బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
సాక్షి, రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఇతర ప్రయోజనాల సాధనలో భాగంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఆందోళనను ఉధృతం చేస్తుండగా అధికారంలోని మిత్ర పక్షాలు టీడీపీ, బీజేపీలలో వణుకు మొదలైంది. దీంతో కేంద్ర తమకు ఇవ్వాల్సిన నిధుల్లో మోసం చేసిందని ఓవైపు టీడీపీ చెబుతోంటే.. మేం లెక్క ప్రకారం ఇస్తున్నా టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మిత్రపక్షం టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ తమకు మిత్రపక్షంగా ఉంటూనే బీజేపీని రోడ్డుపైకి ఈడుస్తుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడును మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ నేత సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఏపీకి రావాల్సిన నిధులు ఇదివరకే 85 శాతం వరకు వచ్చాయన్నారు. మిగిలిన నిధులు ఏపీకి ఇవ్వడానికి 2022 వరకు సమయం ఉందన్నారు. కానీ కేంద్రం అందిస్తున్న సాయంపై సీఎం చంద్రబాబు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం చేసిన అభివృద్ధిని నిరూపించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, టీడీపీ చర్చకు వస్తుందా అని సవాల్ విసిరారు. మీడియా పక్షపాతాన్ని వదిలి, వాస్తవాలు చూపించాలని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబును ప్రశ్నించని మీడియా, కేవలం బీజేపీ నేతల్ని మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు. సుజనాచౌదరి, గంటా శ్రీనివాస్‌లు ప్రకటిస్తున్న అభివ్ర్రద్ధి కార్యక్రమాలు కేంద్రం చేసినవి కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment