బాధితుడిని పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబిలేసు
అనంతపురం సెంట్రల్: రాప్తాడులో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. అప్పు తిరిగి చెల్లించమన్నందుకు దళితున్ని చితకబాదారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. రాప్తాడు మండల కేంద్రంలో నివాసముంటున్న దళిత ముత్యాలు ఏడాది కిందట టీడీపీ నాయకులైన అన్నదమ్ములు పామిళ్ల నారాయణస్వామి, పామిళ్ల కోటేశ్వర్, పామిళ్ల రామచంద్రలకు రూ. 3 లక్షల అప్పు ఇచ్చాడు. అప్పు వసూలు కోసం కొన్ని రోజులుగా ముత్యాలు టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే వారు కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో మంగళవారం సాయంత్రం ముత్యాలు తన భార్యతో కలసి అప్పు అడిగేందుకు వెళ్లగా రెచ్చిపోయిన అన్నదమ్ములు కులం పేరుతో దూషిస్తూ వెదురు కట్టెలతో దాడి చేశారు. బాధితులు కన్నీరుమున్నీరవుతూ రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దాడికి పాల్పడింది టీడీపీ నేతలు కావడంతో కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకంజ వేశారు. గాయపడిన ముత్యాలు బుధవారం ఉదయం అనంతపురం సర్వజనాస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు.
దళితులకు రక్షణ కరువు
రాప్తాడు నియోజకవర్గంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పెన్నోబిలేసు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల చేతిలో దాడికి గురై సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న ముత్యాలును ఆయన పరామర్శించారు. మంత్రి పరిటాల సునీత అండదండలతో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారన్నారు. దళితులపై రోజురోజుకు దాడులు ఎక్కువవుతున్నాయన్నారు. ఇటీవల విద్యుత్‌బిల్లులు చెల్లించలేదని ఎస్సీ కాలనీ అంతటికీ కరెంట్ నిలుపుదల చేశారన్నారు. అప్పు తిరిగి చెల్లించండని అడిగిన దళితుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment