టీడీపీ వర్గీయుల దౌర్జన్యం
Published Sun, Mar 2 2014 1:38 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
చిలకలూరిపేట రూరల్, న్యూస్‌లైన్: యడ్లపాడు మండలం తిమ్మాపురంలో ఓటర్ల విచారణకు హాజరైన అధికారులను టీడీపీ నాయకులు అడ్డగించారు. ఇదేమని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. గ్రామంలోని నాలుగు పోలింగ్ బూత్‌లలో 171మంది ఓటర్లు స్థానికంగా నివాసం ఉండడం లేదని, డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఆ మేరకు తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగులు ఆర్‌ఐ నిర్మలాకృష్ణ, ఏఎస్‌వో చిన్నకోటేశ్వరరావు, వీఆర్వో జానీబాషా, పంచాయతీ కార్యద ర్శి శనివారం పంచాయతీ కార్యాలయంలో విచారణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీడీపీ వర్గీయులు.. ఆ ఓటర్లు వివిధ కారణాలతో మరో ప్రాంతంలో ఉంటున్నారని, ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పారు. అందుకు అధికారులు వారికి అక్కడ ఓట్లు ఉన్నాయని ధ్రువీకరణ ఉందన్నారు. అయినా ఓట్లు తొలగించవద్దని ఆదేశించిన రీతిలో టీడీపీ వర్గీయులు పేర్కొనడంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేమని ప్రశ్నించారు. అందుకు మీరెవరంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వ ర్గీయులు దౌర్జన్యం చేసి చొక్కాలు పట్టుకుని నెట్టివేశారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీకి చెందిన శ్యామ్ చొక్కా చిరిగిపోవడంతోపాటు గాయపడ్డాడు. పరిస్థితిని కళ్లారా చూసిన అధికారులు మరోమారు ప్రశ్నించకుండా వెనుతిరిగి వెళ్లారు. విచారణ సమయంలో వీఆర్వో జానీబాషాపైనా టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణ పేరుతో తమను ఇబ్బంది పెడతావా అంటూ ఒక్క ఉదుటున అతనిపైకి రావడంతో కుర్చీలోంచి వీఆర్వో ముందుకు పడి కన్నీటి పర్యంతమయ్యాడు. గ్రామస్తులు సర్దిచెప్పాల్సివచ్చింది.
టీడీపీ వర్గీయులకు ముందే సమాచారం..
డబుల్ ఎంట్రీ ఓట్లు తొలగించాలని కోరుతూ వచ్చిన ఫిర్యాదుపై విచారణకు హాజరవుతున్నట్లు ముందుగా అధికారులు టీడీపీ నేతలకు సమాచారం అందించారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనులు మానుకుని అధికారుల కోసం నిరీక్షించారు. విచారణ జరుగుతున్నట్లు వైఎస్సార్ సీపీ నాయకులకు తెలియకపోవడంతో గ్రామంలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగారు. అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి.
ఫిర్యాదు స్వీకరించని పోలీసులు..
టీడీపీ వర్గీయులు దౌర్జన్యం చేయడంతో గాయపడిన వైఎస్సార్ సీపీకి చెందిన శ్యామ్ ఫిర్యాదు చేసేందుకు యడ్లపాడు పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారు. ఎస్‌ఐ వచ్చాక ఫిర్యాదు తీసుకుంటామని చెప్పడం గమనార్హం!
అన్ని విషయాలపై విచారణ చేస్తాం..
తిమ్మాపురంలో ఓటర్ల విచారణకు వెళ్లిన సంబంధిత అధికారులు జరిగిన విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. గ్రామంలో జరిగిన గొడవలను వివరించారు. వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం ఏఎస్‌వో చెప్పారు కానీ సంబంధిత వీఆర్వో లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్ అందించలేదు. అన్ని విషయాలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తాం.
-రాగి రామాంజనేయులు,
తహశీల్దార్, యడ్లపాడు.
Advertisement
Advertisement