
రచ్చ కోసమే వచ్చారు: హరీశ్
⇔ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై మంత్రి ధ్వజం
⇔ వారికి రైతు లబ్ధికంటే రాజకీయ లబ్ధి కావాలని విమర్శ
⇔ భూ సేకరణ చట్ట సవరణ బిల్లు పాస్ కావొద్దన్నదే వారి అభిమతం
⇔ కోర్టుల్లో ఇప్పటికే 38 కేసులు వేశారని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ‘‘చర్చలో పాల్గొనాలి, భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై మాట్లాడాలని కాంగ్రెస్‌కు ఏ కోశానా ఇష్టం లేదు. కాంగ్రెస్ సభ్యులు మాట్లాడాలని స్పీకర్ మూడుసార్లు అవకాశమిచ్చినా మాట్లాడలేదు. సభలోకి వచ్చుడు వచ్చుడే పోడియంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. మేం వచ్చింది చర్చ చేయడం కోసం కాదు, రచ్చ చేయడం కోస మని కాంగ్రెస్ నిరూపించుకుంది...’’ అని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి టి.హరీశ్ రావు ధ్వజమెత్తారు. భూసేకరణ చట్టం అమల్లోకి వస్తే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవుతాయని, అదివారికి ఇబ్బందని కాం గ్రెస్ భావిస్తోందన్నారు.
ఆదివారం మంత్రి జోగురామన్న, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నారదాసులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, ఆ పార్టీ అనుబంధ సంఘాలు ప్రాజెక్టులపై ఇప్పటికే 38 కేసులు వేశాయని, హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి పనులు అడ్డుకుంటున్నాయని హరీశ్ మండిపడ్డారు. రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే బిల్లు పాస్ కాకుండా అడ్డుకోరన్నారు. చట్టం అమలయితే కాంగ్రెస్ వేసిన కేసులను కొట్టేస్తారని, వాటికి విలువ ఉండదని, వారి ఆటలు సాగవని ఆ పార్టీ రైతు వ్యతిరేకిగా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు.
బిల్లుకు ఎందుకు అడ్డుపడుతున్నారు
2013 భూ సేకరణ చట్టంకంటే ఎక్కువ పరిహారమిస్తామని బిల్లులో చెప్పామని.. వేగవంతమైన భూ సేకరణ ప్రక్రియ కోసమే చట్టం తెస్తున్నామని హరీశ్ చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే ఈ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని లేకుంటే 2013 చట్ట ప్రకారమే పరిహారమిస్తామని ప్రకటించినా కాంగ్రెస్ నేతలుబిల్లుకు ఎందుకు అడ్డుపడుతున్నారని హరీశ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను ఒక్కటీ పూర్తిచేయలేదని, ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదన్నారు. కానీ రెండున్నరేళ్ల తమ పాలనలో కొత్తగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న తపన తమదని, వ్యక్తుల కోసం కాంగ్రెస్ భూ సేకరణ చేస్తే తమ ప్రభుత్వం రైతులు, ప్రాజెక్టులు, సమాజం కోసం భూ సేకరణ చేస్తోందని హరీశ్ వివరించారు. టీడీపీ హయాంలో 11,604 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 23,406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
వ్యవసాయానికి 40 శాతం బడ్జెట్
రైతును రాజును చేసేందుకు సీఎం చర్యలు చేపడుతున్నారని, వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో 40 శాతం నిధులు కేటాయించిన రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్ర మేనని హరీశ్ వివరించారు. రుణమాఫీ, మిషన్ కాకతీయ, గోదాముల నిర్మాణం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, కొరత లేకుండా విత్తనాలు, ఎరువుల పంపిణీ, వచ్చే ఏడాది నుంచి ఆర్థిక సాయం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏటా రూ. 25 వేల బడ్జెట్ వంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నామన్నారు.
ఎక్కువ ధరలే చెల్లిస్తున్నం
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని హరీశ్ విమర్శించారు. ఉల్లి ధర పడిపోతే తాము 2.30 లక్షల క్వింటాళ్లను రైతుల పొలాల దగ్గరే కొన్నామన్నారు. కందుల సేకరణలో దేశంలో రెండో స్థానంలో ఉన్నామని, 21 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేశామని, మొక్క జొన్న, వేరుశనగ, పత్తి, వరి పంటలకు ఎంఎస్‌పీ కంటే ఎక్కువే చెల్లించి కొనుగోలు చేశామన్నారు. తాలు రకం మిర్చికి రూ. 1,900 నుంచి రూ. 2,300 చెల్లించారని, గుంటూరులో దాని ధర రూ. 1,700 నుంచి రూ. 1,900 మాత్రమేనన్నారు. ఏపీ, కర్ణాటకలో పండిన మిర్చి కూడా వరంగల్, ఖమ్మం మార్కెట్లకు వస్తోందని, రైతును ఆదుకునేందుకు ప్రయత్ని స్తున్నామని, ఈ ఒక్క అంశాన్ని పట్టుకుని రాజకీయం చేస్తే కాంగ్రెస్‌ను నమ్మరన్నారు.
రాజకీయం చేస్తామంటే ఎట్లా?
‘‘భూ సేకరణ బిల్లుకు సవరణలు చేయాలనుకున్నాం. ఈ సమావేశం పెట్టిందే దాని కోసం కదా. అది మాట్లాడకుండా ఇతర విషయాలు మాట్లాడతాం.. రాజకీయం చేస్తాం అంటే ఎట్లా ..’’ అని కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశం ముగిశాక లాబీల్లో ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఒక వ్యూహం ఉంటే తమకూ ఓ వ్యూహం ఉంటుందన్నారు. కేంద్రం సూచించిన సవరణలు చేయడానికే సభ అయినప్పుడు ప్రత్యేకంగా సవరణలపై మాట్లాడేది ఏముంటుందని ప్రశ్నించారు. అయినా కాంగ్రెస్ సభ్యులకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినా బయటకు వెళ్లి పోవాలనుకుంటే ఏం చేస్తామన్నారు. కేవలం పది నిమిషాల్లోనే సమావేశం ముగియడంపై స్పందిస్తూ అతిఎక్కువ సమయం సభ నడిపిన ఘనత, అతితక్కువ సమయం నడిపిన రికార్డూ తమదేనన్నారు.