
సాక్షి, న్యూఢిల్లీ: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీ, టీడీపీల గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు తదితరులు శుక్రవారం ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారిని కలసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు, విభజన చట్టంలోని అన్ని హామీలు అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చి, అమలులో మాత్రం విస్మరించిందన్నారు.
అలాగే రాష్ట్రంలోని టీడీపీ ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. టీడీపీ ఇచ్చిన 600 హామీలు ఎలా సాధ్యం అంటూ నాడు కేంద్రం ఎన్నికల సంఘం వివరణ కోరిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తామని టీడీపీ వివరణ కూడా ఇచ్చిందన్నారు. అయితే రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగులకు రూ. 2 వేల భృతిలాంటి ప్రధాన హామీలను టీడీపీ అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. హామీలు విస్మరించినందునా ఎన్నికల నియమావళికి అనుగుణంగా బీజేపీ, టీడీపీల గుర్తింపును రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment