
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (ఫైల్ ఫొటో)
సాక్షి, విజయవాడ : కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన చంద్రబాబు తన తెలుగుదేశం పార్టీని బీజేపీతో విలీనం చెయ్యాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కేసులకు భయపడి ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టుపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్తనాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టినవిద్య. ఆయన చెప్పేదొకటి, చేసేదొకటి. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ తర్వాత కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారారు. ప్రత్యేక హోదా సాధన దిశగా వైఎస్ జగన్ చేసిన ప్రకటనతో చంద్రబాబుకు దిమ్మతిరిగింది. ఏం చెయ్యాలో అర్థంకాని స్థితితో తన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్‌ను తెరపైకి రప్పించారు. రకరకాల ప్రకటనలు చేయిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టాలని చూస్తున్నారు. బాబుకు కావాల్సిందల్లా అధికారం. అందుకోసం ఆయన ఎంతకైనా దిగజారుతారనే చరిత్ర ఉండనేఉంది. వీళ్ల కుట్రలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌కు పట్టినగతే తెలుగుదేశం, బీజేపీలకూ తప్పదు’’ అని కొడాలి నాని అన్నారు.