వడివడిగా ‘మెట్రో పొలిస్’ ఏర్పాట్లు | Apace 'metro polis' arrangements | Sakshi
Sakshi News home page

వడివడిగా ‘మెట్రో పొలిస్’ ఏర్పాట్లు

Published Thu, Oct 2 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

వడివడిగా ‘మెట్రో పొలిస్’ ఏర్పాట్లు

వడివడిగా ‘మెట్రో పొలిస్’ ఏర్పాట్లు

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగనున్న అంతర్జాతీయ సదస్సు ‘11వ మెట్రో పొలిస్ సదస్సు’కు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో వేగం పెంచింది. ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు సదస్సు జరుగనున్నప్పటికీ, 6వ తేదీ నుంచే కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ను షోకేస్‌గా చూపేం దుకు, నగర బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకు ఇది మంచి వేదిక కానుందని ప్రభుత్వం భావిస్తోంది.

దీంతో నగర రహదారుల నుంచి వీధి లైట్ల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు విడిది, పర్యటించే మార్గాలను తీర్చిదిద్దుతున్నారు. వై ఫై, 4జీ సేవల్నీ అందుబాటులోకి తెస్తున్నారు. సదస్సులో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు గురువారం (నేటి) వరకు సమయం ఉండగా, బుధవారం రాత్రి వరకు 1920 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
 
కాగా, ఈ సదస్సులో ‘స్మార్ట్ సిటీస్, అర్బన్ హౌసింగ్, అర్బన్ ఈక్విటీ, మెట్రో పోలిస్-గవర్నెన్స్, సిటీ మేనేజ్‌మెంట్-సర్వీసెస్, అర్బన్ ఫైనాన్స్, అర్బన్ హెల్త్’ అంశాలపై చర్చించనున్నారు. వీటిల్లో సిటీ మేనేజ్‌మెంట్-సర్వీసెస్‌కు సంబంధించి ఎంపిక చేసిన ఏడు అంశాలను చర్చిస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు.
 
ప్రతినిధులతో ప్రత్యేక సదస్సులు..

సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నందున.. ఆయా ప్రభుత్వాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈమేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, మేయర్ల మధ్య ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా అంశాల్లో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి తదితర అంశాలపై చర్చలు జరిపి ఆయా దేశాలు ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జోహన్స్‌బర్గ్, బెర్లిన్, బార్సిలోనాకు చెందిన ప్రతినిధులు వీటిపై బాగా ఆసక్తి చూపుతున్నారు. బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ)గా వ్యవహరించే వేదికల్లో మన దేశం.. ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. వీటిలో హైదరాబాద్‌ను ప్రత్యేక అంశంగా తీసుకొని కూడా చర్చిస్తారు.
     
చార్మినార్, ఐటీ కారిడార్, ట్యాంక్ బండ్‌పై ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసా రం చేస్తారు. టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ నుంచి సైతం వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు హాజ రయ్యే ప్రతినిధులకు అందజేసేందుకు ఏరోజు కారోజు నాలుగు పేజీల పత్రికను సైతం వెలువరించనున్నారు.
 
ప్రత్యేక విందులు..
ప్రతినిధులు, వీవీఐపీల కోసం 6వ తేదీన తారామతి బారాదరిలోను, 7న ఫలక్‌నుమాలోను, 8న జలవిహార్‌లో ప్రత్యేకంగా రాత్రి విందులు ఏర్పాటు చేశారు.
     
‘అర్బన్ హాకథాన్’ పేరుతో ప్రజలకు కొత్త సదుపాయా లు అందుబాటులోకి తెచ్చేందుకు సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement