అసలు విషయం వదిలేసి.. అన్నీ మాట్లాడిన బాబు | CM Chandrababu political drama | Sakshi
Sakshi News home page

స్వార్థం కోసం ‘రాజీ’కీయం!

Published Sun, Feb 18 2018 1:27 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

CM Chandrababu political drama - Sakshi

సాక్షి, అమరావతి: 
- ప్రత్యేక హోదా కావాల్సిందే.. అది మా హక్కు అని ఉద్యమం రగులుతోంది.. దీనిపై రాష్ట్రప్రభుత్వ వైఖరి ఏమిటి?
రాష్ట్రానికి బోలెడన్ని నిధులిచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు.. ఆ నిధులన్నీ ఏమైపోయాయి? దానికి సమాధానమేది?
హోదా సాధించడం కోసం రాజీనామా చేద్దాం రమ్మని ప్రతిపక్షం ఆహ్వానిస్తోంది.. ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి వారితో కలసి పోరాడతారా? లేదా?
కలిసి ఎన్నికల్లో పోటీచేసి నాలుగేళ్లుగా అధికారాన్ని అనుభవిస్తూ.. మీ మంత్రులున్న కేబినెట్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రశ్నించే అర్హత మీ కెక్కడ ఉంది?  సమాధానం చెప్పాల్సింది మీరే కదా..?
ఇవాళ రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్నలివి. వీటికి ముఖ్యమంత్రి సమాధానాలు చూస్తే..
 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి ఉంది. లెక్కలు అడగడం సబబు కాదు.
కేంద్రం, రాష్ట్రం ప్రజల కోసం పనిచేయాలి..
మౌనంగా ఉండ లేకపోతున్నా.. రాజీపడను..
విభజన వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది.
ప్రశ్నలకు,  సమాధానాలకు పొంతన లేదేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? సీఎం చంద్రబాబు యథావిధిగా ప్రజలను మభ్యపెట్టే విధంగా అనర్గళంగా ఉపన్యాసం దంచికొట్టారు. ఇవాళే ఏదో కొత్తగా రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లు.. దానిని ఆయన ఇవాళే శోధించి సాధించి గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు తన 40 ఏళ్ల రాజకీయ జీవితచరిత్రలో తనకు లేని అనేక లక్షణాలను తనకు తానే ఆపాదించుకోవడం చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రత్యేక హోదా గురించి, కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయం గురించి రాష్ట్రమంతా అట్టుడికిపోతున్నా 17 రోజులుగా మౌనముద్ర పాటించిన ముఖ్యమంత్రి శనివారం ఓ బహిరంగ సభలో మాట్లాడారు. అయితే ప్రజల ఆకాంక్ష గురించి గానీ, మిత్రపక్షమైన బీజేపీ చెబుతున్న లెక్కల గురించి గానీ, పోరాడదాం రమ్మని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఇస్తున్న పిలుపు గురించి గానీ.. ఏ ఒక్క దాని జోలికి కూడా వెళ్లకుండా ఆయన ఏవేవో విషయాలు మాట్లాడడం చూసి రాష్ట్రప్రజలు విస్తుపోయారు. 

ప్రతిపక్షం ప్రశ్నలకు జవాబేది?
ఐదుకోట్ల మంది ఆంధ్రుల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు అని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అడుగుతోంది. దానికి సమాధానం లేదు. పార్లమెంటు సాక్షిగా నాడు ప్రధానమంత్రి ఇచ్చిన సంజీవని వంటి ప్రత్యేక హోదా హామీని ఫణంగా పెట్టి కమీషన్ల కోసం, లంచాల కోసం ప్యాకేజీకి స్వాగతం పలికే హక్కు ఎవరిచ్చారన్న ప్రశ్నకు జవాబు లేదు. వాస్తవానికి చంద్రబాబు  2017 జనవరి 27న మాట్లాడుతూ ‘మనమే ఎక్కువ సాధించాం. ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా? ఆధారాలుంటే రండి చెప్పండి’ అని అన్నారు. 2017 బడ్జెట్‌ తర్వాత కూడా ఆయన ఎలాంటి అసంతృప్తినీ వ్యక్తం చేయలేదు. అంటే అర్ధమేమిటి? ప్యాకేజీపై మోదీకి ధన్యవాదాలు చెబుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చంద్రబాబు చేశారు. కేంద్ర మంత్రులు వెంకయ్య, జైట్లీలకు సన్మానాలు చేశారు. నాలుగేళ్లపాటు బాగుంది.. బాగా ఇచ్చారు.. బాగా సాధించాం అని చెప్పుకుంటూ ఇపుడే అకస్మాత్తుగా ఆందోళన మొదలుపెట్టారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలకు కూడా వైఎస్సార్సీపీ సిద్ధపడింది. కలసి పోరాడదాం రమ్మని ముఖ్యమంత్రికి ప్రతిపక్షనేత పిలుపునిచ్చారు. కానీ ముఖ్యమంత్రి నుంచి స్పందనే లేదు.

