మీ ఊరును కొనేశా.. ఇళ్లు వదిలి వెళ్లిపోండి | TDP Leader Warns Daminedu Villagers | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 10 2017 10:27 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

TDP Leader Warns Daminedu Villagers - Sakshi

సాక్షి, తిరుపతి: ఎదురుగా ఏడుకొండలవాడు... పక్కనే పద్మావతి అమ్మవారి ఆలయం. చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతంలో సెంటు భూమి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు పలుకుతోంది. అక్కడ నివాస స్థలాలను కొనుగోలు చేసుకునేందుకు పోటీలు పడుతుంటారు. జిల్లాకు చెందిన వారే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా అక్కడ భూములు కొనుగోలు చేశారు. కొందరు భవనాలు కూడా నిర్మించుకుంటున్నారు. ఇప్పుడా ఊరి ప్రజలకు ఓ విచిత్రమైన సమస్య వచ్చి పడింది. వందేళ్ల క్రితం ఏర్పడిన ఆ గ్రామాన్ని స్థానికులు ఆక్రమించుకున్నారంటూ స్థానిక టీడీపీ నేత కృష్ణమూర్తినాయుడు నోటీసులు పంపించారు. తరచూ తమపై పోలీసులను ప్రయోగించి బెదిరిస్తున్నట్లు గ్రామస్థులు వాపోతున్నారు.

వందేళ్ల నాటి గ్రామం..
తిరుపతి నగరానికి కూతవేటు దూరంలో ఉన్న దామినేడు గ్రామం పాత రికార్డుల్లో ఇనాం ఎస్టేట్‌ విలేజ్‌ కింద ఉంది. అప్పట్లో వెంకటగిరి రాజులు తమ వద్ద పనిచేసే వారికి భూములను ఇనాంగా ఇచ్చారు. అందులో రైతులు పంటలు సాగు చేసుకునేవారు. ఆ సమయంలో ఏర్పడిన దామినేడులో పక్కా గృహాలు కట్టుకున్నారు. ఇదంతా వందేళ్ల క్రితం చరిత్ర. ప్రస్తుతం దామినేడులో సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2005, 2006లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అక్కడ 50 ఎకరాలను తీసుకుంది. ఆ సమయంలో స్థానికులు తమ నివాసాలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అప్పటి తహశీల్దార్‌ సురేంద్రబాబు అంగీకరించినా వారికి ఇంతవరకూ పట్టాలు దక్కలేదు.

జాతీయ రహదారితో భారీ డిమాండ్‌
పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారి ఏర్పాటుతో దామినేడు పరిధిలోని భూములకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. భూముల కోసం పలువురు వ్యాపారులు, ఉద్యోగులు వరుసకట్టారు. కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. దీంతో తిరుపతి రూరల్‌ మండలం జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ భూములు వివాదాస్పదంగా మారాయి.

మూడు నెలలకు ఒకసారి నోటీసులు... బెదిరింపులు
దామినేడు గ్రామస్థులు తనకు చెందిన 17 ఎకరాలను కబ్జా చేశారంటూ తిరుపతి రూరల్‌ మండలం టీడీపీ మాజీ అధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు 2014 అక్టోబర్‌లో ఫిర్యాదు చేశారు. ఆ భూములను ఆయన 2014 జూలైలో కళావతి రాజేంద్రన్‌ అనే మహిళ నుంచి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారని గ్రామస్థులు తెలిపారు. తమపై కృష్ణమూర్తి తరచూ దౌర్జన్యం చేయటం, పోలీసులతో బెదిరించటం, అరెస్టులు చేయించటం లాంటి చర్యలకు దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కృష్ణమూర్తి చెబుతున్న భూములకు సంబంధించి 7 ఎకరాల్లో గ్రామస్థులు ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని నివసిస్తుండటం గమనార్హం.

మరో 10 ఎకరాలకు ఫెన్సింగ్‌ వేసిన కృష్ణమూర్తినాయుడు తన ఆధీనంలోకి తీసుకున్నాడు. గ్రామంలో నివాసం ఉంటున్న సుమారు 100 మందికి ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నోటీసులు ఇవ్వటం, పోలీసులతో బెదిరిస్తున్నారని పేర్కొంటున్నారు. పైసా పైసా కూడబెట్టి కొందరు, అప్పులు చేసి మరి కొందరు పక్కాగృహాలు నిర్మించుకున్నామని దామినేడు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 అక్టోబర్‌ వరకు భూముల గురించి పట్టించుకోని వారు టీడీపీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యం చేయటం వెనుక మర్మం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేస్తామని కలెక్టర్‌ ప్రద్యుమ్న హామీ ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement