
కేంద్రానికి భూ సేకరణ చట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూ సేకరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పొందే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గవర్నర్ ఆమోదం అనంతరం చట్టాన్ని కేంద్ర హోం శాఖకు పంపినట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కేంద్ర హోం, న్యాయ శాఖల పరిశీలన తర్వాత రాష్ట్రపతి అమోదానికి వెళ్తుందని గురువారం అసెంబ్లీలో పేర్కొ న్నారు. గుజరాత్ తన అవసరాల మేరకు చట్టం తెచ్చుకుందని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ అవసరాల మేరకు మార్పుచేర్పులతో చట్టం తెచ్చామన్నారు. ‘గుజరాత్‌ను పోలిన చట్టమే కనుక తెలంగాణ భూ సేకరణ చట్టానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవని భావిస్తున్నాం.
కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలోనూ ఇక్కడి తరహా ప్రయోగం చేయబోతున్నారు’’ అన్నారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ నేతలు మా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. ‘ప్రాజెక్టులు, భూ సేకరణలపై కోర్టుల్లో మొత్తం 32 కేసులు పడితే వాటిలో కాంగ్రెసే 12 కేసులు వేసింది. మిగ తా 20 కేసులను వెనకుండి వేయించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై కేసులు వేయించేందుకు కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ సంతకాలు చేయించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలే కేసులు వేశారు. వారెవరిదీ సెంటు భూమి కూడా ముంపులో పోవట్లేదు’ అన్నారు. ఈ కొత్త చట్టం ప్రజోపయోగకరమైన ప్రాజెక్టులన్నింటికీ వర్తింస్తుందన్నారు.
పొంగులేటి వర్సెస్ హరీశ్
హరీశ్ మీడియాతో మాట్లాడుతుండగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అటుగా రావడంతో భూ సేకరణపై వారి మధ్య సంభాషణ జరిగింది. కాంగ్రెస్ నేతలకు చెందిన సెంటు భూమి కూడా ఎక్కడా ముంపులో పోకున్నా కేసులెందుకు వేస్తున్నారని హరీశ్ ప్రశ్నించారు. ‘విపక్షాల పనే అది కదా? లేదంటే అధికార పక్షం వేటిని ప్రశ్నించాలని చెబితే వాటినే ప్రశ్నించాలా?’ అంటూ ఆయన బదులిచ్చారు.