చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వృద్ధరాలిని బలవంతంగా ఎత్తి లారీలోకి ఎక్కిస్తున్న పోలీసులు
సాక్షి, అమరావతి/ సాక్షి, అమరావతి బ్యూరో/గాంధీనగర్: తమ సమస్యల పరిష్కారం కోసం ర్యాలీ చేపట్టిన మధ్యాహ్న భోజన కార్మికులపైకి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. తమ కడుపు కొట్టొద్దని శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది. ఆందోళనలో పాల్గొన్న మహిళలు, వృద్ధులను పోలీసులతో విచక్షణారహితంగా ఈడ్చివేయించింది. సొమ్మసిల్లి పడిపోయిన వారిని సైతం లారీల్లోకి తోసేసి పోలీస్‌స్టేషన్లకు తరలించింది. కాలకృత్యాలు తీర్చుకోడానికి కూడా అనుమతించకుండా వేధించింది. మరోవైపు వీరికి సంఘీభావం తెలపడానికి వచ్చిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లినప్పుడు సైతం పోలీసులతో బలవంతంగా బయటకు తోసివేయించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు.
కదం తొక్కిన కార్మికులు
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు పరం చేయొద్దనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులు సోమవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్మికులు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి అలంకార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నాచౌక్‌కు వస్తున్న కార్మికులను అలంకార్ సర్కిల్‌లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పథకాన్ని ప్రైవేటు పరం చేసి తమ కడుపులు కొట్టొద్దంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇంతలో వీరిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ వారు ప్రతిఘటించడంతో తోపులాట, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మహిళలు, వృద్ధులను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారు. అయినా కూడా లెక్కచేయకుండా పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లో ఎక్కించి నగర శివారు ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ర్యాలీకి మద్దతు పలికేందుకు వచ్చిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, ఎంసీహెచ్ శ్రీనివాస్‌రావుతో పాటు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు వరలక్ష్మి, సుప్రజ, స్వరూపారాణి తదితరులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి స్వరూపారాణి మాట్లాడుతూ.. తమ ప్రాణాలు పోయినా సరే పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. 18 ఏళ్లుగా పనిచేస్తూ.. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరితే పోలీసులను ప్రయోగించి అరెస్ట్‌లు చేస్తారా? అని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. బిల్లు బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళన
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా ర్యాలీ చేయడం నేరమా? అని ప్రశ్నించారు. యూనియన్ ప్రతిని«ధులతో ప్రభుత్వం చర్చలు జరపకుండా.. పోలీసులను ప్రయోగించి అరెస్ట్‌లు చేయించడం దుర్మార్గమని మండిపడ్డారు. పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించబోమంటూ స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రోడ్డున పడనున్న వేలాది మంది కార్మికులు!
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్, స్వచ్చంద సంస్థలకు అప్పగించాలని డీఈవోలను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాథమిక విద్యా శాఖ కమిషనర్ మే 16న ఉత్తర్వులు జారీ చేశారు. 13 జిల్లాలను 71 క్లస్టర్లుగా చేసి.. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు ఒకేచోట కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేసి భోజనం సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ చర్య వల్ల 15 ఏళ్లుగా పనిచేస్తున్న 85 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఇస్కాన్, అక్షయపాత్ర, బుద్ధవరపు ట్రస్ట్, హరేరామ, నాంది, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ తదితర సంస్థలకు అప్పగించనున్నారు.
పేద మహిళల కడుపు కొడతారా?
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలకు మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్ట్ అప్పగించి పేద మహిళల కడుపుకొడుతున్నారు. అన్ని అనుమతులు తీసుకొని శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులను ఉసిగొల్పి మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా ఈడ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం.
– కె.స్వరూపరాణి, ప్రధాన కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్
ప్రభుత్వ పతనానికి నాంది..
పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని, వేతనాలు పెంచాలని కోరుతూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న మహిళలను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వ పతనానికి నాంది. కార్మికులకు సంఘీభావం తెలపడానికి వచ్చిన నన్ను, కార్మిక సంఘ నాయకులను కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ నిరంకుశ ప్రభుత్వంపై ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం.
– బొడ్డు నాగేశ్వరరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment