♦ కోటిన్నర భూమిపై టీడీపీ నేత కన్ను
♦ చర్చి ఆస్తులకు చెందిన భూమికి పాస్‌బుక్
♦ బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్.. దళితుల ఆందోళన
మార్కాపురం: Üుమారు కోటిన్నర రూపాయల విలువ చేసే చర్చి భూములపై పశ్చిమ ప్రకాశానికి చెందిన టీడీపీ ముఖ్య నేత కన్నుపడింది. పకడ్బందీగా ప్రణాళిక వేసి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తన అనుచరులకు పాస్ పుస్తకాలు ఇప్పించుకుని అప్పనంగా 11.30 ఎకరాలు సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. నేరుగా తన పేరు ఉంటే విమర్శలు వస్తాయని ముగ్గురు, నలుగురు వ్యక్తులు చేతులు మారిన తరువాత తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చూస్తున్నారని ఈ విషయం తెలిసిన దళితులు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై దళితులు ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు, కలెక్టర్‌కు, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు.
వివరాలు... మార్కాపురం మండలంలోని నికరంపల్లె ఎస్సీలకు సుమారు వంద ఏళ్ల కిందట బ్రిటిష్ ప్రభుత్వం సర్వే నంబర్ 242–7లో 11.30 ఎకరాలను (ప్రస్తుత మార్కెట్ విలువ కోటిన్నర) బాప్టిస్ట్ మిషన్‌కు గానూ మూర్సి దొర వారి పేరుతో కేటాయించారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదు చేశారు. ఈ పొలాన్ని అమ్మేందుకు వీలు లేకుండా కేవలం నికరంపల్లె గ్రామ దళితులు సాగు చేసుకుని దానిపై వచ్చే ఆదాయంలో సగం చర్చి అభివృద్ధికి కేటాయించుకోవాలని అప్పట్లో తమ పెద్దలు తమకు చెప్పినట్లు గ్రామ దళితులు తెలిపారు.
అయితే, ఈ ఏడాది మార్చిలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి పాస్ పుస్తకం నంబర్ 19346, పట్టా నంబర్ 146తో మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన కొండేటి దివాకర్ పేరుతో జారీ అయింది. ఈ పొలాన్ని దివాకర్ మార్చి 27న 11.30 ఎకరాలను రూ.16.95 లక్షలకు మండల కేంద్రమైన పెద్దారవీడుకు చెందిన అల్లు వెంకటేశ్వరరెడ్డికి రిజిస్టర్ చేయటం గమనార్హం. కొండేటి దివాకర్, అల్లు వెంకటేశ్వరరెడ్డి ఇద్దరూ నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతకు అనుచరులు కావడం గమనార్హం. కొండేటి దివాకర్ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సమయంలో వ్యవహారశైలి సరిగా లేకపోవటంతో అధికారులు తొలగించారు.
ఆర్‌ఎస్‌ఆర్‌లో మూర్సి దొర పేరుతో ఉన్న పట్టా ఆకస్మికంగా కొండేటి దివాకర్ పేరుతో ఎలా వచ్చిందో రెవెన్యూ అధికారులకే తెలియాలి. అనువంశికంగా, పూర్వీకుల నుంచి వచ్చినట్లుగా పట్టాదారు అడంగల్‌లో నమోదు చేయటం రెవెన్యూ అధికారులకే చెల్లింది. తెర వెనుక నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో ముడుపులు అందించి కథ నడిపినట్లుగా దళితులు ఆరోపిస్తున్నారు. నికరంపల్లె గ్రామానికి సంబం«ధం లేని కొండేటి దివాకర్‌కు పాస్ పుస్తకం రావటం ఒక వింత అయితే, ఎటువంటి రికార్డులు పరిశీలించకుండా రెవెన్యూ అధికారులు యాజమాన్యపు హక్కుల రికార్డులో నమోదు చేయటం విశేషం.
ఇందులో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పనిచేస్తున్న రెవెన్యూ అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పష్టంగా నకిలీ పాస్ పుస్తకంగా గ్రామ దళితులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసేటప్పుడు రెవెన్యూ అధికారులు అన్ని రికార్డులను పరిశీలించాల్సి ఉండగా, ఈ సంఘటనలో అవేమీ లేకుండానే అధికార పార్టీ నేత చెప్పినట్లు కథ నడిపించారు. మిషనరీ ఆస్తులు అమ్మటం, కొనటం నేరమని రెవెన్యూ అధికారులకు తెలుసు. వారే చట్ట ఉల్లంఘన చేశారు. అన్యాక్రాంతమైన చర్చి భూములు 11 ఎకరాల్లో ఎకరా రూ.15 లక్షల ప్రకారం వేసుకున్నా, ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు కోటిన్నర ఉంటుంది.
అసెంబ్లీలో ప్రస్తావిస్తా
నికరంపల్లి చర్చి పొలాలను మార్కాపురం రెవెన్యూ అధికారులు తమ ఇష్టమొచ్చినట్లుగా మార్పు చేసి సంబంధం లేని వ్యక్తికి పాస్ పుస్తకంలో నమోదు చేసి ఇవ్వటం దారుణం. రికార్డులను పరిశీలించాలన్న ఆలోచన కూడా వారికి లేదు. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో స్పీకర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. ఆర్డీఓకు ఫిర్యాదు చేశాను. కలెక్టర్, జేసీ, రెవెన్యూ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇచ్చిన పాస్ పుస్తకాలు రద్దు చేసి చర్చి ఆస్తిగానే ఉంచాలి.
– జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్యే
దళితుల భూములు స్వాహా
Published Sun, May 28 2017 2:38 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement