
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో భజన చేస్తూ...లీకుల్లో మాత్రం గర్జనలు చేయడం తప్పా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్న చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీకి ఏ కోశానా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. తెలుగుదేశం, బీజేపీ వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ధర్మాన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ డ్రామాలను తూర్పారబట్టారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడమే సమస్యలకు పరిష్కారమని వైఎస్సార్‌సీపీ భావిస్తుండగా.. టీడీపీ మాత్రం తమ స్వప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఢిల్లీలో భజన చేస్తూ, రాష్ట్రంలో మాత్రం బీజేపీతో పోరాటం చేస్తున్నట్టు ప్రజలను నమ్మించేందుకు హైడ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి 16 రోజులైనా సీఎం కన్పించడం లేదని, మరోవైపు ఆయన పార్టీ కార్యాలయం లీకుల మీద లీకులిస్తోందని ధర్మాన ఎద్దేవా చేశారు.