చర్చ కోరితే కుంటి, గుడ్డి సాకులా?
ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిపోయిన హత్యల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని, ఇప్పుడు జరుగుతున్న హత్యలు, దాడులపై చర్చ జరపాలని కోరితే కొంతమంది పెద్దలు కుంటి, గుడ్డి సాకులు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. కాలువ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి పెద్దలు మీడియా పాయింట్లోకి వచ్చి ఏవేవో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 11 మంది హత్యకు గురికాగా, 119 మంది మీద అత్యంత దారుణంగా దాడులు చేశారని, వాళ్లంతా ఇంకా ఆస్పత్రులలోనే ఉన్నారని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం జరిగిన పరిటాల రవి హత్య గురించి కాలవ శ్రీనివాసులు, దేవినేని ఉమా మాట్లాడారని చెప్పారు. పరిటాల రవి హత్య సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మీద సీబీఐ విచారణ కావాలని చంద్రబాబు కోరారని, వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణ చేయించారని చెప్పారు. వైఎస్ జగన్ నిర్దోషిగా కోర్టులో విడుదలయ్యారని అన్నారు. తర్వాత పరిణామాల్లో జేసీ సోదరులకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లిచ్చి పార్టీలో చేర్చుకున్నారని.. అంటే, వైఎస్ జగన్, జేసీ సోదరులకు అందులో భాగం లేదని చంద్రబాబుకు అప్పుడే తెలిసినా కేవలం కులాల మధ్య చిచ్చు కోసమే ఈ అంశాన్ని వాడుకున్నారని నాని అన్నారు.
ఇక ఇటీవలే గుంటూరు జిల్లాలో సాక్షాత్తు స్పీకర్ కోడెల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా మీద దాడిచేసి, ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఎత్తుకెళ్లారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ సభ్యులమైన తామంతా నరరూప రాక్షసులమంటూ కాలువ శ్రీనివాసులు చెబున్నారని నాని మండిపడ్డారు. వైశ్రాయ్ హోటల్ కుట్ర తర్వాత ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరో తేల్చాలంటూ స్వయంగా ఆయన కుమారులే సీబీఐ విచారణ కోరినా, చంద్రబాబు స్పందించలేదని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఆయనను మనస్తాపానికి గురిచేసి, ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు నరరూప రాక్షసుడు కాడా అని కొడాలి నాని ప్రశ్నించారు. అయిపోయిన కథలు చెబుతూ కాలక్షేపం చేయడం మానేసి శాంతిభద్రతలను కాపాడే పని చూడాలని కోరుతున్నామని ఆయన అన్నారు.