
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో రాష్ట్రానికి జరిగిన వంచనలో బీజేపీతోపాటు టీడీపీ కూడా భాగస్వామి అని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి హోదా వద్దు ప్యాకేజీ ముద్దని సీఎం చంద్రబాబు ఒప్పుకున్నప్పుడే మోసం జరిగిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలై ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. గడిచిన 60 ఏళ్లలో రూ.లక్ష కోట్లు అప్పు చేస్తే, టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఆడంబరాల కోసం మరో రూ.లక్షన్నర కోట్లు అప్పు చేశారని ధ్వజమెత్తారు.
పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు జరిపి ప్రచారానికి వాడుకోవాలని టీడీపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. అదే జరిగితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరై ప్రజల అజెండాను ప్రస్తావించాలని కోరారు. కాగా, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని రఘువీరా స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం నుంచి మొదటి దశలో 4 జిల్లాల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఉమెన్ చాందీ సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. కేంద్రంలో యూపీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాపైనే మొదటి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 13న కాంగ్రెస్‌లో చేరుతున్నారని రఘువీరా తెలిపారు.
వైఎస్ పాలనలో ప్రతి కుటుంబానికీ లబ్ధి
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ లబ్ధి కలిగిందని రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆదివారం వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రాపటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment