సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాపై కలిసి పోరాడదామని, ఎంపీలందరితో రాజీనామా చేయిద్దామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత ఆత్మరక్షణలో పడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునుంచి ఇప్పటివరకూ నోరెత్తకుండా లీకులతో కాలం గడుపుతున్న టీడీపీ అధినేత.. జగన్ ప్రకటనతో షాక్ తిన్నారు. దీంతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కలసి పోరాడదామని విపక్ష నేత ఇచ్చిన పిలుపును స్వాగతించకుండా ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయించి, మూకుమ్మడిగా ఎదురుదాడి చేయాలని టీడీపీ నాయకులను ఉసిగొల్పుతున్నారు. సొంత ప్రయోజనాలు, రాజకీయ అవసరాలే ప్రాతిపదికగా నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన బాబు ప్రజలను ఏమార్చేందుకు 15 రోజులుగా రకరకాల డ్రామాలతో రాజకీయ రంగులు మారుస్తున్న విషయం తెలిసిందే. హోదా పేరెత్తకుండా... పార్లమెంటులో పోరాడతాం, అవసరమైతే బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటామంటూ అనుకూల మీడియాకు లీకులిస్తూ చిత్రవిచిత్రంగా ఆయన నడుపు తున్న రాజకీయ డ్రామాపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. హోదాకోసం ముందుండి పోరాడాల్సిన సీఎం మొహం చాటేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
లీకులతో హైడ్రామా
అమెరికా నుంచి అనకాపల్లి వరకూ జరిగే ప్రతి అంశంపైనా స్పందిస్తూ మీడియా సమావేశాల్లో గంటల తరబడి మాట్లాడే చంద్రబాబు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీడియాకు మొఖం చాటేశారు. ఈ నెల ఒకటో తేదీన పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ బడ్జెట్‌పై ఆయన నేరుగా స్పందించలేదు. ఎంపీలు, మంత్రులతో మాట్లాడించడమే తప్ప తాజా పరిణామాలపై నోరు మెదపడంలేదు. ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌లు, అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నాయకులతో సమన్వయ కమిటీ, కోర్ కమిటీ పేరుతో సమావేశాలు నిర్వహించడం, అక్కడ మాట్లాడినట్లుగా లీకులతోనే సరిపుచ్చుతున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెస్తామని లీకులిచ్చి, ఆ తర్వాత కేంద్రంపై పోరాటం చేస్తామని హడావుడి చేశారు. పార్లమెంటులో ఆరు రోజులు వరుసగా నిరసనల పేరుతో హడావుడి చేసినా కేంద్రం స్పందించకపోవడంతో... విభజన చట్టం హామీలను అమలు చేసేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించినట్లు లీకులిచ్చి హంగామా సృష్టించారు. ఆ మరుసటిరోజే ఇందుకు విరుద్ధంగా... కేంద్రం చెప్పే మాటలను నమ్మలేమని పలువురు ఎంపీలతో ప్రకటనలు చేయించారు. మరోవైపు పార్లమెంటులో అద్భుతంగా పోరాడారంటూ ఎంపీ గల్లా జయదేవ్‌కు సన్మానాలు చేయించారు. ఆ తర్వాత మళ్లీ కేంద్రం పై పోరాటం చేస్తున్నామని, కేంద్రం చెబుతున్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలని లీకులిచ్చారు. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తూ, తమకు అనుకూలంగా లీకులిస్తూ హైడ్రామా నడిపారు.
రాజీనామాల ప్రకటనతో ఉలికిపాటు
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6వ తేదీ తర్వాత తన పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో టీడీపీ అధినేత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 15 రోజులుగా నానా రకాల డ్రామాలాడుతూ హడావుడి చేసిన టీడీపీ నాయకులు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడి గందరగోళానికి గురయ్యారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఏదో చేసేస్తామని హడావుడి చేసిన టీడీపీ నేతలు ఏం చేయాలో పాలుపోక గందరగోళంలో పడ్డారు. కేంద్రం నుంచి ఎందుకు బయటకు రావడంలేదని, కేంద్ర మంత్రులు ఎందుకు రాజీనామాలు చేయడంలేదనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దిక్కులుచూడటం వారి వంతయింది.
ఈ పరిస్థితుల్లో తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారని లీకులివ్వడం మొదలు పెట్టారు. కేసుల భయంతోనే చంద్రబాబు బీజేపీని వదలడంలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుండడంతో... తనకు కేసుల భయం లేదని, తాను కేంద్రానికి భయపడడంలేదని మీడియాకు లీకులిచ్చారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీల కంటే ముందే తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు మార్చి ఐదో తేదీన రాజీనామాలు చేస్తారని, బీజేపీతో అక్కడితో తెగతెంపులు చేసుకుంటామని మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అయితే ఈ ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయగా, అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. దీంతో ఆదినారాయణరెడ్డి మాటమార్చి మంత్రుల రాజీనామాలు చేయడం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.
జగన్ ప్రతిపాదనతో ఇరకాటంలో టీడీపీ
మరోవైపు వైఎస్సార్‌సీపీ స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళుతుండడం టీడీపీకి మరింత ఇరకాటంగా మారింది. హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టే హక్కు చంద్రబాబుకు ఎక్కడిదన్న జగన్ ప్రశ్నకు టీడీపీ సమాధానం చెప్ప లేని పరిస్థితి. దీంతో హోదా ప్రస్తావన లేకుండా జగన్‌పై ఎదురుదాడి చేయాలని, వ్యక్తిగత విమర్శలు చేయాలని నాయకులకు బాబు సూచించారు. దీంతో అసలు విషయాన్ని వదిలేసి టీడీపీ నాయకులు అదేపనిగా జగన్‌ను దుమ్మెత్తిపోయడం మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో తమ ఎంపీలతో తాను రాజీనామా చేయిస్తానని, మీరు టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలని, ఇద్దరం కలసి రాజీనామా చేస్తే హోదా ఎందుకు రాదో చూద్దామనడంతో టీడీపీ మరింత ఉక్కిరిబిక్కిరికి గురైంది. జగన్ చేసిన ప్రతిపాదనపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నా ప్రజల నుంచి దీనిపై ఒత్తిడి పెరుగుతుండటంతో రకరకాల డ్రామాలాడుతోంది. మరోవైపు వ్యూహాత్మకంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్న టీడీపీపై బీజేపీ ఎదురుదాడికి దిగడం బాబును మరింత ఇరకాటంలోకి నెట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, జాతీయ అధికార ప్రతి నిధి జీవీఎల్ నరసింహారావు టీడీపీ అస త్య ఆరోపణలు చేస్తోందన్నారు. తాము నిజాలు చెబితే టీడీపీ ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు హెచ్చరించడంతో చంద్రబాబు మరింత ఆత్మరక్షణలో పడి గింగిరాలు తిరుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment