
టీడీపీ ఒక విష పురుగు..
తిరుపతి : తెలుగుదేశం పార్టీపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ సానుభూతితో టీడీపీ తిరుపతిలో గెలవాలని చూస్తుందన్నారు. సానుభూతితో గెలవడానికి వెంకటరమణ సతీమణి సుగుణమ్మకు టిక్కెట్ ఇచ్చారన్నారు.
తిరుపతి నుంచి నారా లోకేష్, చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేయాలని ఆశించారని, అయితే అధికారం చేపట్టిన కొద్ది నెలలకే ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో గెలవలేమన్న ఉద్దేశ్యంతోనే సానుభూతితో గెలవడానికి సుగుణమ్మకు టిక్కెట్ ఇచ్చారని రఘువీరా అన్నారు. టీడీపీ ఒక విష పురుగు అని, దాన్ని ఓటు అనే ఆయుధంతో చంపేయాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికలో మహిళలు టీడీపీకి గుణపాఠం చెబుతారని రఘువీరా వ్యాఖ్యానించారు.