సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా రేషన్ కార్డులను ఇష్టారాజ్యంగా తొలగించిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తుండడంతో కొత్త రేషన్ కార్డుల మంజూరు పేరిట ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అడిగిన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తెలుగుదేశం ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో ఏకంగా 24 లక్షల రేషన్ కార్డులను తొలగించింది. అర్హత ఉన్నా కార్డులను రద్దు చేయడంతో లబ్ధిదారులు గగ్గోలు పెట్టారు. అయినా ప్రభుత్వం లెక్కచేయలేదు. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1.44 కోట్ల తెల్లరేషన్ కార్డులు ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక భారం పేరిట రేషన్ కార్డులను తొలగించారు. ఆధార్ కార్డు అనుసంధానం చేయలేదని, ఈ–పాస్ యంత్రాల్లో వేలిముద్రలు సరిగా పడలేదంటూ సాకులు చూపి కార్డులను తొలగించారు. పేదలకు సబ్సిడీ సరుకులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు.
రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థలో 2015 ఏప్రిల్ నుండి ఈ–పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో రేషన్ కార్డులో పేర్లు నమోదైన వారిలో ఒకరు తప్పనిసరిగా రేషన్ దుకాణానికి వెళ్లి వేలిముద్రలు వేస్తేనే సబ్సిడీ బియ్యంతోపాటు ఇతర సరుకులు ఇచ్చే విధానం అమలవుతోంది. స్థానికంగా పనులు దొరక్క ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కుటుంబాలు, వేలిముద్రలు సరిగ్గా పడని లబ్ధిదారులు సరుకులు తీసుకోనందున దాదాపు రూ.1,500 కోట్ల విలువైన సరుకులు ఆదా అయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
కార్డులు ఉండేది ఎన్నికల దాకేనా?
రేషన్ కార్డులు రద్దయిన లబ్ధిదారుల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతుండడంతోపాటు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకోకపోయినా ప్రభుత్వం గతంలో నిర్వహించిన ప్రజాసాధికార (పల్స్) సర్వేలో నమోదైన వివరాల ప్రకారం కొత్తగా రేషన్ కార్డులను జారీ చేసే బాధ్యతను రియల్ టైం గవర్నెన్స్(ఆర్టీజీఎస్)కు అప్పగించింది. అడిగిన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమే రేషన్ కార్డుల పేరిట టీడీపీ ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందని, కొత్తగా ఇచ్చే కార్డులు కేవలం ఎన్నికల వరకే ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
రేషన్ కార్డు కావాలని అడిగినా, అడగకపోయినా కొన్ని జిల్లాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు, న్యాయవాదులు, గెజిటెడ్ అధికారుల పేరిట కూడా రేషన్ కార్డులు ఇచ్చేశారు. దీన్నిబట్టి చూస్తే ఇవన్నీ ఎన్నికల కార్డులేనని స్పష్టమవుతోంది. ప్రభుత్వం దశలవారీగా మంజూరు చేసిన వాటితో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 కోట్ల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం కంటే ప్రస్తుతం 1,36,608 కార్డులు తక్కువగా ఉండడం గమనార్హం. అయినా లక్షలాది రేషన్ కార్డులు మంజూరు చేశామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది.
‘ఎన్నికల’ రేషన్ కార్డులు!
Published Mon, Jan 21 2019 4:05 AM | Last Updated on Mon, Jan 21 2019 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment