సాక్షి, అమరావతి: ఉద్యోగ క్రమబద్ధీకరణపై కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చెయ్యలేమని, ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంది. సుమారు 40 వేల మంది ఆశలకు మంగళం పాడింది. గురువారం కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఎన్‌ఎండీ ఫరూక్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పలు సమస్యల కారణంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవకాశం లేదని ఉపసంఘం తేల్చిచెప్పింది. 2014 నుంచి పలు దఫాలుగా, వివిధ రకాల హామీలిస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు వారికి రిక్తహస్తం చూపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికల వేళ హామీ ఇవ్వడమే కాకుండా, మేనిఫెస్టోలో పెట్టిన ప్రభుత్వం ఈ విధంగా కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేస్తుందని ఊహించలేదని ఉద్యోగులు వాపోతున్నారు.
కొద్దిమందికే లబ్ధి
విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, జూనియర్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు మాత్రమే వర్తించేలా మంత్రివర్గం కొన్ని నిర్ణయాలు తీసుంది. మహిళలకు 180 రోజుల ప్రసూతి సెలవులు, 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపునకు, ఇప్పటివరకూ 10 నెలల వేతనం మాత్రమే ఇస్తుండగా, ఇకపై 12 నెలలకు ఇవ్వడానికి అంగీకరించారు. ఇకపై డీఏ లేకుండా సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) వర్తింప చేస్తామన్నారు. దీనివల్ల 3,800 మందికి లబ్ధి జరుగుతుంది. ఈ నిర్ణయాల వల్ల ఉన్నత విద్యాశాఖపై రూ. 38 కోట్ల భారం పడుతుందని ఉపసంఘం సభ్యులు చెప్పారు. వివిధ శాఖలలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఒకే విధానం అనుసరించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించామని యనమల పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా ఇదే మాట చెబుతూ వచ్చి, ఇప్పుడు కూడా కొద్ది మందికే లబ్ధి కలిగేలా నిర్ణయం తీసుకోవడం దారుణమని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. తమను మోసం చేసిన ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెపుతామని పేర్కొన్నారు.
ఆరు సంస్థలకు భూ కేటాయింపులు
రాజధాని అమరావతి పరిధిలో మరో ఆరు సంస్థలకు భూములు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రులు నారాయణ, గంటా, నక్కా ఆనందబాబుతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకుంది. సవిత విశ్వవిద్యాయానికి 40 ఎకరాలు చొప్పున రెండు విడతలగా మొత్తం 80 ఎకరాలు, అంతర్జాతీయ క్రికెట్ అకాడెమీకి 10.2 ఎకరాలు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు రెండు ఎకరాలు, ఏపీపీఎస్సీకి 1.5 ఎకరాలు, ఏపీ క్రాఫ్ట్ కౌన్సిల్‌కు ఒక ఎకరం, యంగ్‌మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్‌కు 2.65 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు.
ఆందోళనలకు కాంట్రాక్ట్ ఉద్యోగులు సిద్ధం
కాంట్రాక్టు ఉద్యోగులను సర్కారు దగా చేసిందని పబ్లిక్‌హెల్త్, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు జి.ఆస్కారరావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. దీనిపై కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులందరూ అండగా నిలవాలని కోరారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక జీవోలు జారీచేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన విషయం ఈ సర్కారుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో జీవో నెం.119 ఇచ్చి వందలాది మంది కాంట్రాక్టు డాక్టర్లను, స్టాఫ్ నర్సులను గరిష్టంగా 45 మార్కులు వెయిటేజీ ఇచ్చి రెగ్యులరైజ్ చేశారన్నారు. జీవో నెం.1246 ద్వారా 2469 మంది ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేశారని గుర్తు చేశారు. జీవో నెం.625 ద్వారా ఆరోగ్యశాఖలో ఉన్న 711 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని అన్నారు. ప్రస్తుత సర్కార్ నిర్ణయంపై ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఉద్యోగులందరూ దీనికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మంత్రుల నిర్ణయం శోకం మిగిల్చిందని వైద్యవిధానపరిషత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ విమర్శించారు. చట్టాన్ని సవరించైనా క్రమబద్ధీకరణ చేసే అవకాశమున్నప్పుడు ఆ పని ఎందుకు చెయ్యట్లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment