URBAN HOUSING
-
‘ఏపీకి రెండు విడతల్లో రూ. 6,953 కోట్ల సాయం చేశాం’
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణం) పథకం కింద 2015-16 నుంచి 2019-20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు విడతల్లో రూ. 6,953 కోట్లు ఆర్థిక సహాయం అందించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజ్యసభలో బుధవారం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు లిఖితపూర్వ సమాధానం ఇచ్చారు. లబ్దిదారులకు వడ్డీ సబ్సిడీ కింద మరో 436.54 కోట్ల రూపాయల్ని ఏపీకి అందించినట్టు మంత్రి చెప్పారు. (చదవండి : పవన్‌కు బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు!) లక్షా 24 వేల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం చేసే 40 శాతం ఆర్థిక సాయంలో మొదటి వాయిదాను ఇంకా విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్దిదారుల జాబితా, వారి ఆధార్ కార్డు వివరాలు, వినియోగ పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అనంతరం నిధులను విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ ప్రకారం ఈ ఇళ్లు 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. (చదవండి : ఆశావహ జిల్లాల్లో విశాఖ ముందంజ) -
రాష్ట్రానికి 2.58 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పట్టణ గృహ నిర్మాణ పథకం కింద రాష్ట్రానికి 2,58,648 గృహాల్ని కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక(డీపీఆర్)ను పట్టణ గృహ నిర్మాణంపై బుధవారం ఢిల్లీలో జరిగిన మంజూరు–పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమోదించారు. 57,629 గృహాలు పట్టణ ప్రాంతాల్లో, 2,01,019 గృహాలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో మంజూరయ్యాయి. ఈ గృహాల ప్రాజెక్టు విలువ రూ. 7,042.50 కోట్లు కాగా ఇందులో కేంద్రం వాటా రూ. 3,879.72 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 1,581.39 కోట్లు, లబ్ధిదారుడి వాటా లేదా బ్యాంకు రుణం రూ. 1,581.39 కోట్లు. గత నెలలో మంజూరైన 1,24,624 గృహాలతో కలిపితే మొత్తం 3,83,272 గృహాలు రాష్ట్రానికి మంజూరయ్యాయి. -
పట్టణ పేదల ఇళ్లలో ప్రజాధనం ఆదాకు ‘రివర్స్’
సాక్షి, అమరావతి: పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పక్క రాష్ట్రాల్లో జీఎస్టీతో కలిపి పట్టణ పేదల ఇళ్ల నిర్మాణ పనులను చదరపు అడుగుకు రూ.1,500 నుంచి రూ.1,600 చొప్పున అప్పగిస్తే రాష్ట్రంలో మాత్రం చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున గృహాల నిర్మాణ పనులను టీడీపీ సర్కార్ కట్టబెట్టింది. పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామనే సాకుతో గత సర్కార్ భారీ దోపిడీకి పాల్పడిందని నిపుణుల కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే భారీ ఎత్తున ప్రజాధనం ఆదా అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా చదరపు అడుగుకు రూ.500 చొప్పున ఆదా అయ్యే అవకాశం ఉందని.. దీనివల్ల పట్టణ పేదలకు భారీ ఎత్తున ఊరట లభిస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజాధనం భారీగా ఆదా... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పీఎంఏవై కింద ఐదు లక్షల ఇళ్లను మంజూరు చేసింది. రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే.. 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక్కొక్క ఇంటికి చదరపు అడుగుకు రూ.500 ప్రకారం రూ.1.50 లక్షల చొప్పున ఆదా అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో ఖజానాకు మరికొంత ఆదా అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ లెక్కన రూ.వేల కోట్లకుపైగా ప్రజాధనం ఆదా అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. టెక్నాలజీ సాకు... ఉపకరణాల కొనుగోళ్లలో అక్రమాలు రాష్ట్రంలో టీడీపీ సర్కార్ పట్టణ పేదలకు 225 ప్రాంతాల్లో 4,54,909 గృహాలను నిర్మించి ఇచ్చే పనులను 34 ప్యాకేజీలుగా కింద విభజించి 2017 ఏప్రిల్‌లో ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో టెండర్లు పిలిచింది. పట్టణాల్లో పేదలకు సొంతింటిని చేకూర్చడం కోసం ఒక్కో ఇంటికి కేంద్రం పీఏంఏవై కింద రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ.1.50 లక్షలు ఇస్తుంది. అంటే ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.మూడు లక్షలు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నిధులతో సాంప్రదాయ పద్ధతుల్లో ఇళ్లను నిర్మించే అవకాశం ఉంది. కానీ టీడీపీ సర్కార్ వ్యవహరించిన విధానాల వల్ల 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇంటి వ్యయం రూ.5.72 లక్షలకు(లబ్ధిదారునిపై భారం రూ.2.72 లక్షలు), 365 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇంటి వ్యయం రూ.6.74 లక్షలకు (లబ్ధిదారునిపై భారం రూ.3.74 లక్షలు), 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఇంటి వ్యయం రూ.7.71 లక్షలకు (లబ్ధిదారునిపై భారం రూ.4.71 లక్షలు) పెరిగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విచారించింది. షీర్ వాల్ టెక్నాలజీ, ఉపకరణాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడటం వల్ల ఇళ్ల నిర్మాణ పనుల వ్యయం రూ.25,170.99 కోట్లకు చేరుకుందని నిపుణుల కమిటీ నిర్థారిస్తూ ఈ ఏడాది జూలై 17న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. హుద్‌హుద్ ఇళ్లలో మిగిలిన పనులకే టెండర్లు విశాఖ జిల్లాలో హుద్‌హుద్ తుపాన్ బాధితుల కోసం 800 మిగిలిపోయిన ఇళ్ల పనుల కోసం రూ.8,53,50,387 వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. దీంతో యూనిట్ వ్యయం రూ.1,06,687 అవుతోందని, కొత్త పనులైతే యూనిట్ ధర ఎక్కువగా ఉండేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘సాక్షి’ ఆదివారం సంచికలో మిగిలిన పనులకు బదులుగా హుద్‌హుద్ ఇళ్లు కొత్త పనులుగా ప్రచురితమైంది. పాఠకులు ఈ మార్పును గమనించాల్సిందిగా కోరుతున్నాం -
అర్బన్ హౌసింగ్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెవెన్యూశాఖపై నిర్వహిస్తున్న సమీక్ష ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం అర్బన్ హౌసింగ్, టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టిడ్కో) పై సీఎం సమీక్ష ప్రారంభమైంది. కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ రివ్యూలో భాగమైంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ మిథున్‌రెడ్డి, సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. టిడ్కోలో రివర్స్ టెండరింగ్ అంశం చర్చకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. -
‘ఇంటి’గుట్టు
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని నగరాలు, మునిసిపాలిటీలలో అర్బన్ హౌసింగ్ పేరిట పేదల కోసమంటూ నిర్మిస్తున్న ఇళ్లను పేదలకు రుణంపై ఇస్తుండడంతో సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం పేదలకు రుణంపై ఇళ్లను మంజూరు చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం తరహాలో ఇళ్లను విక్రయిస్తుండడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. జిల్లాలోని మునిసిపాలిటీలలో అర్బన్ హౌసింగ్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిని మూడు కేటగిరీలుగా విభజించి 300 చ.గ, 365 చ.గ, 430 చ.గ. విస్తీర్ణంలో నిర్మిస్తోంది. మొదటి కేటగిరి ఇంటి విలువ రూ.5.65 లక్షలు, రెండవ కేటగిరి ఇంటికి రూ. 6.65 లక్షలు, మూడో కేటగిరి ఇంటికి రూ.7.65 లక్షలు ధరగా నిర్ణయించింది. ఇందులో ప్రతి కేటగిరికి రూ.3 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ప్రకటించింది. మిగిలిన మొత్తం రుణంగా పేర్కొంటూ బ్యాంకు నుంచి ప్రభుత్వమే లబ్ధిదారుని పేరిట రుణం తీసుకుని దానిని వాయిదాల పద్ధతిలో లబ్ధిదారు చెల్లించాలని పేర్కొంది. 300 చ.గ. ఇంటికి లబ్ధిదారు రూ.500, 365 చ.గ. ఇంటికి రూ.50వేలు, 430 చ.గ. ఇంటికి రూ.లక్ష డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కల్లో మొదటి కేటగిరి లబ్ధిదారుకి రూ.2,64,500, రెండవ కేటగిరి లబ్ధిదారుకు రూ.3,15,000, మూడవ కేటగిరి లబ్ధిదారుకి రూ.3,65,000లు రుణంగా ఉంటుంది. మొదటి కేటగిరి లబ్ధిదారుడు ప్రతి నెలా రూ.2,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ లబ్ధిదారు ఇంటి కోసం రూ.6 లక్షలు చెల్లించినట్లవుతుంది. రెండవ కేటగిరి లబ్ధిదారు నెలకు రూ.3,500 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉండడంతో ఈ ఇంటి విలువ లబ్ధిదారు రుణం తీరే సరికి రూ.8,40,000లు, మూడవ కేటగిరి లబ్ధిదారు నెలకు రూ.4500 చొప్పున 20 ఏళ్లు చెల్లించడం వల్ల ఇంటి ధర రూ.10,80,000లు అవుతోంది. ఇంతటి పెద్ద మొత్తాన్ని లబ్ధిదారు నుంచి వసూలు చేస్తూ పేదల కోసం అంటుండడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటిని బేరీజు వేసుకుంటే ప్రభుత్వం టిడ్కో పేరిట కొందరు అధికార పార్టీ అనుయాయులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తూ పేదలను లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాజాంలో.. రాజాంలో నిర్మాణంలో బ్లాకులు రాజాం: రాజాంలో స్మార్ట్ సిటీ నిర్మాణం చేస్తామని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ప్లాట్ల ధరలు ఉంటాయని, పట్టణ పరిధిలో నిర్మాణాలు ఉంటాయని 15 నెలల క్రితం సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా కంచరాం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్ ఇచ్చిన 34 ఎకరాలలో రాజాం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాలు ప్రారంభించారు. సాధారణంగా ఇళ్ల నిర్మాణాలు ఇటుక, సిమెంట్ రాళ్లతో నిర్మిస్తారు. ఇక్కడ మాత్రం పూర్తిగా సీర్వాల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్మార్ట్‌సిటీలో మాత్రం ఆరు అంగుళాల వెడల్పుతో గోడలన్నీ కాంక్రీట్‌తో నిర్మాణమవుతున్నాయి. ఈ స్మార్ట్‌సిటీ నిర్మాణాన్ని విశాఖపట్నానికి చెందిన విజయనిర్మాణ్ కంపెనీకి అప్పగించారు. ఇక్కడికి వచ్చిన రాతిచిప్స్తో పాటు ఇసుకలో నాణ్యతా ప్రమాణాలు మందగించినట్లు తెలుస్తోంది. పునాదుల నిమిత్తం వేసిన పిల్లర్లలో అప్పుడే బీటలు కనిపిస్తున్నాయి. ఫ్లాట్ల నిర్మాణాలు పూర్తికాకముందే బీటలు వస్తుండడంతో ఫ్లాట్లు పూర్తయిన తరువాత, ఈ ఇంట్లో దిగిన వారి పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు వాపోతున్నారు. స్మార్ట్ సిటీ నిర్మాణాల నిమిత్తం లబ్ధిదారులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నిర్మితమవుతున్న బ్లాకులను చూసి లబ్ధిదారుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. మొత్తం 23 బ్లాకులు నిర్మించాల్సి ఉంది. ఒక్కో బ్లాక్‌లో 48 ఫ్లాట్ల నిర్మాణాలు ఉండాలి. ఇందులో డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూంతో పాటు పెద్ద సైజులోని సింగిల్ బెడ్రూం నిర్మాణం జరపాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఒక్క బ్లాక్ కూడా నిర్మాణం జరగలేదు. గతంలో ఈ ఫ్లాట్ల నిమిత్తం మొత్తం 3,900 మంది దరఖాస్తు చేసుకోగా, 1600 మందిని మాత్రమే రాజాం నగరపంచాయతీ అధికారులు అర్హులుగా గుర్తించారు. అయితే ఇందులో 893 మంది డీడీలు తీయగా, 211 మంది డీడీలు తీయాల్సి ఉంది. ఇంతవరకూ ఈ 211 మంది డీడీలు తీయలేదు. డీడీలు చెల్లించిన వారిలో వారం రోజుల క్రితం లాటరీ ద్వారా 90 మందిని ఎంపికచేసి ఫ్లాట్లు కేటాయించారు. వీరంతా నిర్మాణాలు వద్దకు చేరుకుని చూసి విస్తుపోయారు. బ్లాక్‌ల నిర్మాణాలు జరగకుండానే తమకు ఫ్లాట్లు కేటాయించడంపై మండిపడుతున్నారు. పలాసలో.. పలాసలో నిర్మాణమవుతున్న ఏహెచ్‌పీ ఇళ్లు కాశీబుగ్గ: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు రాష్ట్ర పథకాలుగా పేర్లు పెట్టుకుని అధికార పార్టీ నాయకులు, అధికారులు పలాస ఎమ్మెల్యే కలిసి ఇష్టానుసారం కేటాయింపులు జరుపుకుంటున్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, టీడీపీలో వివిధ పదవుల్లో ఉన్నవారు ఈ ఇళ్లను సొంతం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా పలాసలో నిర్మితమైన 198 హుద్‌హుద్ ఇళ్ల అమ్మకాలు జరుపుకున్నారు. డబ్బున్నవారు ఇళ్లను కొనుగోలు చేసుకున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 25వార్డుల్లోని 400 కుపైగా వీధులలో నివసిస్తున్న 60వేల మందికి కేవలం 1948 ఏహెచ్‌పీ ఇళ్లు మంజూరు చేసి టాటా కంపెనీకి ప్రాజెక్టు అందించారు. ఇందుకు ముందస్తు దరఖాస్తులు 7వేల వరకు వచ్చి చేరాయి. ఇందులో అనర్హులు తొలగించగా 4వేల మంది సిద్ధమయ్యారు. ఇందులో స్క్రూటినీ చేసి వారికి ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఆఖరికి డీడీలు స్వీకరించే పక్రియలో వీటి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ‘ఆమదాలవలసలో..’ భైరిశాస్త్రుల పేట వద్ద నిర్మాణాల్లో ఉన్న ఇళ్లు (అర్బన్ హౌసింగ్) ఆమదాలవలస: పేదోడిపై పిడుగు పడిన విధంగా టీడీపీ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన అర్బన్ హౌసింగ్ స్కీం ఇళ్ల మంజూరు ఉంది. నిరుపేదలకు ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి ప్రతి లబ్ధిదారు ఒక్కో ఇంటికి రూ.4లక్షల వరకు తమ వాటా చెల్లించాలని నిబంధన పెట్టి, లబ్ధి దారు పేరు మీద బ్యాంకులో లోన్ అప్పుగా ఇస్తూ పేదోడి నెత్తిన గుదిబండ మోపింది. ఆమదాలవలసలో జగ్గు శాస్త్రుల పేట, భైరిశాస్త్రుల పేట గ్రామాల వద్ద తొలివిడతగా మున్సిపాలిటీలోని 520మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారితో డీడీలు తీయించి, బ్యాంకుల నుంచి లోన్ అందిస్తామని చెబుతూ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిర్మాణాలు పూర్తి కాకుండా బ్లాక్‌లను కూడా కేటాయించారు. రుణమాఫీపై జగన్ హామీతో అర్బన్ హౌసింగ్‌కు డిమాండ్ పేదల ఇళ్లను రుణంపై ఇస్తుండడాన్ని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తప్పుపడుతూ జిల్లాకు ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు శ్రీకాకుళం నగరంలో జరిగిన సభలో అర్బన్ హౌసింగ్ ఇళ్లకు సంబంధించిన రుణాన్ని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తానని ప్రకటించడంతో అర్బన్ హౌసిం గ్‌కు డిమాండ్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ ప్రకటించిన వెంటనే లబ్ధిదారుల్లో కదలిక వచ్చి దరఖాస్తు చేసుకోవడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల సామూహిక గృహ ప్రవేశాలు అంటూ హడావుడి చేసినప్పటికీ అది ఆ రోజుతోనే అయిపోయింది. వారికి ఇప్పటివరకు ఇళ్లను స్వాధీనం చేయలేకపోయారు. విద్యుత్, తాగునీరు సౌకర్యాలను ఇప్పటికీ కల్పించలేదు. వాటిని కల్పించిన తరువాత లబ్ధిదారులకు స్వాధీనం చేస్తామని అధికారులు చెబుతున్నా వాస్తవం ఇది కాదని మరికొందరు అధికారులు అంటున్నారు. ఈ ఇళ్లకు రుణాలను ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు రావడం లేదని ఈ కారణంగానే లబ్ధిదారులకు ఇళ్లను స్వాధీనం చేయడం లేదని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతన్నది అటుంచితే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఉచితంగా ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటారని లబ్ధిదారులు విశ్వసిస్తున్నారు. -
అర్బన్ హౌసింగ్‌లో రూ.5 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు అమలు చేసిన బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకంలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకుందని, ఇది రూ.5 వేల కోట్ల కుంభకోణమని ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలో మొదటిదశ అర్బన్ హౌసింగ్ పథకం కింద 136 పట్టణాల్లో 4.22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని, 2014 నుంచి 2017 వరకు గృహనిర్మాణ పథకం గురించి ఆలోచించని చంద్రబాబు ఎన్నికలకు ముందు హడావుడిగా టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టులను నిర్ధారించారని తెలిపారు. గృహ నిర్మాణాలకోసం ఒక్కో చదరపు అడుగు రేటును రూ.1,600గా నిర్ధారించి కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారని, వీటికోసం ఆరు కంపెనీలు పోటీపడ్డాయని, అవన్నీ రింగై ఆయా జిల్లాల్లో కాంట్రాక్టు పనుల్ని పంచుకున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు సహకరించడంతో వాటి పని సులభతరమైందన్నారు. నెల్లూరు జిల్లాలో నాగార్జున నిర్మాణ సంస్థ, కర్నూలు జిల్లాలో షాపూర్జీ పల్లోంజీ కంపెనీ, వైఎస్సార్ జిల్లాలో నాగార్జున సంస్థ, అనంతపురం జిల్లా కాంట్రాక్టును షాపూర్జీ పల్లోంజీ, తిరుపతి కాంట్రాక్టును సింప్లెక్స్ కంపెనీ, విశాఖ జిల్లా కాంట్రాక్టును టాటా కంపెనీ, శ్రీకాకుళం జిల్లా కాంట్రాక్టును వీఎన్‌సీ అనే కంపెనీలు దక్కించుకున్నాయని వెల్లడించారు. అదేవిధంగా రహదారి నిర్మాణ కాంట్రాక్టుల్లోనూ ఇవే ఆరు కంపెనీలు పోటీపడి తుదకు ఒక కంపెనీకి కాంట్రాక్టు దక్కేలా రింగయ్యాయన్నారు. -
పట్టణ గృహ నిర్మాణాలు టిడ్కో చేతికి..
ఏలూరు (మెట్రో) : పట్టణాల్లో పేదల కాలనీల నిర్మాణం, లే–అవుట్ల అభివృద్ధి, ఇళ్ల సముదాయాల నిర్మాణ బాధ్యత టిడ్కో చేపట్టనుంది. ఇందుకోసం కొత్తగా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టౌన్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్–టిడ్కో) ఏర్పాటైంది. ఇప్పటివరకూ ఈ బాధ్యతల్ని గృహ నిర్మాణ శాఖ చూస్తుండగా.. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. లే–అవుట్ల అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనివల్ల పేదలకు అనుకున్న స్థాయిలో గృహాలు నిర్మించే పరిస్థితి లేదు. ఇప్పటికే అన్ని పట్టణాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం, లే–అవుట్ల వివరాలను టిడ్కోకు అందజేసేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పట్టణాల్లో పేదల కోసం సేకరించిన స్థలాలకు సంబం ధించి రెవెన్యూ అధికారుల వద్ద రికార్డులు అస్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములను సైతం జిరాయితీ భూములంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న పరిస్థితులూ ఉన్నాయి. కొన్నిచోట్ల పట్టాలిచ్చి స్థలాలు అప్పగించినా లేఅవుట్లు అభివృద్ధి కాలేదు. జీ–ప్లస్ పద్ధతిలో గృహాలు మంజూరైనా.. నిర్మించేందుకు ఇబ్బందులు వల్ల ముందుకు రాలేని పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నిటినీ ఇకపై టిడ్కో పరిష్కరించనుంది. ఇదిలావుంటే.. జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలకు 23 వేల గృహ నిర్మాణాలు మంజూరు కాగా.. వీటిలో 1,910 గృహాలను గృహ నిర్మాణ శాఖ నిర్మించనుంది. మిగిలిన 21,090 గృహాలను జీ–ప్లస్ పద్ధతిలో టిడ్కో నిర్మించనుంది. మేజర్ పంచాయతీల్లోనూ.. జిల్లాలో 202 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. వీటిలోనూ ఇకపై టిడ్కో ద్వారానే గృహ నిర్మాణాలు చేపడతారు. ఆకివీడు, చింతలపూడి, శనివారపుపేట, తంగెళ్లమూడి, వట్లూరు, సత్రంపాడు, వెంకటాపురం, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, ఉండి వంటి మేజర్ పంచాయతీల్లోనూ టిడ్కోయే నిర్మాణాలు చేపడుతుంది. మున్సిపల్ శాఖ చూస్తుంది పట్టణాలు, మేజర్ పంచాయతీల పరిధిలో గృహ నిర్మాణాల బాధ్యత ఇకనుంచి టిడ్కో చేపడుతుంది. ఈ నిర్మాణాలకు సంబంధిత మున్సి పాలిటీలు, నగరపాలక సంస్థలు, మేజర్ పంచాయతీలు బాధ్యత వహిస్తాయి. నిధులు విడుదల వంటివి విషయాలను మున్సిపల్ శాఖ చూస్తుంది. – ఈ.శ్రీనివాస్, ప్రాజెక్ట్ డైరెక్టర్, గృహ నిర్మాణ శాఖ -
వడివడిగా ‘మెట్రో పొలిస్’ ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగనున్న అంతర్జాతీయ సదస్సు ‘11వ మెట్రో పొలిస్ సదస్సు’కు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో వేగం పెంచింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు సదస్సు జరుగనున్నప్పటికీ, 6వ తేదీ నుంచే కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ను షోకేస్‌గా చూపేం దుకు, నగర బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకు ఇది మంచి వేదిక కానుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నగర రహదారుల నుంచి వీధి లైట్ల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు విడిది, పర్యటించే మార్గాలను తీర్చిదిద్దుతున్నారు. వై ఫై, 4జీ సేవల్నీ అందుబాటులోకి తెస్తున్నారు. సదస్సులో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు గురువారం (నేటి) వరకు సమయం ఉండగా, బుధవారం రాత్రి వరకు 1920 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కాగా, ఈ సదస్సులో ‘స్మార్ట్ సిటీస్, అర్బన్ హౌసింగ్, అర్బన్ ఈక్విటీ, మెట్రో పోలిస్-గవర్నెన్స్, సిటీ మేనేజ్మెంట్-సర్వీసెస్, అర్బన్ ఫైనాన్స్, అర్బన్ హెల్త్’ అంశాలపై చర్చించనున్నారు. వీటిల్లో సిటీ మేనేజ్మెంట్-సర్వీసెస్‌కు సంబంధించి ఎంపిక చేసిన ఏడు అంశాలను చర్చిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ప్రతినిధులతో ప్రత్యేక సదస్సులు.. సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నందున.. ఆయా ప్రభుత్వాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈమేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, మేయర్ల మధ్య ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా అంశాల్లో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి తదితర అంశాలపై చర్చలు జరిపి ఆయా దేశాలు ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జోహన్స్‌బర్గ్, బెర్లిన్, బార్సిలోనాకు చెందిన ప్రతినిధులు వీటిపై బాగా ఆసక్తి చూపుతున్నారు. బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ)గా వ్యవహరించే వేదికల్లో మన దేశం.. ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. వీటిలో హైదరాబాద్‌ను ప్రత్యేక అంశంగా తీసుకొని కూడా చర్చిస్తారు. చార్మినార్, ఐటీ కారిడార్, ట్యాంక్ బండ్‌పై ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసా రం చేస్తారు. టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ నుంచి సైతం వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు హాజ రయ్యే ప్రతినిధులకు అందజేసేందుకు ఏరోజు కారోజు నాలుగు పేజీల పత్రికను సైతం వెలువరించనున్నారు. ప్రత్యేక విందులు.. ప్రతినిధులు, వీవీఐపీల కోసం 6వ తేదీన తారామతి బారాదరిలోను, 7న ఫలక్నుమాలోను, 8న జలవిహార్‌లో ప్రత్యేకంగా రాత్రి విందులు ఏర్పాటు చేశారు. ‘అర్బన్ హాకథాన్’ పేరుతో ప్రజలకు కొత్త సదుపాయా లు అందుబాటులోకి తెచ్చేందుకు సాఫ్ట్వేర్ రూపకల్పనకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తారు.