ఇది మడకశిర మండలం వైబీ హళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జాడ్రహళ్లి క్వారీ.
మడకశిర నియోజకవర్గం జిల్లా సరిహద్దులో కర్ణాటకకు సమీపంలో ఉంది. అక్షరాస్యత శాతం చాలా తక్కువ. ప్రశ్నించే తత్వం కూడా లేని ప్రాంతం. దీన్ని ఆసరా చేసుకున్న ఎమ్మెల్సీ గుండుమల కుటుంబం టీడీపీ హయాంలో క్వారీల బిజినెస్ ప్రారంభించింది. కొండ కనబడితే పిండేస్తూ రూ.కోట్లు సంపాదించింది. తమ్ముళ్లందరినీ క్వారీ బిజినెస్‌లో దింపిన గుండుమల నిబంధనలకు విరుద్ధంగా సహజవనరులన్నీ దోచేస్తున్నారు. అధికారులకు ఆమ్యామ్యాలిస్తూ విలువైన గ్రానైట్‌ను అడ్డగోలుగా సరిహద్దు దాటించేస్తున్నారు. తమ పరిధిలో ఎవరైనా పొరపాటున క్వారీ బిజినెస్ చేయాలన్నా కప్పం కట్టాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూ భారీగా వసూళ్లు చేస్తున్నారు.
సాక్షి, మడకశిర: టీడీపీ హయాంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హవా నడిపించారు. పచ్చ చొక్కా మాటున ఫ్యామిలీ బిజినెస్ చేశారు. సొంత తమ్ముళ్లందరినీ క్వారీల బిజినెస్‌లోకి దింపి నిబంధనలకు విరుద్ధంగా సహజవనరులన్నీ సరిహద్దు దాటించేశారు. ఎమ్మెల్సీ కుటుంబమంతా క్వారీలపైనే ఆధారపడి బతుకుతుండగా.. అధికారులు ఆ క్వారీలవైపు కన్నెత్తి చూసేందుకు జంకుతున్నారు. అడపాదడపా దాడులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మడకశిర మండలంలోని జాడ్రహళ్లి కలర్ గ్రానైట్ క్వారీ చాలా విలువైనది. ఈ క్వారీలో ఎమ్మెల్సీ సోదరులు రాధాకృష్ణ, శివానందప్ప, చంద్రప్పలు పాగా వేశారు. మూడు హెక్టార్ల విస్తీర్ణంలోని ఈ క్వారీ నుంచి విలువైన గ్రానైట్‌ను తవ్వుకుని కర్ణాటకకు తరలిస్తున్నారు.
అనుమతులకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టడంతో పాటు రాయల్టీ కూడా చెల్లించకుండానే గ్రానైట్ తరలిస్తున్నారు. పలుసార్లు గనులశాఖ అధికారులు గ్రానైట్ లారీలను సీజ్ చేసినా ఎమ్మెల్సీ అండతో మళ్లీ అదే దందా నడిపిస్తున్నారు. రాత్రివేళల్లో గ్రానైట్‌ను సరిహద్దు దాటించేస్తున్నారు. ఇక అగళి మండలంలోని హెచ్‌డీ హళ్లి క్వారీలో విలువైన గ్రానైట్ లభ్యమవుతుండగా.. ఈ క్వారీపై కూడా ఎమ్మెల్సీ కుటుంబ సభ్యుల కన్నుపడింది. ఎమ్మెల్సీ సోదరుడు చంద్రప్ప రెండు హెక్టార్లలో గ్రానైట్ క్వారీని లీజుకు తీసుకుని అడ్డగోలుగా తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉండగా..రాత్రికి రాత్రి గ్రానైట్‌ను సరిహద్దు దాటించేస్తున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
కొండ కనబడితే చాలు ఎన్‌ఓసీ
గుండుమల కుటుంబీకులు రూ.కోట్లు కుమ్మరించే గ్రానైట్, మెటల్ క్వారీ బిజినెస్‌పైనే దృష్టి సారించారు. టీడీపీ హయాంలో అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు సాగించారు. కొండలు కనబడితే చాలు వెంటనే క్వారీల నిర్వహణకు అనుమతి తీసుకుంటారు. వీరికి మైనింగ్, గనులు, రెవెన్యూ శాఖాధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఇతరులెవరైనా ఎన్‌ఓసీకి దరఖాస్తు చేసుకుంటే గుండుమలకు ముందుగానే సమాచారం ఇచ్చి స్వామిభక్తి చాటుకుంటున్నారు. అందువల్లే నియోజకవర్గంలో క్వారీల నిర్వహణకు పలువురు టీడీపీ నాయకులు దరఖాస్తు చేసుకున్నా వారికి దక్కని పరిస్థితి. పొరపాటున ఎవరైనా క్వారీలకు అనుమతులు తెచ్చుకున్నా గుండుమల కుటుంబీకులు వారిని భయాందోళనకు గురిచేస్తున్నారనే చర్చ ఉంది. తమదారికి వచ్చాక మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు గుండుమల అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇది మడకశిర మండలం మెళవాయి సమీపంలోని రోడ్డు మెటల్ క్వారీ. దీన్ని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు జయప్ప, సుభాష్‌లు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారన్న ఫిర్యాదుల మేరకు ఇటీవల కర్నూలు విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. హద్దులు దాటి తవ్వకాలు చేసినట్లు గుర్తించి సీజ్ చేశారు. అయినా ఎమ్మెల్సీ కుటుంబీకులు క్వారీల్లో పనులు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment