వైఎస్సార్ సీపీ నేతపై దాడి
తాళ్లరేవు, న్యూస్‌లైన్ :వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ వర్గీయుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జార్జిపేటలో వైఎస్సార్ సీపీ కార్యకర్త మందపల్లి రాంబాబుపై దాడి జరిగి నాలుగు రోజులు గడవకముందే.. సోమవారం అర్ధరాత్రి మరో నాయకుడిపై దాడి జరగడం సంచలనం కలిగింది. వైఎస్సార్ సీపీ తాళ్లరేవు గ్రామ కమిటీ కన్వీనర్ విత్తనాల తాతారావుపై టీడీపీ కార్యకర్త వల్లు భీష్మ బ్లేడుతో దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటనలో తాతారావు మెడ, తలపై తీవ్ర గాయాలయ్యాయి. కిళ్లీ షాపు నిర్వహించే తాతారావు.. దుకాణం మూసివేసే సమయంలో భీష్మ అక్కడకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరగ్గా, భీష్మ తన వెంట తెచ్చిన బ్లేడుతో తాతారావు మెడపై, తలపై దాడి చేశాడు.
దీంతో తాతారావుకు తీవ్ర రక్త స్రావం అవుతుండడంతో స్థానికులు వెంటనే ఆయనను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో తాతారావు, భీష్మకు మధ్య రెండు రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం భీష్మ తనపై దాడి చేశాడని, దీని వెనుక టీడీపీ నాయకుడు, తాళ్లరేవు సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసరావు, మరికొందరు ఉన్నారని తాతారావు ఆరోపించారు. కాగా ఈ సంఘటనకు బాధ్యుడైన భీష్మను కోరంగి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జార్జిపేట దాడి ఘటనలో ఇప్పటివరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో.. ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని పార్టీ నాయకులు దడాల బుజ్జిబాబు, దడాల జగదీశ్వరరావు, చిట్టూరి చలపతి తదితరులు పేర్కొన్నారు.
పలువురి పరామర్శ
టీడీపీ కార్యకర్త దాడిలో గాయపడ్డ తాతారావును పలువురు నాయకులు మంగళవారం పరామర్శించారు. పార్టీ మండల కన్వీనర్ దడాల బుజ్జిబాబు, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ దడాల జగదీశ్వరరావు, నాయకులు గంజా సూరిబాబు, చిట్టూరి చలపతి, బొంతు మోహన్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.