ఇక సర్కారీ భూకబ్జా! | TDP Govt Without Assembly Ordinance on Land Acquisition Act | Sakshi
Sakshi News home page

ఇక సర్కారీ భూకబ్జా!

Published Fri, Feb 24 2017 1:23 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

ఇక సర్కారీ భూకబ్జా! - Sakshi

ఇక సర్కారీ భూకబ్జా!

కేంద్ర భూ సేకరణ చట్టం–2013కు రాష్ట్ర సర్కారు తూట్లు
అసెంబ్లీలో పెట్టకుండానే ఆర్డినెన్స్‌ వైపు అడుగులు
అసెంబ్లీలో చర్చకు పెడితే
    ప్రతిపక్షం నిలదీస్తుందని దొడ్డిదారి యత్నాలు
సామాజిక ప్రభావ అంచనాకు స్వస్తి
70 శాతం రైతుల ఆమోదం నిబంధన తొలగింపు
రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపిన వైనం
ప్రభుత్వ తీరుపై అధికార వర్గాలు, మేధావుల్లో ఆందోళన

సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాల ముసుగులో రాజధాని ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల రైతుల భూములను లాక్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర ఆర్డినెన్స్‌ తీసుకు రావడానికి రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ఏకంగా కేంద్ర భూసేకరణ చట్టం – 2013కు సవరణలు చేయాలని నిర్ణయించింది. భూ సేకరణకు చట్టం ఉండగా, అర్డినెన్స్‌ తీసుకు రావడం అనేది విరుద్ధమని తెలిసినా.. ఈ చట్ట స్ఫూర్తిని దెబ్బ తీస్తూ.. ప్రాజెక్టులు, రహదారుల సాకుతో చట్ట సవరణకు పూనుకుంది. అసెంబ్లీ ఆమోదంతో చట్ట సవరణ చేస్తే ఇందులో లోగుట్టు రట్టు అవుతుందని, ప్రభుత్వ పెద్దల నిర్వాకాన్ని ప్రతిపక్షం నిగ్గదీస్తుందనే భయంతో తెరచాటున చట్ట సవరణకు ఆగమేఘాలపై అడుగులు వేస్తోంది.

నేరుగా గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని న్యాయ శాఖ సలహా కోరింది. ఇది కేంద్ర చట్టం అయినందున సవరణ ఆర్డినెన్స్‌ జారీ చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని తెలియడంతో రాష్ట్రపతికి పంపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఢిల్లీలో ఈ పని త్వరగా అయ్యేలా మంత్రాంగం నెరుపుతోంది. భూ యజమానులైన రైతులకు రక్షణ కవచంలా, సామాజిక.. పర్యావరణ సమతుల్యానికి అండగా ఉన్న ఈ చట్టానికి తూట్లు పొడిచి అయిన వారికి భూపందేరం చేయడానికి ఎదురే లేకుండా చేసుకుంటుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

న్యాయబద్ధమైన నష్టపరిహారంతోపాటు పునరావాస, పునర్నిర్మాణ రక్షణ హక్కులను చట్టం పరిధిలోంచి తొలగించడం విపరీత పరిణామాలకు దారితీస్తుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టంలోని అతి ముఖ్యమైన సామాజిక ప్రభావ మదింపు అంశాన్ని తొలగిస్తూ.. ప్రభుత్వ పెద్దల అనుకూల అంశాలను చేరుస్తూ  కేంద్ర భూసేకరణ చట్టం –2013కు సవరణలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయం వెలువడగానే చకచకా ఫైలు సిద్ధం అయి ఢిల్లీ వెళ్లింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖల ద్వారా త్వరగా ఆమోదముద్ర వేయించి రాష్ట్రపతి కార్యాలయానికి చేరవేసే బాధ్యతను రాష్ట్రానికి చెందిన ఒక కేంద్ర మంత్రికి ప్రభుత్వ అధినేత అప్పగించారు. దీనిని బట్టి ఈ ఆర్డినెన్స్‌ను అతి త్వరగా జారీ చేయాలని ప్రభుత్వ పెద్దలు తహతహలాడుతున్నట్లు తేటతెల్లమవుతోంది.

ఎందుకంత తొందరంటే..
వచ్చేనెల ఆరో తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆరంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కాలంలో ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి వీలుకాదు. అసలు ఆర్డినెన్సు అంటే.. అసెంబ్లీ సమావేశాలు లేనందున అత్యవసర అంశాలపై గవర్నర్‌ ఆమోదంతో జారీ చేసే ఉత్తర్వు. అసెంబ్లీ సమావేళాలు ఉన్న సమయంలో బిల్లు ప్రవేశపెట్టి సభ ఆమోదంతో చట్టం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర భూసేకరణ సవరణ చట్టం – 2013 సభలో ప్రతిపాదిస్తే రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టే ఈ బిల్లును ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దేశంలోనే రైతులకు అత్యంత ఉపయుక్తమైన, న్యాయబద్ధమైన పరిహారం ఇచ్చే చట్టాన్ని సవరించాలనే ప్రతిపాదనలోని లోగుట్టును ఎత్తిచూపుతుంది. దీనివల్ల ప్రజలకు, రైతులకు సర్కారు కుట్ర తెలిసిపోతుంది.

ఇది ఇష్టం లేకే దొడ్డిదారిన ఆర్డినెన్స్‌ తేవాలని ప్రభుత్వం పెద్దలు  ప్రయత్నాలు సాగిస్తోంది. త్వరగా ఆర్డినెన్స్‌ తెచ్చి రైతుల మెడపై కత్తి పెట్టి రాష్ట్రంలో ఏడు లక్షల ఎకరాలను లాక్కోవాలన్నదే సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే పారిశ్రామిక అవసరాలు సాకుగా రాష్ట్రంలో పది లక్షల ఎకరాలతొ ల్యాండ్‌ బ్యాంక్‌ (భూ నిధి) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడు లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూములను సేకరించింది. మిగిలిన ఏడు లక్షల ఎకరాలు రైతుల నుంచి లాక్కుని తమకు కావాల్సిన పారిశ్రామిక వేత్తలకు అప్పనంగా, కారు చౌకగా  కట్టబెట్టాలన్నదే ప్రభుత్వ పెద్దల ఆలోచన. తిరుపతిలో ఒక ప్రాజెక్టు, అమరావతిలో ‘సాగరమాల’ అనే మరో ప్రాజెక్టుకు అత్యంత విలువైన భూములను రోడ్డు నిర్మాణాలు సాకుగా అవసరాలకు మించి కొట్టేయాలని నేతలు నిర్ణయించుకోవడం దీని వెనుక అసలు రహస్యమని అధికారులు అంటున్నారు.

ఆర్డినెన్స్‌ సరికాదు
ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం. దీనిని సవరించాలంటనే రాష్ట్ర చట్టసభలు మొదట ఆమోదించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ/ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాలి. రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఈ చట్టం అమలు చేయడానికి వీలవుతుంది. ఇంతటి కీలకమైన చట్ట సవరణ కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా హడావుడిగా ఆర్డినెన్సు తేవాలని సర్కారు ప్రయత్నించడం దారుణమని పలువురు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘అసలు ఆర్డినెన్స్‌ అనే పదం ఉచ్ఛరించాలంటేనే ఇబ్బందిగా ఉంది.. దీనిని రాష్ట్రపతి ఆమోదిస్తారనే నమ్మకం నాకైతే లేదు. కచ్చితంగా రాష్ట్రపతి దీనిని తిప్పి పంపుతారు’ అని రెవెన్యూ వ్యవహారాలపై సంపూర్ణ అవగాహన ఉన్న రిటైర్డు ఐఏఎస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

రైతుల భూములతో వ్యాపారమే లక్ష్యం
కేంద్ర భూసేకరణ చట్టం – 2013కు సవరణ వెనుక ప్రభుత్వ పెద్దల స్వార్థం ఉందని అధికార వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. పారిశ్రామిక కారిడార్లు ఉన్న ప్రాంతాల్లో రహదారులు, రైల్వే మార్గాల ఇరువైపులా కిలోమీటరు పరిధిలో భూములను సేకరించాలనే ప్రతిపాదన ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు అనంతపురం – అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి భారీగా భూములు సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రోడ్డు నిర్మాణానికి సరిపడా కాకుండా అధికంగా సేకరించి రోడ్డు అందుబాటులోకి వచ్చి విలువ పెరిగిన తర్వాత దానిని కొట్టేయాలని నేతలు భావిస్తున్నారు.

 పోర్టులను, పారిశ్రామిక కారిడార్‌ను కలుపుతూ నిర్మించ ప్రతిపాదించిన ‘సాగరమాల’ ప్రాజెక్టుకు కూడా అవసరాలకు మించి రెట్టింపు భూసేకరణ చేయాలని ప్రయాళికలు రూపొందిస్తున్నారు. ఆర్డినెన్స్‌ తెచ్చిన తర్వాత సామాజిక ప్రభావ మదింపు ఉండదు. సంప్రదింపుల పేరుతో రైతులను బెదిరించి ఒప్పించడం ద్వారా ఎంతో కొంత చెల్లించి భూములు లాక్కోవాలని సర్కారు పెద్దలు యోచిస్తున్నారు. రైతులతో సంప్రదింపుల ద్వారా మార్కెట్‌ ధర చెల్లించి ఆయా జిల్లా కలెక్టర్లు భూములను తీసుకోవచ్చుననే నిబంధనను తాజా సవరణలో పేర్కొన్నారు.

రైతుల రక్షణ కవచానికే ఎసరు
భూ యజమానులకు కేంద్ర భూసేకరణ చట్టం – 2013లో రక్షణ కవచాల్లా ఉన్న నిబంధనలను తొలగించడమే రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్సు  ప్రధానోద్దేశం. ఏదైనా ప్రాంతంలో ప్రైవేట్‌ సంస్థల కోసం భూమి సేకరించాలంటే భూ యజమానుల్లో కనీసం 80 శాతం మంది, ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) ప్రాజెక్టులకైతే 70 శాతం మంది భూ యజమానుల ఆమోదం తప్పనిసరి అని కేంద్ర చట్టంలో ఉంది. భూసేకరణ వల్ల పర్యావరణ పరంగా, ఉపాధి పరంగా భూ యజమానులు, కూలీలపై పడే ప్రభావాన్ని మొదట అంచనా వేయాల్సి ఉంటుంది. తదుపరి ముందస్తు నోటిఫికేషన్‌ జారీ చేసి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, పైన పేర్కొన్న మేరకు కనీస యజమానుల అనుమతి ఉంటేనే భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని, లేనిపక్షంలో విరమించుకోవాలని కేంద్ర చట్టం చెబుతోంది.

 దీని ప్రకారం అయితే రాజధాని ప్రాంతాల్లో భూసమీకరణ కింద భూములు ఇవ్వని పెనుమాక, ఉండవల్లితోపాటు మరికొన్ని గ్రామాల్లో రైతుల నుంచి 5700 ఎకరాలను తీసుకోవడం సర్కారుకు సాధ్యం కాదు. ఎందుకంటే ఈ గ్రామాల్లో అత్యధిక శాతం రైతులు భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో భూసేకరణ సర్కారు పెద్దల కలగా మారింది. రహదారులు, ఇతర ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ/ సమీకరణకు కూడా ఈ నిబంధన పెద్ద అడ్డుగా మారింది. అందువల్ల ఈ నిబంధనను ఎలాగైనా తొలగించి వెంటనే బలవంతంగా భూములు లాక్కోవాలనే లక్ష్యంతో ఆర్డినెన్స్‌ కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రక్షణ సంస్థలకు సంబంధించిన భూసేకరణకు మాత్రమే సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయింపు ఉంది.

అయితే ప్రజా అవసరాల పేరుతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రహదారులు, భవనాలు, కాలువలు, విద్యా సంస్థలు, గృహాల నిర్మాణాలకు సేకరించే భూములకు సామాజిక ప్రభావ అంచనాను మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందాలని రాష్ట్ర సర్కారు కేంద్రానికి ప్రతిపాదన పంపింది. రాష్ట్రపతి అనుమతించిన వెంటనే గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. కాగా, ప్రస్తుతానికి ఇలాంటి వాటికి మినహాయింపులు కోరినా భవిష్యత్తులో అన్నింటికీ ఇదే తరహాలో చేసే ప్రమాదం ఉందని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement