ప్రజాధనాన్ని దిగమింగారు..
రాజమండ్రి సిటీ : పుష్కరాల పనుల్లో ప్రజాధనాన్ని దిగమింగారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ ఆరోపించారు. వారెవరో తేల్చేందుకు విచారణ జరిపించాల ని డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కర పనుల్లో జరిగిన అవకతవకలపై సిద్ధం చేసిన నివేదికను త్వరలో ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు చెప్పారు. అవినీతిని అధికారులపై నెట్టి వేస్తున్న ప్రజాప్రతినిధులు వారిని సాగనంపే ప్రయత్నం చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిపరులైన అధికారులను ఇక్కడకు తీసుకు వచ్చిన వారిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పనుల కేటాయింపు, పారిశుద్ధ్య కార్మికులకు చెల్లింపుల వ్యవ హారంపై విచారణ జరపాలన్నారు.
చంద్రబాబు వల్లే పుష్కరాలు విజయవంతం
అధికారుల నిర్లక్ష్యం వల్లనే మొదటిరోజు తొక్కిసలాట చోటు చేసుకుందని గన్ని అన్నారు. పోలీసులు ద్వంద్వనీతిని అవలంబించారని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులను పోలీస్ వాహనాల్లో యథేచ్ఛగా ఘాట్‌ల వద్దకు తీసుకు వెళ్ళారని, చివరి రోజు రద్దీ లేకపోయినా కోటిలింగాల ఘాట్‌లో తన వాహనాన్ని అడ్డుకున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు చేపట్టిన వీఐపీ పాస్‌ల సంస్కృతి ఏమిటో అర్థం కాలేదన్నారు.పుష్కరాలు విజయవంతమైన ఘనత ఆ సమయంలో రాజమండ్రిలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. పుష్కర యాత్రికులకు స్వచ్ఛంద సంస్థలు చేసిన సేవలు అద్వితీయమన్నారు.
‘పుష్కర’ అవినీతిని ఉపేక్షించబోం..
దానవాయిపేట (రాజమండ్రి) : పుష్కరాలో జరిగిన అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నివేదిక అందజేస్తామని బీజేపీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. సోమవారం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుష్కర పనులో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు, నగర సుందరీకరణ పనుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. కార్మికులకు రూ.425 వేతనం చెల్లిసున్నామని చెప్పి కేవలం రూ.280 మాత్రమే చెల్లించారని ఆరోపించారు. పారిశుద్ధ్య పనులను నిర్వహించడానికి స్థానికులు ముందుకు వచ్చినా బయట నుంచి ఎక్కువ మందిని తీసుకురావడంలో కమీషన్ల కక్కుర్తి ఉందని ఆరోపించారు. నగరంలో సుందరీకరణ పనులను కడియం నర్సరీలకు ఎటువంటి టెండర్‌ల ప్రక్రియ లేకుండా ఇచ్చారన్నారు. బారికేడ్ల ఏర్పాటులో, ఘాట్‌ల నిర్మాణంలో, కొన్ని సివిల్ పనుల నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని సహించమని, త్వరలోనే పుష్కర అవినీతిపై ప్రభుత్వాన్నికి నివేదిక అందజేస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్ముల దత్తు, గరిమెళ్ళ చిట్టిబాబు, నగర ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణ, వాసంశెట్టి గంగాధరరావు, మహిళా మోర్చా రాష్ర్ట కార్యదర్శి నాళం పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
నీటిపర్వంలో అవినీతి కెరటాలు
Published Tue, Jul 28 2015 1:57 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement