
అనంతపురం సెంట్రల్: ‘ఏం తమాషాగా ఉందా? మా పనులకు అడ్డు తగులుతున్నావంట.. అడ్డొస్తే నీ అంతు చూస్తానం’టూ టీడీపీ నాయకుడు ఎంఎస్ రాజు బెదిరింపులకు దిగాడని బాధితుడు టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుని ఫిర్యాదు మేరకు... ప్రభుత్వశాఖల్లో సిబ్బంది వేతనాలు, ఇతరత్రా వాటికి సంబంధించి ఏజెన్సీల కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గత నెల 18న టెండర్ల నోటిఫికేషన్ రాగా పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.
కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కమిటీ టెండర్లను ఖరారు చేయనుంది. ఈ నెల మూడో తేదీన ఐదు సంస్థలు ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో అవకతవకలు జరిగాయని, లోపాలు సరిదిద్దాలని రాడ్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీకి చెందిన ఓబిరెడ్డి ఇటీవల జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటికే టెండర్లు దక్కించుకున్న ఎంఎస్ రాజు తమకు అడ్డొస్తే అంతు చూస్తానని ఈ నెల 24న బెదిరించాడని ఓబిరెడ్డి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. దీనిపై టీడీపీ ముఖ్యనేత నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై సీఐ ఆరోహణరావును వివరణ కోరగా... ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, విచారించిన తర్వాత కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment