పట్టణ గృహ నిర్మాణాలు టిడ్కో చేతికి..
పట్టణ గృహ నిర్మాణాలు టిడ్కో చేతికి..
Published Sun, May 7 2017 1:51 AM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM
ఏలూరు (మెట్రో) : పట్టణాల్లో పేదల కాలనీల నిర్మాణం, లే–అవుట్ల అభివృద్ధి, ఇళ్ల సముదాయాల నిర్మాణ బాధ్యత టిడ్కో చేపట్టనుంది. ఇందుకోసం కొత్తగా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టౌన్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్–టిడ్కో) ఏర్పాటైంది. ఇప్పటివరకూ ఈ బాధ్యతల్ని గృహ నిర్మాణ శాఖ చూస్తుండగా.. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. లే–అవుట్ల అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనివల్ల పేదలకు అనుకున్న స్థాయిలో గృహాలు నిర్మించే పరిస్థితి లేదు. ఇప్పటికే అన్ని పట్టణాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం, లే–అవుట్ల వివరాలను టిడ్కోకు అందజేసేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.
సమస్యల పరిష్కారంపై దృష్టి
పట్టణాల్లో పేదల కోసం సేకరించిన స్థలాలకు సంబం ధించి రెవెన్యూ అధికారుల వద్ద రికార్డులు అస్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములను సైతం జిరాయితీ భూములంటూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న పరిస్థితులూ ఉన్నాయి. కొన్నిచోట్ల పట్టాలిచ్చి స్థలాలు అప్పగించినా లేఅవుట్లు అభివృద్ధి కాలేదు. జీ–ప్లస్ పద్ధతిలో గృహాలు మంజూరైనా.. నిర్మించేందుకు ఇబ్బందులు వల్ల ముందుకు రాలేని పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నిటినీ ఇకపై టిడ్కో పరిష్కరించనుంది. ఇదిలావుంటే.. జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాలకు 23 వేల గృహ నిర్మాణాలు మంజూరు కాగా.. వీటిలో 1,910 గృహాలను గృహ నిర్మాణ శాఖ నిర్మించనుంది. మిగిలిన 21,090 గృహాలను జీ–ప్లస్ పద్ధతిలో టిడ్కో నిర్మించనుంది.
మేజర్ పంచాయతీల్లోనూ..
జిల్లాలో 202 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. వీటిలోనూ ఇకపై టిడ్కో ద్వారానే గృహ నిర్మాణాలు చేపడతారు. ఆకివీడు, చింతలపూడి, శనివారపుపేట, తంగెళ్లమూడి, వట్లూరు, సత్రంపాడు, వెంకటాపురం, దెందులూరు, భీమడోలు, ఉంగుటూరు, ఉండి వంటి మేజర్ పంచాయతీల్లోనూ టిడ్కోయే నిర్మాణాలు చేపడుతుంది.
మున్సిపల్ శాఖ చూస్తుంది
పట్టణాలు, మేజర్ పంచాయతీల పరిధిలో గృహ నిర్మాణాల బాధ్యత ఇకనుంచి టిడ్కో చేపడుతుంది. ఈ నిర్మాణాలకు సంబంధిత మున్సి పాలిటీలు, నగరపాలక సంస్థలు, మేజర్ పంచాయతీలు బాధ్యత వహిస్తాయి. నిధులు విడుదల వంటివి విషయాలను మున్సిపల్ శాఖ చూస్తుంది.
– ఈ.శ్రీనివాస్, ప్రాజెక్ట్ డైరెక్టర్, గృహ నిర్మాణ శాఖ
Advertisement
Advertisement