సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 105 సీట్లకు తగ్గకుండా ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటామని ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 సీట్లు కైవసం చేసుకుంటామన్నారు. మంగళవారం డిచ్‌పల్లిలోని కేఎన్‌ఆర్ గార్డెన్స్‌లో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పోచారం ప్రసంగించారు. ఇంటలిజెన్స్ సర్వేలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థల సర్వేలు అన్నీ ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని తేల్చాయన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజా బలం ఉందని, అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ప్రజా బలం ముందు ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతేనని, వారికి నాలుగైదు సీట్లు కూడా రావని తేల్చిచెప్పారు. దేశ చరిత్రలోనే ఒకేసారి 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారన్నారు.
పార్టీ అభ్యర్థులు ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరోసారి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అడ్డుకోవడానికి చూస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల పార్టీలు చేస్తున్న కుట్రలను టీఆర్‌ఎస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని పోచారం పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా వ్యవసాయరంగానికి ఉచితంగా 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో సైతం ఇప్పటికీ సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా లేదని గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా పథకాల అమలు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సమావేశంలో తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిగోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా యువనాయకుడు బాజిరెడ్డి జగన్, ఎంపీపీ దాసరి ఇందిర, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కులాచారి దినేశ్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గడీల రాములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment