సాక్షి, అమరావతి: రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) పేరుతో ప్రైవేట్ సంస్థ కార్వీకి ఖజానా నుంచి ప్రభుత్వం అడ్డగోలుగా నిధులు దోచిపెడుతోంది. పేరుకు మాత్రమే ఆర్టీజీఎస్.. కానీ, అది చేసేది కాల్‌సెంటర్ పని. ‘1100’ కాల్ సెంటర్ నిత్యం 24 గంటలూ పని చేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 24 గంటలు పనిచేయడానికి ఇదేమైనా పోలీసు స్టేషనా? లేక ఆసుపత్రా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 24 గంటలు పని అంటే రాత్రి 12 తరువాత కూడా ప్రజలు ఫోన్ చేసి, తమ సమస్యలు చెప్పుకుంటునాజ్నరా? కాల్ సెంటర్ సిబ్బంది అర్ధరాత్రి తరువాత కూడా ఫోన్ చేస్తే స్పందిస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
అవన్నీ బోగస్ లెక్కలు
జనం అర్ధరాత్రి తర్వాత కూడా ఫోన్‌లు చేస్తున్నారా? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారంటూ ఇటీవలి వరకు సీఎస్‌గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. రోజుకు 20 లక్షల మందికి ఫోన్ చేస్తున్నారని ఆర్టీజీఎస్ అధికారులు చెప్పడంపైనా ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆర్టీజీఎస్ పనితీరు గొప్పగా ఉందంటూ అధికారులు వివరించగా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. ప్రతిరోజూ లక్షల మంది ఫోన్‌లు చేయడం సాధ్యమేనా? థర్డ్‌పార్టీ ప్రమేయం లేకుండా మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకోవడమేమిటని ప్రశ్నించారు.
నామినేషన్‌పై నిధుల పందేరం
‘1100’ కాల్ సెంటర్ మూడు షిఫ్ట్‌ల్లో 24 గంటలూ పని చేస్తుందని అధికారులు అంటున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11వరకు మరో షిఫ్ట్, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 వరకు మరో షిఫ్ట్‌లో ఈ కాల్ సెంటర్ పనిచేస్తోందని చెబుతున్నారు. అంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 లోపు కాల్ సెంటర్ నుంచి ఫోన్లు చేస్తే ఎవరైనా స్పందిస్తారా? లేక ఎవరైనా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 మధ్య కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆర్టీజీఎస్ సేవల కోసం చంద్రబాబు సర్కారు కార్వీ సంస్థకు నామినేషన్‌పై ఇప్పటిదాకా రూ.295.38 కోట్లు దోచిపెట్టింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపులు చేశారు. ఆర్టీజీఎస్‌కు 2018–19 బడ్జెట్‌లో రూ.175 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనూ రూ.175 కోట్లు కేటాయించారు.
రోజుకు 20 లక్షల మందికి ఫోన్ చేస్తున్నారట!
Published Sat, May 18 2019 3:37 AM | Last Updated on Sat, May 18 2019 3:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment