ganni krishna
-
అవును.. నంద్యాలలో రూ.4 వేలే ఇచ్చాం
► టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గుడా చైర్మన్ గన్ని కృష్ణ సాక్షి, రాజమహేంద్రవరం: అసలు చేసిందే తప్పు. ఆపై చేసిన ఘనకార్యాన్ని అందరి ముందు చెప్పుకోవడం తెలుగుదేశం నేతలకే చెల్లింది. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టిన తెలుగుదేశం నేతలు తాము చేసిన పనిని వెనుకేసుకొస్తున్నారు. అంతేకాదు చాలా తక్కువ పంచామంటూ చెప్పుకొంటున్నారు. వివారాల్లోకి వెళ్తే నంద్యాల ఉపఎన్నికలో డ్వాక్రా మహిళలకు రూ.4 వేలు ఇచ్చినమాట నిజమేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అనడం సరికాదన్నారు. తాము డబ్బు పంచడాన్ని ఎన్నికల దృష్టితో చూడవద్దని ఉండవల్లికి చెప్పడం విశేషం. -
బాలకృష్ణకు గన్ని అల్పాహార విందు
రాజమహేంద్రవరం సిటీ : ‘డిక్టేటర్’ విజయోత్సవ యాత్రలో భాగంగా నగరానికి వచ్చిన సినీ హీరో బాలకృష్ణకు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గన్ని కృష్ణ శనివారం ఉదయం అల్పాహారవిందు ఇచ్చారు. బాలకృష్ణ గన్ని ఇంటివద్ద ఉన్న ఎన్టీఆర్, గన్ని సత్యన్నారాయణమూర్తిల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ‘డిక్టేటర్’ విజయం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. త్వరలో తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయనున్నట్లు తెలిపారు. కాగా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. లారీ డ్రైవర్లకు దుస్తులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, మేయర్ పంతం రజనీ శేషసాయి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సినీ దర్శకుడు శ్రీవాస్ పాల్గొన్నారు. -
నీటిపర్వంలో అవినీతి కెరటాలు
ప్రజాధనాన్ని దిగమింగారు.. రాజమండ్రి సిటీ : పుష్కరాల పనుల్లో ప్రజాధనాన్ని దిగమింగారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ ఆరోపించారు. వారెవరో తేల్చేందుకు విచారణ జరిపించాల ని డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కర పనుల్లో జరిగిన అవకతవకలపై సిద్ధం చేసిన నివేదికను త్వరలో ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు చెప్పారు. అవినీతిని అధికారులపై నెట్టి వేస్తున్న ప్రజాప్రతినిధులు వారిని సాగనంపే ప్రయత్నం చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిపరులైన అధికారులను ఇక్కడకు తీసుకు వచ్చిన వారిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పనుల కేటాయింపు, పారిశుద్ధ్య కార్మికులకు చెల్లింపుల వ్యవ హారంపై విచారణ జరపాలన్నారు. చంద్రబాబు వల్లే పుష్కరాలు విజయవంతం అధికారుల నిర్లక్ష్యం వల్లనే మొదటిరోజు తొక్కిసలాట చోటు చేసుకుందని గన్ని అన్నారు. పోలీసులు ద్వంద్వనీతిని అవలంబించారని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులను పోలీస్ వాహనాల్లో యథేచ్ఛగా ఘాట్ల వద్దకు తీసుకు వెళ్ళారని, చివరి రోజు రద్దీ లేకపోయినా కోటిలింగాల ఘాట్‌లో తన వాహనాన్ని అడ్డుకున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు చేపట్టిన వీఐపీ పాస్‌ల సంస్కృతి ఏమిటో అర్థం కాలేదన్నారు.పుష్కరాలు విజయవంతమైన ఘనత ఆ సమయంలో రాజమండ్రిలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. పుష్కర యాత్రికులకు స్వచ్ఛంద సంస్థలు చేసిన సేవలు అద్వితీయమన్నారు. ‘పుష్కర’ అవినీతిని ఉపేక్షించబోం.. దానవాయిపేట (రాజమండ్రి) : పుష్కరాలో జరిగిన అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నివేదిక అందజేస్తామని బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. సోమవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుష్కర పనులో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు, నగర సుందరీకరణ పనుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. కార్మికులకు రూ.425 వేతనం చెల్లిసున్నామని చెప్పి కేవలం రూ.280 మాత్రమే చెల్లించారని ఆరోపించారు. పారిశుద్ధ్య పనులను నిర్వహించడానికి స్థానికులు ముందుకు వచ్చినా బయట నుంచి ఎక్కువ మందిని తీసుకురావడంలో కమీషన్ల కక్కుర్తి ఉందని ఆరోపించారు. నగరంలో సుందరీకరణ పనులను కడియం నర్సరీలకు ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా ఇచ్చారన్నారు. బారికేడ్ల ఏర్పాటులో, ఘాట్ల నిర్మాణంలో, కొన్ని సివిల్ పనుల నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని సహించమని, త్వరలోనే పుష్కర అవినీతిపై ప్రభుత్వాన్నికి నివేదిక అందజేస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్ముల దత్తు, గరిమెళ్ళ చిట్టిబాబు, నగర ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణ, వాసంశెట్టి గంగాధరరావు, మహిళా మోర్చా రాష్ర్ట కార్యదర్శి నాళం పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
హామీలను నెరవేరుస్తాం : యనమల
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల ఆశలను, ఆకాంక్షలను సాకారం చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణను పరామర్శించేందుకు ఆదివారం రాజమండ్రి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో సీమాంధ్ర ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనని, అయినప్పటికీ ప్రణాళికాబద్ధంగా హామీలను నెరవే రుస్తామని పునరుద్ఘాటించారు. అన్ని అంశాలను పరిశీలించాకే హామీలు ఇచ్చామని, ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదన్నారు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, యువతకు ఉపాధి, పింఛను పెంపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తామన్నారు. గన్ని కృష్ణకు పరామర్శ అనారోగ్య సమస్యలతో స్వతంత్ర హాస్పటల్లో చికిత్స పొందుతున్న గన్ని కృష్ణను యనమల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు. గన్ని కృష్ణ త్వరగా కోలుకోవాలని యనమల ఆకాంక్షించారు. యనమల వెంట రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, నాయకులు గంగుమళ్ల సత్యనారాయణ, పట్టపగలు వెంకట్రావు, దండుమేను వెంకటసుబ్బారావు, నిమ్మలపూడి గోవింద్, మొల్లి చిన్నియాదవ్ తదితరులు ఉన్నారు.