ఇచ్చేది అప్పు..చేసేది మోసం! | TDP Govt campaign with peoples money | Sakshi
Sakshi News home page

ఇచ్చేది అప్పు..చేసేది మోసం!

Published Sat, Nov 3 2018 4:59 AM | Last Updated on Sat, Nov 3 2018 4:59 AM

TDP Govt campaign with peoples money - Sakshi

సాక్షి, అమరావతి: సొమ్మొకరిది సోకొకరిది! సొమ్ము ప్రజలది.. సోకు చంద్రబాబుది! పొదుపు సంఘాలకు పైసా కూడా రుణమాఫీ చేయకపోయినా డ్వాక్రా మహిళల ధన్యవాదాల పేరుతో రూ.15 కోట్ల ప్రజాధనాన్ని గోడల పాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజలకు ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రికి పొదుపు సంఘాల మహిళలు ధన్యవాదాలు చెబుతున్నట్లుగా రూపొందించిన ప్రచార స్టిక్కర్లను ఊరూరా, ఇంటింటికీ తిరిగి గోడలకు అతికించాలని టీడీపీ సర్కారు ఆదేశించింది. చంద్రబాబు గత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసగించినా... ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మా చంద్రన్నకు ధన్యవాదాలు..’ అంటూ సీఎం చంద్రబాబు ఫొటోతో స్టిక్కర్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వీటిని నేడో రేపో టీడీపీ ఏజెంట్లు, సాధికార మిత్రలు ఇంటింటికీ తిరిగి గోడలకు అతికించనున్నారు. మహిళల నుంచి కృతజ్ఞతలు చెప్పించుకోవటానికి నానా ఇబ్బందులు, తంటాలు పడినా ఆశించిన ఫలితం లేకపోవటంతో స్టిక్కర్ల రూపంలో బలవంతంగా ధన్యవాదాలు చెప్పించుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని పేర్కొంటున్నారు.

డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద ఇచ్చే డబ్బులను అప్పు రూపంగా తీసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులలోని ఓ భాగం, లబ్ధిదారుల ఇంటి వద్ద శనివారం (నేడు) లోగా ప్రభుత్వం ముద్రించిన స్టిక్కర్లను అతికించాలంటూ సెర్ఫ్‌ సీఈఓ జారీ చేసిన ఉత్తర్వులు 

పసుపు కుంకుమ పేరుతో వంచన
ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ సర్కారు అసలు రంగు బయటపడుతోంది. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా పెట్టుబడి నిధి, పసుపు కుంకుమ అంటూ నట్టేట ముంచింది. వాస్తవానికి 2015లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్టుబడి నిధి కింద ఇచ్చే డబ్బులను అప్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. సర్కారు ఇప్పుడు డ్వాక్రా మహిళలతో బలవంతంగా ధన్యవాదాలు చెప్పించుకుని పోస్టర్లను అతికిం చేందుకు సాధికార మిత్రలను టీడీపీ కూలీల మాదిరిగా వినియోగించుకోనుంది. ప్రజలంతా బాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా రూపొం దించిన కోటిన్నర స్టిక్కర్ల కోసం రాష్ట్ర ఖజానా నుంచి ప్రభుత్వం రూ. 15 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. 

పసుపు కుంకుమ మొత్తాన్ని తిరిగి చెల్లించవలసిన అవసరం లేదంటూ గోడలకు అతికించడానికి ప్రభుత్వం రూపొందించిన స్టిక్కర్లు 

ఒక్క మహిళకూ మాఫీ కాలేదని మంత్రే అంగీకరించారు
డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయి నాలుగున్నర ఏళ్లవుతున్నా ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. తమ ప్రభుత్వం ఏ ఒక్క డ్వాక్రా మహిళలకూ రుణమాఫీ చేయలేదని సంబంధిత శాఖ మంత్రి పరిటాల సునీత స్వయంగా అసెంబ్లీలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వాస్తవం ఇలా ఉండగా డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారని పేర్కొంటూ, అందుకు ప్రజలంతా స్వచ్చందంగా ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రచార స్టిక్కర్లలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీకి రాజకీయంగా ఉపయోగపడతారనే వ్యూహంతో రాష్ట్రంలో ప్రతి 35 ఇళ్లకు ఒకరు చొప్పున నియమించిన సాధికార మిత్రలకు ఈ ధన్యవాదాల ప్రచార స్టిక్కర్లను ఇంటింటికీ అతికించే బాధ్యత అప్పగించారు. శుక్ర, శనివారాల్లో కోటిన్నర ప్రచార స్టిక్కర్లను అన్ని ఇళ్లకు అతికించే బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లా అధికారులకు అప్పగించారు. 

పచ్చని పల్లెల్లో స్టిక్కర్ల చిచ్చు..?
సీఎం చంద్రబాబు సొంత ప్రచారం కోసం తెరపైకి తెచ్చిన డ్వాక్రా ధన్యవాదాల స్టిక్కర్లు పచ్చని పల్లెల్లో చిచ్చు రేపనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రుణమాఫీ జరగక అప్పుల్లో కూరుకుపోయామని ఆగ్రహంతో ఉన్న డ్వాక్రా మహిళలు తిరగబడే అవకాశం ఉందని, అధికార బలంతో బలవంతంగా స్టిక్కర్లు అంటిస్తే ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని సెర్ప్‌ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

సంఘాలు సకాలంలో చెల్లిస్తున్నా తప్పని వడ్డీ భారం..
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేయకుండా మోసం చేసిన చంద్రబాబు సర్కారు కనీసం పావలా వడ్డీ, సున్నా వడ్డీ కూడా దక్కకుండా వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రతి నెలా సకాలంలో వాయిదాలను చెల్లించే మహిళా సంఘాలకు సున్నా వడ్డీ వర్తింప చేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ డబ్బులను 2016 సెప్టెంబర్‌ నుంచి బ్యాంకులకు చెల్లించడం లేదు. దీంతో సున్నా వడ్డీ బకాయిలు ఇప్పటి వరకు రూ.2275 కోట్ల మేర పేరుకుపోయాయి. మహిళా సంఘాలు సకాలంలో ప్రతి నెలా వాయిదాలను చెల్లిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల తరబడి సున్నా వడ్డీ నిధులను బ్యాంకులకు ఇవ్వకపోవడంతో వాయిదాలతోపాటు వడ్డీని కూడా వసూలు చేస్తున్నాయి. ఈ విషయం ఇటీవల ముఖ్యమంత్రి అథ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశంలోనే వెల్లడైంది. 

రూ.14,205 కోట్ల నుంచి రూ.22,174 కోట్లకు పెరిగిన రుణభారం
డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చి రుణమాఫీ చేయబోనని, కేవలం పెట్టుబడి నిధి ఇస్తానంటూ ప్రకటించారు. దీంతో ఎన్నికల నాటికి మహిళా సంఘాలు రుణాలు 14,205 కోట్ల రూపాయలుండగా ఇప్పుడు వారి పేరిట రుణ భారం 22,174 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాల సున్నా వడ్డీకి కేవలం రూ.1,000 కోట్లనే కేటాయించారు. సున్నా వడ్డీ బకాయిలే రూ.2,275 కోట్లు ఉండగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు ఏ మూలకు వస్తాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

బాబు హామీని అమలు చేయకపోవడం వల్ల సంఘాలకు ఎంత నష్టం?
చంద్రబాబు హామీని అమలు చేసి ఉంటే 2014 నాటికి డ్వాక్రా సంఘాలకు ఉన్న రూ. 14,205 కోట్ల రుణాలన్ని మాఫీ అయ్యేవి. మళ్లీ ఆ సంఘాలకు రూ.14,205 కోట్లు లేదంటే అంతకంటే ఎక్కువగా 2014లోనే వాటి పేరిట బ్యాంకులు రుణాలిచ్చేవి. మాఫీ అయ్యే డబ్బులు, దానిపై వడ్డీ, కొత్తగా వచ్చే రుణం.. ఇలా మొత్తంగా ఈ నాలుగున్నర ఏళ్లలో 80 లక్షల మంది డ్వాక్రా మహిళలు సరాసరిన ఒక్కొక్కొరు రూ.35,500 దాకా నష్టపోయి ఉంటారని అంచనా. 

పెట్టుబడి నిధి డబ్బులు బకాయిల కింద జమ
ఒకపక్క రుణమాఫీ చేయకపోగా మరోపక్క సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా మహిళా సంఘాలను బాబు సర్కారు దారుణంగా మోసగించింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి నిధి కింద ఇస్తున్న డబ్బులను బ్యాంకులు మహిళా సంఘాల రుణ బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. పెట్టుబడి నిధి కింద ఇచ్చిన డబ్బులను మహిళా సంఘాలు డ్రా చేసుకోవడానికి అనుమతించాలని కోరితే రుణ బకాయిలు ఎవరు తీరుస్తారని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. 

ఇప్పటికే బాబు బాకా కోసం రూ.100 కోట్లు....
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనా ప్రభుత్వం నుంచి లబ్ది చేకూర్చాననే ప్రచారం చేసుకునేందుకు చంద్రబాబు ఊరూరా ప్రత్యేకంగా కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌(సీఆర్పీ)ను నియమించి రూ.100 కోట్ల దుర్వినియోగానికి తెరతీశారు. టీడీపీ సర్కారుకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు వీరిని నియమించారు. వీరికి రోజుకు రూ.850 చొప్పున పారితోషికం అందించనున్నారు. వీరు చేయాల్సిందిలా ఒక్కటే...జనంలోకి వెళ్లి చంద్రబాబును కీర్తించడమే. దీనికోసం రూ.వంద కోట్ల ప్రజాధనాన్ని సర్కారు దుర్వినియోగం చేస్తోంది. 

15 నుంచి సమ్మెబాటలో సెర్ప్‌ సిబ్బంది...
సెర్ప్‌ సిబ్బందికి టీడీపీ 2014 ఎన్నికల సమయంలో పలు హామీలను ఇచ్చింది. జీతాలు పెంచాలని, పర్మినెంట్‌ చేయాలని నాలుగేళ్లుగా కోరుతున్నా పట్టించుకోకపోవడంపై సెర్ప్‌ సీసీలు, ఏపీయంలు సమ్మెబాట పట్టనున్నారు. టీడీపీ సర్కారు మోసాలకు నిరసనగా ఈ నెల 15వతేదీ నుంచి సమ్మె చేయనున్నట్లు సెర్ప్‌ సిబ్బంది ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. 

బలవంతపు ధన్యవాదాలు...
సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఓ సినిమాలో తనకు గుడ్‌మార్నింగ్‌ చెప్పించుకోవటానికి ఓ హాస్యనటుడు పడిన పాట్లు గుర్తుకొస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓ కాలేజీకి ప్రిన్సిపల్‌గా ఉన్న హాస్య నటుడు తనకు వచ్చిపోయే విద్యార్థులు గుడ్‌మార్నింగ్‌ చెప్పేవరకు అదేపనిగా వారి చుట్టూ తచ్చాడటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదంతా డబ్బు ఖర్చు లేని వ్యవహారం కాగా సీఎం చంద్రబాబు రూ.15 కోట్లు ఖర్చు చేసి మరీ ‘ధన్యవాదాల’ కార్యక్రమానికి తెరతీశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, 2004లో సీఎంగా అధికారం చేపట్టిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి  పేదల కోసం సంచలనాత్మకమైన సంక్షేమ పథకాలు అమలు చేసినా వారెప్పుడూ ఇలా వ్యవహరించలేదని పేర్కొంటున్నారు. 

డ్వాక్రా మహిళలకు చంద్రబాబు  ఎన్నికల హామీ.. 
ఆర్థికంగా చిక్కుల్లో పడిన డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రియలో భాగంగా డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. 
    –టీడీపీ 2014 ఎన్నికల మేనిఫెస్టో (16వ పేజీ)లో చంద్రబాబు హామీ

ప్రభుత్వం ఎన్నికల హామీ అమలు చేసిందా? 
డ్వాక్రా మహిళలకు పైసా కూడా రుణమాఫీ చేయలేదు 

డ్వాక్రా సంఘాలపై అప్పుల పెనుభారం 
చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి డ్వాక్రా సంఘాల పేరుతో రూ.14,205 కోట్లు బ్యాంకుల్లో అప్పులు ఉండగా ఈ ఏడాది జూన్‌ 30 నాటికి  రూ. 22,174 కోట్లకు చేరింది. 

సున్నా వడ్డీకి మంగళం
టీడీపీ సర్కారు జీరో వడ్డీ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో 2016 సెప్టెంబరు నుంచి వడ్డీ రూపంలో రూ.2,275 కోట్లను డ్వాక్రా మహిళలే చెల్లించుకోవాల్సి వచ్చింది.  

పెట్టుబడి నిధి డబ్బులు అప్పు కిందే...
2015లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్టుబడి నిధి కింద డ్వాక్రా సంఘాలకు ఇచ్చే డబ్బులను అప్పుగానే పరిగణించాల్సి ఉంటుంది.  

మాట నిలబెట్టుకున్నట్లు సర్కారు ప్రచారం..
డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయకపోయినా ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్నకు ధన్యవాదాలు..’ అంటూ రూ.15 కోట్ల ఖర్చుతో ఇంటింటికీ స్టిక్కర్లు అతికించేందుకు తాజాగా ప్రభుత్వం సిద్ధమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement