సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణకు అనుకూలంగా టీడీపీ ఇచ్చిన లేఖ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ జిల్లా నేతలు ఎంత మొత్తుకుంటున్నా ప్రజల నుంచి సానుభూతి వ్యక్తం కావడం లేదు. ఇంకోవైపు రచ్చబండ పేరుతో అధికార పార్టీ నేతలు జనాలకు చేరువయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధిష్టానమే ఇస్తోందని చెప్పుకుంటున్నారు. ఇంకో పక్క తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు శిక్షణ శిబిరాల పేరిట మండల స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ శిబిరాలకు రాష్ట్ర స్థాయి నాయకులు హాజరై టీఆర్‌ఎస్ పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తమవంతు పాత్రను పోషిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీలు ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్తుతుండడంతో టీడీపీ అదే బాటను ఎంచుకుంది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు బాన్సువాడ, బోధన్, నిజామాబాద్‌అర్బన్, ఎల్లారెడ్డి, ఆర్మూర్, జుక్కల్ నియోజకవర్గాలలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కామారెడ్డి, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం డిసెంబర్ 3న నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ అమృతాగార్డెన్‌లో జి ల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అసలు కారణం ఇది
దీనికి ప్రధాన కారణం అధినేత చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోవడమేనని పార్టీ శ్రేణులే నిరాశను వ్యక్తం చేస్తున్నాయి. పట్టుకోసం తమ్ముళ్లు పడరానిపాట్లు పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొంత మేరకు సంస్థాగతంగా బలపడాలని టీడీపీ జిల్లా నాయకత్వం కృషి చేసినప్పటికీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే పట్టును కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తగిన కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా నేతలు యోచిస్తున్నారు. ‘ఇంటింటికి తెలుగుదేశం’ పేరుతో ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా వారి మద్దతును కూడగట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్మూర్, జుక్క ల్ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఆశించిన మేర ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదు. దీనికంటే ముందు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రావ్ 19 మండలాలలో 36 రోజులపాటు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకున్నారు.
అందుకే సమావేశం
ఈ కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈనెల మూడున జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని టీడీపీ నిర్వహించనున్నది. ఇంటింటికి తెలుగుదే శం కార్యక్రమంతో పాటు రైతు సమస్యలు, విద్యుత్ , బస్సుచార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపుదలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సమావేశంలో తగిన ఉ ద్యమ కార్యక్రమాన్ని రూపొందించాలని భావిస్తోంది. ఓటరు నమోదు కార్యక్రమంపై దృష్టిసారించడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు , ప్రజావ్యతిరేక విధానాలు , అవినీతి అక్రమాలను ప్రజల్లో ఎండగట్టడం ద్వారా వారి మద్దతును పొందాలని యోచిస్తోంది. ఈ ఉద్యమాలు, పోరాటాలతో ప్రజల వద్దకు వెళ్లినప్పటికీ సరైన మద్దతు లభించని పక్షంలో రాజకీయ భవిష్యత్తు కోసం వెతుకులాట తప్పదనే భావనలో జిల్లా టీడీపీ నేతలు ఉన్నారు.
జనాదరణ పొందేదెలా!
Published Sun, Dec 1 2013 4:41 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement