చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని మైనారిటీలు సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక తల్లడిల్లుతున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోలేక కూలిపనులకు తీసుకెళ్తున్నట్లు పలువురు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని మైనారిటీల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మైనారిటీ విద్యార్థులు 15 దేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించేందుకు ఓవర్‌సీస్ విద్యానిధి పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు రూ.10 లక్షల ఉపకార వేతనాన్ని మంజూరు చేయాల్సి ఉంది. ఆ పథకంలో 2016–17లో ఒకరు, 2017–18లో10 మంది దరఖాస్తు చేసుకోగా వారికి ఇప్పటి వరకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేదు.
దుల్హాన్ పథకంలో వెనుకబడిన ముస్లిం బాలికల వివాహం కోసం ఆర్థిక సహాయానికి గత ఏడాది 768 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇప్పటి వరకు నిధులు లేవు. ప్రస్తుతం ఆ పథకానికి చంద్రన్న పెళ్లికానుకగా పేరు మార్చారు. అవగాహన లేక చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. పైగా డీఆర్‌డీఏకు చంద్రన్నపెళ్లి కానుక బాధ్యతలు అప్పజెప్పడం ఏమిటనే విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,700 మంది విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోగా వారికి గత ఏడాది నుంచి నిధులు ఇవ్వడం లేదు. బ్యాంక్‌లింక్ సబ్సిడీ పథకంలో స్వయం ఉపాధి రుణాలకు 556 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 13 మందికి మాత్రం సబ్సిడీ ఇచ్చారు. ఇవేకాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే మైనారిటీల సమస్యలు కోకొల్లలు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు టీడీపీ ప్రభుత్వానికి మైనారిటీలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో.
ఆత్మీయ సభ పేరుతో మళ్లీ మాయ..
గత ఎన్నికలకు ముందు చేసిన మాయ చాలదంటూ.. ఇప్పుడు మళ్లీ సీఎం చంద్రబాబునాయుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో ముస్లింల ఓట్లు కొల్లగొట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం గుంటూరులో లక్ష మంది ముస్లిం లతో ఆత్మీయ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సభకు జిల్లాలోని ముస్లింలను పంపాలని అధికారులపై, పలువురు ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చంద్రబాబు పాలనపై విసిగి వేసారిన ముస్లింలు ఆ సభకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
చేసిందేమీ లేదు..
మైనారిటీల అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీలేదు. అతను ప్రకటించిన బడ్జెట్ కాగితాలకే పరిమితం. నాలుగేళ్లుగా మా సమస్యలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని మళ్లీ కపటప్రేమ ఒలకబోస్తున్నారు. దుల్హన్ పథకం దరఖాస్తులు మైనారిటీ అధికారుల వద్ద కుప్పలుతెప్పలుగా మూలుగుతున్నాయి. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
– అప్జల్‌ఖాన్,వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment