సాక్షి, కాకినాడ : పంద్రాగష్టుపై అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికి జిల్లా కేంద్రం కాకినాడ పోలీసు పెరేడ్ గ్రౌండ్‌సలో శుక్రవారం జరిగిన 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలే నిదర్శనం. పదేళ్ల తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ నాయకులు జాతీయ పండగపై ఉదాసీనంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాకినాడ పోలీసు పెరేడ్ గ్రౌండ్‌సలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ర్ట ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తొలిసారిగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, జాతీయ జెండాను ఎగురవేశారు.
అందరికీ ఆహ్వానాలు పంపినా...
ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానాలు అందాయి. అయితే జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మినహా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులెవ్వరూ హాజరు కాలేదు. జిల్లాకు చెందిన మరో సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడుతో సహా జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు, 12మంది ఎమ్మెల్యేలు ఇటీవలే టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్సీలతో ఏ ఒక్కరూ హాజరుకాలేదు. వీరిలో చాలామంది జిల్లాలోనే ఉన్నా, ఇటు వైపు కన్నెత్తయినా చూడలేదు.
ఏ హోదాలో కూర్చున్నారో...
మరో పక్క నామినేటెడ్ పదవులన్నీ రద్దు చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించినా, జిల్లా గ్రంథాలయ సంస్థ పదవిలో కొనసాగుతున్న జై సమైక్యాంధ్ర జిల్లా అధ్యక్షుడు అల్లు బాబి హోంమంత్రి పక్కనే కూర్చోవడం చర్చనీయాంశమైంది. ఇంకా ‘దేశం’ తీర్థం పుచ్చుకోలేని బాబిని ఏ హోదాలో వేదికపైకి ఆహ్వానించారంటూ అధికార పార్టీ నేతల నుంచే విమర్శలు విన్సిస్తున్నాయి.
మంజూరయ్యాయో లేదో!
చినరాజప్ప ్రపసంగంలో జిల్లాకు ఏర్పాటు చేయతలపెట్టిన పెట్రో యూనివర్శిటీ, హార్డ్‌వేర్ హబ్ ఊసే లేదు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు జిల్లాకు మంజూరయ్యాయో! లేవోననే అనుమానాలు తలెత్తాయి. అలాగే కేఎస్‌ఈజెడ్‌ల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పుకుంటున్న టీడీపీ సర్కార్ ఎక్కడా ఆ ప్రస్తావన చేయకపోవడం.. పోర్టులతో పాటు అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు రాజప్ప ప్రసంగంలో చేర్చకపోవడంపై విమర్శలు విన్పిస్తున్నాయి.
పంద్రాగష్టు.. లేదు ఇంట్రస్టు!
Published Sat, Aug 16 2014 1:12 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement