వీకరించే పక్రియలో వీటి సంఖ్య తగ్గుముఖం పట్టింది.

‘ఆమదాలవలసలో..’

భైరిశాస్త్రుల పేట వద్ద నిర్మాణాల్లో ఉన్న ఇళ్లు (అర్బన్‌ హౌసింగ్‌)

ఆమదాలవలస: పేదోడిపై పిడుగు పడిన విధంగా టీడీపీ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన అర్బన్‌ హౌసింగ్‌ స్కీం ఇళ్ల మంజూరు ఉంది. నిరుపేదలకు ఇల్లు కట్టి  ఇస్తామని చెప్పి ప్రతి  లబ్ధిదారు ఒక్కో ఇంటికి  రూ.4లక్షల వరకు తమ వాటా చెల్లించాలని  నిబంధన పెట్టి, లబ్ధి దారు పేరు మీద బ్యాంకులో లోన్‌ అప్పుగా ఇస్తూ పేదోడి నెత్తిన గుదిబండ మోపింది. ఆమదాలవలసలో జగ్గు శాస్త్రుల పేట, భైరిశాస్త్రుల పేట గ్రామాల వద్ద  తొలివిడతగా మున్సిపాలిటీలోని  520మంది లబ్ధిదారులను ఎంపిక చేసి  వారితో డీడీలు తీయించి, బ్యాంకుల నుంచి లోన్‌ అందిస్తామని చెబుతూ  ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని  లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిర్మాణాలు పూర్తి కాకుండా బ్లాక్‌లను కూడా కేటాయించారు.

రుణమాఫీపై జగన్‌ హామీతో అర్బన్‌ హౌసింగ్‌కు డిమాండ్‌
పేదల ఇళ్లను రుణంపై ఇస్తుండడాన్ని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి   తప్పుపడుతూ జిల్లాకు ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు శ్రీకాకుళం నగరంలో జరిగిన సభలో అర్బన్‌ హౌసింగ్‌ ఇళ్లకు సంబంధించిన రుణాన్ని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తానని ప్రకటించడంతో అర్బన్‌ హౌసిం గ్‌కు డిమాండ్‌ పెరిగింది.  జగన్‌మోహన్‌ రెడ్డి  రుణమాఫీ ప్రకటించిన వెంటనే లబ్ధిదారుల్లో కదలిక వచ్చి దరఖాస్తు చేసుకోవడంతో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.  ఇటీవల సామూహిక గృహ ప్రవేశాలు అంటూ హడావుడి చేసినప్పటికీ  అది ఆ రోజుతోనే అయిపోయింది. వారికి ఇప్పటివరకు ఇళ్లను స్వాధీనం చేయలేకపోయారు.

విద్యుత్, తాగునీరు సౌకర్యాలను ఇప్పటికీ కల్పించలేదు. వాటిని కల్పించిన తరువాత లబ్ధిదారులకు స్వాధీనం చేస్తామని అధికారులు చెబుతున్నా వాస్తవం ఇది కాదని మరికొందరు అధికారులు అంటున్నారు. ఈ ఇళ్లకు రుణాలను ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు రావడం లేదని ఈ కారణంగానే లబ్ధిదారులకు ఇళ్లను స్వాధీనం చేయడం లేదని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతన్నది అటుంచితే జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఉచితంగా ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటారని లబ్ధిదారులు విశ్వసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement