నిరుద్యోగులను ప్రభుత్వం నిలువునా ముంచేసింది. నాలుగేళ్ల నుంచి భృతి ఇస్తామంటూ మోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం దగా చేస్తూనే ఉంది. ఎన్నికల సమయాన ఇచ్చిన హామీని తుంగలో తొక్కేసింది. నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన టీడీపీ ఇప్పుడు మాట మార్చింది. కేవలం రూ.1,000 మాత్రమే ఇస్తానని ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సవాలక్ష నిబంధనలు పెట్టి నిరుద్యోగులను మోసం చేస్తోంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఉద్యోగానికి అర్హత వయసు 42 ఉంటే ఇప్పుడేమో 35 ఏళ్లలోపు వారికే భృతి ఇస్తామనడం దారుణమని జిల్లాలోని యువత ఆగ్రహం వ్య క్తం చేస్తోంది.
నెల్లూరు(సెంట్రల్),(మినీబైపాస్): ఎన్నికల సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగులకు వరాల జల్లులు కురిపించి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన విషయం తెలిసిందే. నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదు. యువతలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం, యువత ఓట్లు ఎన్నికల్లో కీలకం కావడంతో ఎన్నికల్ స్టంట్‌ను చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించింది. నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న చంద్రబాబు ఒక్కసారిగా ఎన్నికలు సమీపిస్తుండటంతో నిరుద్యోగ భృతి రూ.1,000 ఇస్తామని ప్రకటించడంతో యువతలోనే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
నాలుగేళ్లుగా ఊసెత్తని వైనం
2014 ఎన్నికల్లో యువత ఓట్లు దండుకునేందుకు చంద్రబాబు ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి రూ.2 వేలు అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. అధికారం వచ్చిన వెంటనే ఎటువంటి షరతులు లేకుండా అమలు చేస్తానని చంద్రబాబు ప్రకటనలు గుప్పించారు. నాలుగేళ్లు గడిచాయి, నిరుద్యోగ భృతిపై నోరెత్తని ప్రభుత్వం, తాజాగా నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించడం గమనార్హం. భృతి పొందాలంటే డిగ్రీ, పాలిటెక్నిక్ చదివి ఉండాలని మెలిక పెట్టడం విశేషం. అది కూడా 22 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలని షరతులు కూడా విధించింది.
అధికారికంగా 2.74 లక్షల మంది
నైపుణ్యాభివృద్ధి సంస్థ లెక్కల ప్రకారం డిగ్రీ చదివిన వారు ఈ ఏడాది 11,307 మంది, బీఈడీ చేసిన వారు 4,258 మంది, డిప్లొమా చేసిన వారు 4,859, ఐటీఐ చేసిన వారు 3,216, డీఈడీ చదివిన వారు 1,297 మంది మొత్తం ఏడాదికి 24,937 మంది ఉన్నారు. ఏడాదికి వీరు ఉంటే 35 ఏళ్ల లోపు వారంటే దాదాపుగా 11 సంత్సరాల క్రితం ఈ చదువు పూర్తి చేసి ఉండాలి. అంటే మొత్తం 2,74,307 మంది అధికారికంగా ఉన్నారు. ఇక పోతే ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోని వారు మరో రెండు లక్షల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 4,74,307 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
మిగిలిన వారి పరిస్థితి ఏమిటి?
ఇంట్లో పరిస్థితులు అనుకూలించక పోవడంతో పదోతరగతి, లేక ఇంటర్‌లోనూ చదువుకు దూరంగా ఉండి 22 నుంచి 35 ఏళ్ల లోపు వారు నిరుద్యోగులుగా ఉన్నారు. గత ఎన్నికల్లో అటువంటి యువకులు వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్లు కూడా గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతిని నమ్మి ఓట్లు వేశారు. కాని డిగ్రీ, పాలిటెక్నిక్ అంటూ మెలిక పెట్టడంతో వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓట్లు మాత్రం తమవి కావాలని, నిరుద్యోగ భృతి వచ్చే సమయానికి నిబంధనలు పెట్టటడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చదువుకోవాలంటే నాలుగుసంవత్సరాలుగా స్కాలర్‌షిప్పులు అందక పోవడంతో చదువుకు దూరం అయిన వారికి నిరుద్యోగ భృతి కోల్పోతున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
నిరుద్యోగ భృతి తగ్గింపు
నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు రూ.2 వేలు ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం రూ.వెయ్యి మాత్రమే చెల్లిస్తామని చెప్పడం గమనార్హం. నాలుగు సంవత్సరాలు మిన్నకుండిన చంద్రబాబు ప్రభుత్వం, ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఇచ్చే భృతి కూడా రూ.వెయ్యికి కుదించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్ ఇచ్చే విధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం విశేషం
.
వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న యువత
నిరుద్యోగ భృతి గురించి నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగిస్తుందో కూడా నమ్మలేకుండా ఉన్నామని పలువురు యువత అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇంత కాలం మౌనంగా ఉన్న సర్కార్ ఇంకెంత కాలం పెడుతుంతో అని అనుమానాలు కూడా యువతలో రాకపోలేదు. ఓట్లు దండుకునేందుకే ఈ విధంగా యువతకు గాలం వేస్తున్నారనే విమర్శలు రాక మానడం లేదు. జిల్లాలో అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇవ్వాల్సిన పింఛన్‌లు కూడా 70 శాతం ఇవ్వలేదు. కాని నిరుద్యోగ భృతి ఎంత మేర ఇస్తారనే అనుమానాలు యువతలో వ్యక్తం అవుతున్నాయి.
ఎన్నికలు వస్తుండటంతోనే
ఎన్నికలు వస్తుండటంతో యువత ఓట్లు కోసం ఈ విధంగా నిరుద్యోగ భృతి అంటూ ప్రకటన ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత కాలం మౌనంగా ఉండి ఇప్పుడు భృతి అంటే నమ్మేవారు లేరు. రాజకీయాల కోసం యువతకు గాలం వేస్తున్నట్లు అర్థం అవుతోంది.
–నవీన్, ఎంబీఏ
Comments
Please login to add a commentAdd a comment