
అసలు చేసిందే తప్పు. ఆపై చేసిన ఘనకార్యాన్ని అందరి ముందు చెప్పుకోవడం తెలుగుదేశం నేతలకే చెల్లింది.
► టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గుడా చైర్మన్ గన్ని కృష్ణ
సాక్షి, రాజమహేంద్రవరం: అసలు చేసిందే తప్పు. ఆపై చేసిన ఘనకార్యాన్ని అందరి ముందు చెప్పుకోవడం తెలుగుదేశం నేతలకే చెల్లింది. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టిన తెలుగుదేశం నేతలు తాము చేసిన పనిని వెనుకేసుకొస్తున్నారు. అంతేకాదు చాలా తక్కువ పంచామంటూ చెప్పుకొంటున్నారు.
వివారాల్లోకి వెళ్తే నంద్యాల ఉపఎన్నికలో డ్వాక్రా మహిళలకు రూ.4 వేలు ఇచ్చినమాట నిజమేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అనడం సరికాదన్నారు. తాము డబ్బు పంచడాన్ని ఎన్నికల దృష్టితో చూడవద్దని ఉండవల్లికి చెప్పడం విశేషం.