‘మల్లన్న’ సమస్య పరిష్కరిద్దాం!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న మలన్న సాగర్(తడ్కపల్లి) రిజర్వాయర్ పరిధిలో నెలకొన్న భూసేకరణ, పరిహారం సమస్యను కొలిక్కి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి నిర్వాసితులు కోరినట్లుగా పరిహారం చెల్లించాలని భావిస్తోంది. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే పరిహారం చెల్లించాలని ఉన్నతస్థాయిలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వపరంగా బుధవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాళేశ్వరం నుంచి నిర్ణీత 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం గత ఏడాది జనవరిలో నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తడ్కపల్లి రిజర్వాయర్‌ను 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, పాములపర్తి రిజర్వాయర్‌ను 1 నుంచి 7 టీఎంసీలకు పెంచేందుకు సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా రిజర్వాయర్ల పరిధిలో ముంపు, వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం, అవసరమైన భూసేకరణ తదితరాలపై ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఎక్కువ భారం మల్లన్న సాగర్‌పైనే
కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ రిజర్వాయర్ కిందే మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. దీంతో పాటు ఇక్కడ్నుంచి ఒకవైపున నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌కు లింకేజీ ఉంది. మరోవైపు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఏడు రిజర్వాయర్‌లకు మల్లన్నసాగర్ నుంచే నీటిని తరలించేలా ప్రణాళికలు రచించారు. సింగూరు ప్రాజెక్టుకు నీరు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు కూడా మల్లన్నసాగర్ నుంచి నీటిని సరఫరా చే యాలని నిర్ణయించారు. మొత్తంగా ఎక్కువ లింకేజీలు ఇక్కడే ఉన్నాయి. దీంతో ఇక్కడ సామర్థ్యం తగ్గించడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
గతంలో ఈ రిజర్వాయర్ వ్యయం రూ.1,954 కోట్లు ఉండగా ప్రస్తుతం అది రూ.12,903 కోట్లకు చేరింది. దీనికి ఇటీవలే కేబినెట్ ఓకే చెప్పింది. రిజర్వాయర్ సామర్థ్యం పెరగడంతో ఇక్కడ 23 వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది. సుమారు 11 గ్రామాల ప్రజలు నిర్వాసితులవుతున్నారు. ఎక్కువగా భూములు కోల్పోవాల్సి రావడంతో నిర్వాసితులు గత 20 రోజులుగా ఆందోళన తీవ్రతరం చేశారు. కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజా సంఘాలు సైతం నిర్వాసితుల పరిహారంపై ఆందోళనలు చేపట్టాయి. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 123 ప్రకారం.. ఎకరాకు రూ.6.50 లక్షల వరకు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ పరిహారం తమకు ఏమాత్రం సరిపోదని నిర్వాసితులు అంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ముంపు గ్రామాలకు చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
ఎకరా భూమి రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పెరిగాయి. కొన్ని గ్రామాల్లో ఏకంగా గుంట భూమిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు తక్కువకు అమ్మరాదని గ్రామ కమిటీలు తీర్మానం చేశాయి. ఇది నిర్వాసితులకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో వారు పొరుగు ప్రాంతాలకు వెళ్లి ఏమాత్రం బతికి బట్టకట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం అయితే మార్కెట్ ధరలకు నాలుగింతల పరిహారం, భూములపై ఆధారపడ్డ కూలీలకు రూ.5 లక్షల వరకు పరిహారం లేక 20 ఏళ్ల పాటు రూ.2 వేల జీవన భృతి, రవాణా చార్జీలకు రూ.50 వేల వరకు అదనపు పరిహారం వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రక్రియ అంతా కొలిక్కి వచ్చేందుకు 6 నుంచి 8 నెలల గడువు పడుతుండటం, కోర్టుల్లో కేసులు నమోదైతే పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం జీవో 123 ప్రకారం చెల్లింపులు చేస్తామని చెబుతోంది. అయితే నిర్వాసితులంతా 2013నాటి చట్టం ప్రకారం పరిహారం కోరుతుండటంతో దాని వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
2013 చట్టం ప్రకారం పరిహారం: మంత్రి హరీశ్‌రావు
మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం విషయంలో రైతుకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరితేనే జీవో 123ని వర్తింపజేస్తున్నాం. గతంలో కన్నా ఈ పరిహారం చాలా మెరుగ్గా ఉంది. అయితే జీవో-123 ఫైనల్ అని ఎక్కడా లేదు. నిర్వాసితులు కోరితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనిపై ప్రభుత్వపరంగా అధికారిక ప్రకటన చేస్తాం.