ప్రజల ఆకాంక్షపై వైఖరేమిటి?
అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? తమ బిడ్డల భవితవ్యం బాగుండాలని, అందుకోసం ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా అంటేనే పరిశ్రమల వెల్లువ. ఉపాధి అవకాశాల వెల్లువ. ఆర్ధిక రంగం పరుగులు. ప్రత్యేక హోదాతో వచ్చే పన్ను రాయితీలు, ఇన్సెంటివ్‌ల వల్ల పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా తరలివస్తాయి. ఎవరినీ మనం వెళ్లి దేబిరించనక్కరలేదు. అలాంటి ప్రత్యేక హోదాకు మంగళం పాడేసి విభజన హామీలనే ప్రత్యేకప్యాకేజీగా చెబితే చంద్రబాబు స్వాగతించేశారు. హోదాపై ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు.

నాలుగేళ్లుగా పోరాడుతున్నారా..?
నాలుగేళ్లుగా కేంద్రంపై తాను ఒక్కడినే పోరాడుతున్నానని చంద్రబాబు చెబుతుం డటంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కేంద్రమంత్రులకు, ప్రధానికి, రాష్ట్రపతికి వినతిపత్రాలు ఇచ్చిందెవరు? రాష్ట్రవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన పట్టణాలలో యువభేరి సదస్సులు నిర్వహించి ప్రత్యేకహోదా ప్రాధాన్యాన్ని, అందుకోసం పోరాడాల్సిన అవసరాన్ని చెబుతూ యువతలో చైతన్యం రగిలించిందెవరు? పార్లమెంటు లోపల వెలుపల పోరాడడమే కాక ఢిల్లీలో ధర్నాలు చేసిందెవరు? కలెక్టరేట్ల ముట్టడి, రాష్ట్రవ్యాప్త బంద్‌లు జరిపిందెవరు? ప్రత్యేక హోదా కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన నాయకుడెవరు? రాష్ట్రప్రజలకు ఇవన్నీ తెలుసునని వైఎస్సార్సీపీ నాయకులం టున్నారు. కానీ ఏమీ చేయకపో యినా తాను ఒక్కడినే పోరాడానని చంద్రబాబు చెప్పుకోవడం చూసి ప్రజలు విస్తుపోతున్నారని వారు పేర్కొంటున్నారు. 

‘రాజీ’కీయాలే బాబు బలం కాదా..
జీవితంలో రాజీపడనని, ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటానని చంద్రబాబు వ్యాఖ్యానించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆయన జీవితంలో అనుక్షణం రాజీ పడిపోవడం కనిపిస్తుంది. కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండి పార్టీ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానన్న చంద్రబాబు ఓడిపోయిన వెంటనే తట్టాబుట్టా సర్దుకుని ఎన్టీఆర్‌ పంచన చేరిన విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సంజీవని వంటిదన్నారు. ఆ తర్వాత అదే నోటితో ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా.. దానితోనే అన్నీ అయిపోతాయా అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎక్కువే ఇచ్చిందని, సంతృప్తిగా ఉన్నామని అంటూనే.. మాటమారుస్తారు.. బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శించడం.. అదే బీజేపీతో చెలిమి చేయడం చంద్రబాబు శైలికి అద్దం పడుతుందని విశ్లేషకులం టున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడంతో కేసుల భయంతోనే కేంద్రం వద్ద సాగిలపడ్డారని, అందుకే  కేంద్రాన్ని నిలదీయలేకపోయారని విశ్లేషకులంటున్నారు. 

బీజేపీ లెక్కలకు సమాధానమేది?
ఏపీకి కేంద్రం చేసిన సాయంపై బీజేపీ నేతలు గణాంకాలతో సహా నివేదికలు విడుదల చేస్తున్నారు. ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా నిధులు, సంస్థలు ఇచ్చిందని చెబుతున్నారు.  ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో వివరించాలని అడుగుతున్నారు. రాజధానికి నిధులిస్తాం తప్ప మయసభలా నిర్మించడానికి కాదు.. మీ కమీషన్లకు డబ్బులివ్వం.. పోలవరం ప్రాజెక్టులో అవినీతి నిజంకాదా.. నాలుగేళ్లలో టీడీపీ ఏ మేరకు పనులుచేపట్టింది? వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు ఎక్కడ ఖర్చుపెట్టారో చెప్పరెందుకు? అని బీజేపీ నేతలు అడుగుతున్నారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement